MI Beats GT: గుజరాత్ జోరుకు ముంబై బ్రేక్

ఐపీఎల్ 15వ సీజన్ లో కొత్త టీమ్ గుజరాత్ టైటాన్స్ జోరుకు ముంబై ఇండియన్స్ బ్రేక్ వేసింది.

  • Written By:
  • Publish Date - May 6, 2022 / 11:27 PM IST

ఐపీఎల్ 15వ సీజన్ లో కొత్త టీమ్ గుజరాత్ టైటాన్స్ జోరుకు ముంబై ఇండియన్స్ బ్రేక్ వేసింది. టోర్నీ ఆరంభం నుంచి అద్భుత ప్రదర్శనతో అదరగొడతూ ప్లే ఆఫ్ కు అడుగు దూరంలో ఉన్న గుజరాత్ ముంబై చేతిలో పరాజయం పాలైంది. విజయం ఖాయమనుకున్న దశలో చివరి ఓవర్ ను డానియల్ శామ్స్ అద్భుతంగా బౌలింగ్ చేసి ముంబైని గెలిపించాడు.
మొదట బ్యాటింగ్ కు దిగిన ముంబై ఇండియన్స్ కు ఓపెనర్లు మంచి ఆరంభాన్నిచ్చారు. వరుస వైఫల్యాల తర్వాత ఇశాన్ కిషన్, కెప్టెన్ రోహిత్ శర్మ ఫామ్ లోకి వచ్చారు. ఆరంభం నుంచే ధాటిగా ఆడుతూ గుజరాత్ బౌలర్లపై విరుచకుపడ్డారు. తొలి వికెట్ కు 7.3 ఓవర్లలో 74 పరుగులు జోడించారు. అయితే రివర్స్ స్వీప్ ఆడబోయిన రోహిత్ 43 పరుగులకు ఔటవగా.. తర్వాత ఇషాన్ కిషన్ 49 రన్స్ కు వెనుదిరిగాడు. సూర్యకుమార్ యాదవ్, పొల్లార్డ్ నిరాశపరిచినా… తిలక్ వర్మ, టిమ్ డేవిడ్ ముంబైకి మంచి స్కోర్ అందించారు. ఒకవైపు వికెట్లు పడుతున్నా…టీమ్ డేవిడ్ భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. టిమ్ డేవిడ్ కేవలం 21 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లతో 44 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. చివరి ఓవర్లో రెండు సిక్సర్లు కొట్టడంతో ముంబై 20 ఓవర్లలో 177 పరుగులు చేసింది. గుజరాత్ బౌలర్లలో రషీద్ ఖాన్ రెండు వికెట్లు తీయగా.. అల్జారీ జోసెఫ్, లాకీ ఫెర్గూసన్, ప్రదీప్ సంగ్వాన్ తలో వికెట్ పడగొట్టారు.

178 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ కు ఓపెనర్లు మెరుపు ఆరంభాన్నిచ్చారు. సాహా, శుభ్ మన్ గిల్ తొలి వికెట్ కు కేవలం 12.1 ఓవర్లలోనే 106 పరుగులు జోడించారు. గత మ్యాచ్ లతో పోలిస్తే మరింత దూకుడుగా ఆడిన వీరిద్దరినీ ముంబై బౌలర్లు ఏ మాత్రం ఇబ్బంది పెట్టలేకపోయారు. ఈ క్రమంలో సాహా 40 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 55 పరుగులు చేయగా.. గిల్ 36 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 52 పరుగులకు ఔటయ్యాడు. వీరిద్దరూ ఔటైన తర్వాత గుజరాత్ ధాటిగా ఆడే క్రమంలో హార్థిక్ పాండ్యా, సాయిసుదర్శన్ కూడా వెనుదిరిగారు. అయితే డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా ధాటిగా ఆడారు. దీంతో గుజరాత్ విజయం ఖాయంగా కనిపించింది. అయితే చివరి ఓవర్లో డానియల్ శామ్స్ అద్భుతమే చేశాడు. విజయం కోసం 9 పరుగులు చేయాల్సి ఉండగా… తొలి బంతికి సింగిల్ ఇచ్చిన శామ్స్ రెండో బంతికి పరుగులేమీ ఇవ్వలేదు. అయితే 3వ బంతికి రాహుల్ తెవాటియా రనౌటవడంతో మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. నాలుగో బంతికి సింగిల్ ఇచ్చిన శామ్స్ తర్వాతి రెండు బాల్స్ కూ పరుగులేమీ ఇవ్వకపోవడంతో ముంబై 5 పరుగుల తేడాతో విజయం సాధించింది. మూడు మ్యాచ్ లలో గుజరాత్ కు అనూహ్య విజయాలందించిన తెవాటియా , మిల్లర్ తమ మ్యాజిక్ ను రిపీట్ చేయలేకపోయారు. గుజరాత్ కు ఇది వరుసగా రెండో ఓటమి. మరోవైపు ఇప్పటికే టోర్నీ నుంచి నిష్క్రమించిన ముంబై ఇండియన్స్ కు ఇది రెండో విజయం. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో గుజరాత్ 16 పాయింట్లతో టాప్ ప్లేస్ లో కొనసాగుతుండగా.. ముంబై రెండు విజయాలు సాధించి అట్టడుగున నిలిచింది.