Site icon HashtagU Telugu

England : వరల్డ్‌కప్‌లో ఇంగ్లాండ్ ఫ్లాప్‌ షోకు కారణం అదేనా ? సెమీస్‌ చేరడం ఇక కష్టమే

England

Is That The Reason For England's Flop Show In The World Cup.. It Is Difficult To Reach The Semis

England in World Cup 2023 : డిఫెండింగ్‌ చాంపియన్‌ ఇంగ్లండ్‌కు ఏమైంది? 2003 వన్డే వరల్డ్‌ కప్‌లో ఇంగ్లండ్‌ జట్టు ఇంతలా దిగజారటానికి కారణాలేమిటి? కసిగా రన్స్‌ కొట్టే స్టార్‌ ప్లేయర్లు ఎందుకిలా అట్టర్‌ ఫ్లాప్‌ అయ్యారు. బజ్‌బాల్‌ క్రికెట్‌ ఆ జట్టు కొంప ముంచిందా?

వరల్డ్‌ క్రికెట్‌లో ఇంగ్లండ్‌ (England)ది ఘనమైన చరిత్ర. ఆ మాటకొస్తే 2019లో వన్డే క్రికెట్‌ ఛాంపియన్‌ కూడా. కానీ 2023 వన్డే వరల్డ్‌ కప్‌లో ఇంగ్లండ్‌ (England) అదృష్టం తారుమారైంది. నిరుడు ఆస్ట్రేలియాలో జరిగిన టీ20 ప్రపంచ కప్‌లో చాంపియన్‌షిప్‌ గెలుచుకుని భారీ అంచనాలతో ఈ ప్రపంచ కప్‌లో అడుగుపెట్టింది. ఈ ప్రపంచ కప్‌ ఫైనల్లో ఇంగ్లండ్‌ ఫైనల్‌కు చేరుకుంటుందని, టీమిండియాతో ప్రపంచకప్‌ ఫైట్‌లో తలపడుతుందని హేమా హేమీలాంటి మాజీల అంచనాలు తల్లకిందులయ్యాయి. శ్రీలంకతో చావో రేవో అన్న రీతిలో మారిన మ్యాచ్‌లో చిత్తుగా ఓడి ప్రపంచ కప్‌ సెమీస్‌ చేరే అవకాశాలు మరింత సంక్లిష్టం చేసుకుంది. హాట్‌ ఫేవరెట్‌గా ఈ టోర్నీలో బరిలోకి దిగిన బట్లర్‌ కెప్టెన్సీలోని ఇంగ్లండ్‌ టీమ్‌ అంచనాలకు తగ్గట్టు ఆడలేకపోయింది.

We’re now on WhatsApp. Click to Join.

కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలన్నట్టు ఈ మెగా ఈవెంట్లో ఇంగ్లండ్‌ ఇలా ఘోరంగా నిష్ర్కమించటానికి చాలా కారణాలే ఉన్నాయి. పసికూన ఆప్ఘాన్‌ చేతిలో ఓటమితో ఇంగ్లండ్‌ను కోలుకోని దెబ్బతీసింది. బ్యాటింగ్‌ వైఫల్యం ఆ జట్టును కోలుకోలేని దెబ్బ తీసింది. గాయాలూ కొంపముంచినప్పటికీ ఆపద సమయాల్లో ఆదుకోదగ్గ ప్లేయర్లతో సిద్ధమయ్యే భారత్‌లో అడుగుపెట్టిన ఇంగ్లీష్‌ టీమ్‌ ఆశలు అడియాశలయ్యాయి. టాస్‌ గెలిచినా తప్పుడు నిర్ణయాలు తీసుకోవటం, పిచ్‌లను సరైన రీతిలో అంచనా వేయలేకపోవటం ఇంగ్లండ్‌ అంచనాలు తారుమారవటానికి మరికొన్ని కారణాలు. బ్యాటర్లకు స్వర్గధామం లాంటి పిచ్‌లపై బౌలింగ్‌ ఎంచుకోవటం, ప్రత్యర్థి బలాన్ని తక్కువ అంచనా వేయటం వంటి పలు అంశాలు కూడా ఇంగ్లండ్‌ దుస్థితికి కారణాలు. బౌలర్ల వైఫల్యం వరుస వైఫల్యాలకు తోడైంది. ఆ తర్వాత సౌతాఫ్రికా చేతిలో ఘోర పరాజయం మూటగట్టుకున్న బట్లర్‌ సేన ఆట తీరు ఆ తర్వాత దిగజారింది. శ్రీలంకతో ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో ఓటమితో ఇంగ్లండ్‌ దారులు మూసుకుపోయాయి.

2019లో న్యూజిలాండ్‌ ను ఓడించి ప్రపంచ కప్‌ గెలుచుకున్న జట్టులోనూ ఆ తర్వాత నిరుడు ప్రపంచ కప్‌ గెలుచుకున్న జట్టులోనూ ఆడిన ఆటగాళ్లు ఈ ప్రపంచ కప్‌లో ఆడినా నిలకడ లేకపోవటం, భారీ ఇన్నింగ్స్‌ లేకపోవటం జట్టును కోలుకోలేని దెబ్బ తీసింది. బజ్‌బాల్‌ క్రికెట్‌ పేరుతో టెస్టులను సైతం టీ20 మ్యాచ్‌ల్లా ఆడిన ఇంగ్లండ్‌ దూకుడే ఈ దుస్థితికి కారణమన్నవారూ లేకపోలేదు.మిగతా మ్యాచ్‌ల్లో గెలిచినా ఇంగ్లండ్‌ తలరాత మారే పరిస్థితి ఏ మాత్రం మారదు. మిగతా జట్ల ఫలితాలపై ఇంగ్లండ్‌ అదృష్ఠం ఆధారపడి ఉంటుంది. మిగిలిన నాలుగు మ్యాచ్‌లు గెలిస్తే ఇంగ్లండ్‌కు టాప్‌ ఫోర్‌లో నిలిచే ఛాన్సుంది. అయితే మిగతా నాలుగు మ్యాచ్‌లు ఇంగ్లండ్‌ గెలవటం అంత సులువు కాదు. భీకర ఫామ్‌లో ఉన్న టీమిండియాతో సొంతగడ్డపై ఇంగ్లండ్‌ విజయం అంత ఈజీ కాదు. ఇండియాతో పాటు ఆస్ర్టేలియా, నెదర్లాండ్స్‌, పాకిస్థాన్‌లతో ఇంగ్లండ్‌ నెక్ట్స్‌ మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ప్రపంచ కప్‌లో వరుసగా మూడు మ్యాచ్‌ల్లో ఇంగ్లండ్‌ ఆలౌట్‌ అయింది. ఇప్పుడున్న లెక్కల ప్రకారం… ఫామ్‌లో ఉన్న మిగిలిన జట్లను ఎదుర్కొనటం ఇంగ్లాండ్‌కు సవాలే. ప్రస్తుత పరిస్థితుల్లో ఇంగ్లీష్ టీమ్‌ ప్రపంచకప్‌ నుంచి దాదాపుగా నిష్ర్కమించినట్టే.

Also Read:  Hardik Pandya: టీమిండియాకు గుడ్ న్యూస్.. కోలుకుంటున్న హార్దిక్ పాండ్యా..!