Sky: ఇది కల కాదు కదా… వైస్ కెప్టెన్సీపై సూర్యకుమార్ రియాక్షన్

భారత క్రికెట్ లో 2022 సూర్యకుమార్ యాదవ్ కు బాగా కలిసొచ్చింది. జట్టులోకి వచ్చిన కొద్దికాలంలోనే అద్భుతమైన ప్రదర్శనతో అదరగొట్టిన సూర్యకుమార్ టీ ట్వంటీల్లో నెంబర్ వన్ బ్యాటర్ గా నిలిచాడు.

  • Written By:
  • Updated On - December 29, 2022 / 02:06 PM IST

భారత క్రికెట్ లో 2022 సూర్యకుమార్ యాదవ్ కు బాగా కలిసొచ్చింది. జట్టులోకి వచ్చిన కొద్దికాలంలోనే అద్భుతమైన ప్రదర్శనతో అదరగొట్టిన సూర్యకుమార్ టీ ట్వంటీల్లో నెంబర్ వన్ బ్యాటర్ గా నిలిచాడు. టీమిండియాలో షార్ట్ ఫార్మేట్ కు సంబంధించి నమ్మదగిన బ్యాటర్ గా మారిపోయిన సూర్యకుమార్ పరుగుల వరద పారించాడు. ఐపీఎల్ తర్వాత తాను ఆడిన అన్ని సిరీస్ లలోనూ సత్తా చాటాడు. అతని ఫామ్ కు తగ్గట్టుగానే సెలక్టర్లు ప్రమోషన్ ఇచ్చారు. కొత్త ఏడాదిలో శ్రీలంకతో సిరీస్ కు సూర్యకుమార్ యాదవ్ వైస్ కెప్టెన్ గా నియమించారు.

ఈ ప్రమోషన్ పై సూర్యకుమార్ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నాడు. ఇది కలా నిజమా అని వ్యాఖ్యానించాడు. తనకు వైస్ కెప్టెన్సీ ఇచ్చిన విషయం తండ్రి ద్వారా తెలిసిందని చెప్పాడు. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే మా నాన్న జట్టు లిస్టుతోపాటు ఓ మెసేజ్ కూడా పంపారని చెప్పాడు. ఏ మాత్రం ఒత్తిడికి లోను కావద్దనీ. నీ బ్యాటింగ్‌ను ఎంజాయ్ చేయ్’ అంటూ మెసేజ్ పంపించారన్నాడు. ఈ విషయం నమ్మలేకపోయాననీ, ఒక్క క్షణం కళ్లు మూసుకుని కలగంటున్నానా? అని ప్రశ్నించుకున్నట్టు ఆ క్షణాలను గుర్తు చేసుకున్నాడు..

తాను ఎప్పుడూ బ్యాటింగ్‌కు వచ్చినా తన ఎలాంటి భారాన్ని మైదానం వరకు తీసుకురానని, హోటెల్, నెట్స్‌లోనే వదిలేసి వస్తానని స్పష్టం చేశాడు. గేమ్‌లో తన ఆటను మాత్రమే ఆస్వాదిస్తానని సూర్యకుమార్ చెప్పాడు. అయితే బాధ్యతగా ఆడేందుకు కొంత ఒత్తిడి ఉండాలన్నాడు. కొత్త హోదాలో బరిలోకి దిగేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్టు సూర్యకుమార్ చెప్పాడు. ప్రస్తుతం రంజీ ట్రోఫీ ఆడుతున్న సూర్యకుమార్ వచ్చే వారంతో టీమిండియాతో కలుస్తాడు. ఇదిలా ఉంటే 2022లో మొత్తం 31 మ్యాచ్‌లు ఆడిన సూర్యకుమార్ రెండు సెంచరీలు, 9 హాఫ్ సెంచరీ చేశాడు. ఓవరాల్ గా 187 స్ట్రైక్ రేటుతో 1164 పరుగులు చేశాడు. ఆసియాకప్ నుంచీ టీ ట్వంటీ క్రికెట్ లో అతని దూకుడు కొనసాగుతోంది. టీ ట్వంటీ ప్రపంచకప్ లోనూ అంచనాలను అందుకున్న సూర్యకుమార్ ఐసీసీ ర్యాంకింగ్స్ లో టాప్ బ్యాటర్ గా నిలిచాడు.