Irfan Pathan: రెస్ట్ తీసుకుంటే ఫామ్ లోకి వస్తారా ?

వెస్టిండీస్ తో సిరీస్ కోసం ప్రకటించిన జట్టులో పలువురు సీనియర్ ప్లేయర్లకు రెస్ట్ ఇచ్చారు.

  • Written By:
  • Updated On - July 7, 2022 / 11:19 PM IST

వెస్టిండీస్ తో సిరీస్ కోసం ప్రకటించిన జట్టులో పలువురు సీనియర్ ప్లేయర్లకు రెస్ట్ ఇచ్చారు. విరాట్ కోహ్లి, రోహిత్‌ శర్మ, జస్ప్రీత్‌ బుమ్రా, రిషబ్‌ పంత్‌, మహ్మద్‌ షమీలు కరేబియన్ టూర్ లో జరగే వన్డేలకు దూరమయ్యారు. అయితే గత కొంత కాలంగా వరుస సిరీస్ లకు సీనియర్లు విశ్రాంతి తీసుకోవడంపై భారత మాజీ ఆల్‌రౌండర్‌ ఇర్ఫాన్‌ పఠాన్ మండిపడ్డాడు. సెలెక్టర్లు అసలే ఫామ్‌ కోల్పోయి నానా తంటాలు పడుతున్న కోహ్లి, రోహిత్‌లను విండీస్‌తో వన్డేలకు పక్కకు పెట్టడం ఎంత వరకు సబబని పరోక్షంగా ప్రశ్నించాడు. రెస్ట్‌ తీసుకుంటే ఏ ఆటగాడూ ఫామ్‌లోని రాడని ఘాటు వ్యాఖ్యలు చేశాడు.

ఇర్ఫాన్‌ తన ట్వీట్‌లో కోహ్లి, రోహిత్‌ల పేర్లను ప్రస్తావించనప్పటికీ నెటిజన్లకు విషయం అర్ధమై సదరు ట్వీట్‌తో ఏకీభవిస్తున్నారు. ఈ విషయంలో ఇర్ఫాన్‌ వాదన కరెక్టేనని వారు అభిప్రాయపడుతున్నారు. సోషల్‌మీడియాలో ఇర్ఫాన్‌ ట్వీట్‌కు మద్దతుగా భారీ ప్రచారం చేస్తున్నారు. ఇర్ఫాన్‌ ట్వీట్‌ ప్రస్తుతం నెట్టింట హాట్‌ టాపిక్‌గా మారింది. కాగా, విండీస్‌తో మూడు వన్డేల కోసం ఎంపిక చేసిన జట్టులో పలువురు యువ ఆటగాళ్ళకు చోటు దక్కగా… సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. గత ఏడు నెలల్లో భారత కెప్టెన్ మారడం ఇది ఏడోసారి.

విశ్రాంతి పేరుతో సీనియర్లు దూరమవడం, రొటేషన్ పాలసీకి బీసీసీఐ ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడంపై విమర్శలు వస్తున్నాయి. టీ ట్వంటీ వరల్డ్ కప్ కు సమయం దగ్గర పడుతుంటే ఇలాంటి ప్రయోగాలు అవసరమా అని ప్రశ్నిస్తున్నారు. ఇదిలా ఉంటే, సిరీస్‌కు ఓ కొత్త కెప్టెన్‌ను ప్రకటించడంపై కూడా టీమిండియా అభిమానులు, విశ్లేషకులు ధ్వజమెత్తుతున్నారు.సెలెక్టర్లు తరుచూ కెప్టెన్లను మారుస్తూ టీమిండియాను సర్వనాశనం చేస్తున్నారని వారు మండిపడుతున్నారు.