Site icon HashtagU Telugu

Dinesh Karthik: పంత్ ప్లేస్ డేంజర్ లో పడిందా ?

Dinesh Karthik Kkr Imresizer

Dinesh Karthik Kkr Imresizer

గత కొంత కాలంగా టీమిండియాలో ప్రతీ స్థానానికి గట్టి పోటీ నెలకొంది. ఒకప్పటితో పోలిస్తే ఐపీఎల్ కారణంగా ఒక్కో ప్లేస్ కూ కనీసం ముగ్గురు రేసులో ఉంటున్నారు. ఏదైనా టూర్ కోసం జట్టును ఎంపిక చేయడం సెలక్టర్లకు కాస్త ఇబ్బందే అవుతోంది. అలాంటప్పుడు వచ్చిన అవకాశం సద్వినియోగం చేసుకునే పని ఆటగాళ్ళదే. జట్టులో ఏ ఒక్కరి ప్లేస్ శాశ్వతం కాదని ఇప్పటికే కోచ్ ద్రావిడ్ స్పష్టం చేశాడు. ఈ నేపద్యంలో యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ తన పేలవ ఫామ్ తో టీమ్ మేనేజ్ మెంట్ ను టెన్షన్ పెడుతున్నాడు. పంత్ ఫామ్ అందుకోకుంటే టీ20 ప్రపంచకప్‌లో రిషభ్ పంత్‌ ఆడటం కష్టమేనని మాజీ క్రికెటర్‌ వసీమ్‌ జాఫర్‌ అంటున్నాడు. ప్రస్తుతం అతడి ఆటతీరు అంచనాలకు తగ్గట్టు లేదని పేర్కొన్నాడు. కేఎల్‌ రాహుల్‌, దినేశ్ కార్తీక్‌ వికెట్‌ కీపింగ్‌ చేసే నేపథ్యంలో అతడు ఆడటం సందిగ్ధమేనని జాఫర్ అభిప్రాయ పడ్డాడు.

రిషభ్ పంత్‌ నిలకడగా రన్స్‌ చేయాలని జాఫర్ సూచించాడు. ఐపీఎల్‌లోనూ అతడి ప్రదర్శన అంతంత మాత్రంగానే ఉన్న విషయాన్ని తాను చాలాసార్లు చెప్పినట్టు గుర్తు చేశాడు. టెస్టులు, వన్డేల్లోనూ కొన్ని మంచి ఇన్నింగ్సులు ఉన్నా… టీ ట్వంటీల్లో మాత్రం అలా ఆడలేక పోతున్నాడనీ జాఫర్ చెప్పుకొచ్చాడు. తన అభిప్రాయం ప్రకారం టీ ట్వంటీ ప్రపంచకప్‌ తుది జట్టులో రిషభ్‌ పంత్‌కు చోటు కష్టమేననీ జాఫర్‌ పేర్కొన్నాడు.
నిజానికి షార్ట్ ఫార్మాట్ లో రిషభ్ పంత్‌కు మంచి పేరుంది. ఐపీఎల్‌లో అతనాడిన ఇన్నింగ్సులకు ఎంతో మంది ఫిదా అయ్యారు. అలాంటిది అంతర్జాతీయ టీ ట్వంటీల్లో మాత్రం ఆశించిన రీతిలో ఆడటం లేదు. ప్రస్తుత దక్షిణాఫ్రికా సిరీసులోనూ దూకుడుగా ఆడలేకపోతున్నాడు. కెప్టెన్సీ విషయంలోనూ పెద్దగా ఆకట్టుకోలేక పోవడంతో మరింత ఒత్తిడికి లోనవుతున్నట్టు కనిపిస్తోంది. అదే సమయంలో వెటరన్ వికెట్ కీపర్ దినేష్ కార్తీక్ ఫుల్ ఫామ్ తో అదరగొడుతుండడంతో మాజీ ప్లేయర్స్ పంత్ కంటే డీకే వైపే మొగ్గు చూపుతున్నారు.