Mohammed Shami: షమీ టీ ట్వంటీ కెరీర్ ముగిసినట్టేనా ?

టీ ట్వంటీ వరల్డ్ కప్ ప్రారంభానికి ముందు టీమిండియా కొన్ని మ్యాచ్‌లు మాత్రమే ఆడనుంది.

  • Written By:
  • Publish Date - June 20, 2022 / 07:24 PM IST

టీ ట్వంటీ వరల్డ్ కప్ ప్రారంభానికి ముందు టీమిండియా కొన్ని మ్యాచ్‌లు మాత్రమే ఆడనుంది. తాజాగా దక్షిణాఫ్రికాతో ముగిసిన సిరీస్‌లో జట్టు మేనేజ్‌మెంట్ చాలా మంది కొత్తవారికి అవకాశం ఇచ్చింది. అందులో హర్షల్ పటేల్, అవేశ్ ఖాన్ పర్వలేదనిపిస్తే ఉమ్రాన్ మాలిక్, అర్ష్‌‌దీప్ సింగ్ మాత్రం తుది జట్టులో ఆడలేదు. దీంతో ప్రపంచకప్ జట్టులో ఎవరుంటారనే డైలామా కొనసాగుతుంది. భువనేశ్వర్ కుమార్, దీపక్ చాహర్, జస్ప్రీత్ బుమ్రా లాంటి టాప్ క్లాస్ బౌలర్లు దాదాపు ఎంపికయ్యే అవకాశముండగా.. హర్షల్ పటేల్, అవేశ్ ఖాన్‌లు, ఉమ్రాన్ మాలిక్, అర్ష్ దీప్ సింగ్, మహమ్మద్ షమీ లాంటి బౌలర్లలో ఎవరు ఎంపికవుతారనే దానిపై సస్పెన్స్ నెలకొంది.
ముఖ్యంగా మహ్మద్ షమీకి టీ ట్వంటీ వరల్డ్ కప్ లో చోటు దక్కడం డౌట్ గానే కనిపిస్తోంది. గత ఏడాదిటీ ట్వంటీ వరల్డ్ కప్ తర్వాత భారత జట్టు న్యూజిలాండ్‌, వెస్టిండీస్, శ్రీలంకలతో సిరీస్‌లు ఆడింది. అయితే షమీకి ఈ సిరీస్‌లలో ఒక్కదాంట్లో కూడా చోటు దక్కలేదు. దీంతో షార్ట్ ఫార్మాట్ కు షమీని సెలక్టర్లు పరిగణలోకి తీసుకోవడం లేదని భావిస్తున్నారు. తాజాగా దీనిపై మాజీ క్రికెటర్ ఆశిష్ నెహ్ర స్పందించాడు.
ఆస్ట్రేలియాలో జరిగే టీ20 ప్రపంచకప్‌లో షమీ ఆడకపోవచ్చని పేర్కొన్నాడు. కాకపోతే వచ్చే ఏడాది స్వదేశంలో జరిగే వన్డే ప్రపంచకప్‌లో మాత్రం షమీ కచ్చితంగా ఉంటాడని తెలిపాడు.
షమీ సుదీర్ఘ స్పెల్స్ వేయగలడనీ, ఇంగ్లాండ్‌తో టెస్టు మ్యాచ్ ముగిసిన తర్వాత జరిగే వన్డే సిరీస్‌లో మహ్మద్ షమీ తప్పకుండా ఆడతాడని అనుకుంటున్నట్టు చెప్పాడు. ఇంగ్లాండ్‌ని ఇంగ్లాండ్‌లో ఓడించాలంటే టాప్ క్లాస్ ప్లేయర్లతో బరిలో దిగాలన్నాడు. అందుకే మహ్మద్ షమీని వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీకి ఫిట్‌గా ఉంచేందుకు టీ ట్వంటీ లకు దూరంగా పెడుతున్నారేమోననీ అభిప్రాయపడ్డాడు.భారత జట్టు తరుపున 17 టీ20 మ్యాచులు ఆడిన మహ్మద్ షమీ, 18 వికెట్లు తీశాడు. 79 వన్డేల్లో 148 వికెట్లు పడగొట్టాడు. దీంతో టీ ట్వంటీ ఫార్మాట్ లో షమీ అంతర్జాతీయ కెరీర్ ముగిసినట్టేననీ భావిస్తున్నారు. అయితే వన్డే వరల్డ్ కప్ కోసం సిద్ధం చేస్తున్న ప్రణాళికల్లో అతను ఖచ్చితంగా ఉంటాడని అంచనా వేస్తున్నారు.