టీ ట్వంటీ ప్రపంచకప్ లో అగ్రశ్రేణి జట్లతో వరుణుడు ఆటాడుకుంటున్నాడు. వర్షం కారణంగా సౌతాఫ్రికా గెలుపు ముంగిట పాయింట్లు పంచుకోవాల్సి వస్తే.. తాజాగా వర్షం దెబ్బకు ఇంగ్లాండ్ పై ఐర్లాండ్ సంచలన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ కు దిగిన ఐర్లాండ్ 157 పరుగులు చేసింది. ఆండీ బాల్బీరైన్ హాఫ్ సెంచరీతోరాణించగా.. లోర్కాన్ టక్కర్ 34 పరుగులు చేశాడు. ఈ ఇద్దరి ధాటికి 11 ఓవర్లలోనే 100 పరుగులు చేసిన ఐర్లాండ్ ఆ తర్వాత వరుసగా వికెట్లు కోల్పోయింది. బాల్బీరైన్ 62 రన్స్ చేశాడు. ఇంగ్లండ్ బౌలర్లలో మార్క్ వుడ్ 3, లివింగ్ స్టోన్ 3 వికెట్లతో ఐర్లాండ్ ను కట్టడి చేశారు. సామ్ కరన్ రెండు వికెట్లు తీయగా.. బెన్ స్టోక్స్‌కు ఒక వికెట్ దక్కింది.
ఛేజింగ్ లో ఇంగ్లాండ్ కు ఆరంభంలోనే షాక్ తగిలింది. కెప్టెన్ బట్లర్ డకౌటవగా..హేల్స్ 7 పరుగులకే ఔటయ్యాడు. కాసేపటికే బెన్ స్టోక్స్ కూడా వెనుదిరగడంతో ఇంగ్లాండ్ 29 రన్స్ కే 3 వికెట్లు చేజార్చుకుంది. ఈ దశలో డేవిడ్ మలాన్, బ్రూక్స్ ఆదుకునే ప్రయత్నం చేశారు. అయితే ఐర్లాండ్ బౌలర్లు వీరిద్దరినీ భారీ షాట్లు కొట్టనివ్వకుండా కట్టడి చేయగలిగారు. ఈ క్రమంలో బ్రూక్స్ 18 , మలాన్ 35 రన్స్ కు ఔటయ్యారు. తర్వాత మెయిన్ అలీ, లివింగ్ స్టోన్ ఇన్నింగ్స్ కొనసాగించారు. జట్టు స్కోర్ 105 పరుగుల దగ్గర ఉండగా.. వర్షం అడ్డంకిగా నిలిచింది. అప్పటికి డక్ వర్త్ లూయీస్ ప్రకారం ఇంగ్లాండ్ 5 పరుగులు వెనుకబడి ఉంది. మ్యాచ్ మళ్ళీ జరిగే అవకాశం లేదని తేల్చిన అంపైర్లు ఐర్లాండ్ ను విజేతగా ప్రకటించారు. ఒక విధంగా ఇది టోర్నీలో మరో సంచలనంగానే చెప్పాలి. ఇంగ్లాండ్ పై ఐర్లాండ్ 11 ఏళ్ళ తర్వాత విజయం సాధించింది.2011 వన్డే ప్రపంచకప్ లోనూ ఐరిష్ టీమ్ , ఇంగ్లాండ్ పై సంచలన విజయం సాధించింది. సరిగ్గా 11 ఏళ్ళ తర్వాత మళ్ళీ చిరస్మరణీయ విజయాన్ని అందుకుంది. కేవలం వర్షం కారణంగానే కాదు ఈ మ్యాచ్ లో ఐర్లాండ్ బౌలర్లు ఆకట్టుకున్నారు. క్వాలిఫైయింగ్ టోర్నీలో విండీస్ కు షాకిచ్చిన ఐర్లాండ్ ఇప్పుడు టైటిల్ ఫేవరెట్ ఇంగ్లాండ్ నూ ఓడించారు. కాగా ఒక విజయం, ఒక ఓటమితో ఇంగ్లాండ్ పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది.
Just look what it means ❤️#IREvENG #BackingGreen #T20WorldCup ☘️🏏 pic.twitter.com/esrWfiszEJ
— Cricket Ireland (@cricketireland) October 26, 2022