Site icon HashtagU Telugu

IRE vs ZIM : ఫోర్ పోకుండా ఆపావు.. 5 ర‌న్స్ వ‌చ్చాయ్‌.. ఏం లాభం నాయ‌నా..?

Fielder Saves The Boundary

Fielder Saves The Boundary

క్రికెట్ మ్యాచ్‌లో ప్ర‌తీ జ‌ట్టు గెల‌వాల‌నే ప్ర‌య‌త్నం చేస్తుంటుంది. ఏ జ‌ట్టు కూడా ప్ర‌త్య‌ర్థి జ‌ట్టుకు అప్ప‌నంగా ప‌రుగులు ఇవ్వాల‌ని అనుకోలేదు. కాగా.. కొన్ని సార్లు ఫీల్డ‌ర్లు చేసే పొర‌పాట్ల‌ వ‌ల్ల ప్ర‌త్య‌ర్థి జ‌ట్టుకు అద‌నంగా ప‌రుగులు వ‌స్తుంటాయి. అయితే.. ఇలాంటి ఘ‌ట‌న‌లు చాలా అరుదుగా జ‌రుగుతుంటాయి.

ఐర్లాండ్‌, జింబాబ్వే జ‌ట్ల మ‌ధ్య జ‌రిగిన ఏకైక టెస్టు మ్యాచ్‌లో చోటు చేసుకున్న ఓ ఘ‌ట‌నకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఓ ఫీల్డ‌ర్ చాలా క‌ష్ట‌ప‌డి బంతి బౌండ‌రీ వెళ్ల‌కుండా ఆపాడు. అయితే.. అత‌డి దుర‌దృష్టం ఏంటంటే.. అప్ప‌టికే ప్ర‌త్య‌ర్థి జ‌ట్టు ఆట‌గాళ్లు ఐదు ప‌రుగులు చేశారు.

ఐర్లాండ్ రెండో ఇన్నింగ్స్ 18వ ఓవ‌ర్‌లో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. జింబాబ్వే బౌల‌ర్ రిచ‌ర్డ్ న‌గ‌ర‌వ ఈ ఓవ‌ర్‌ను వేశాడు. ఈ ఓవ‌ర్‌లోని మూడో బంతిని ఆండీ మెక్‌బ్రైన్ క‌వ‌ర్స్ దిశ‌గా చ‌క్క‌టి షాట్ ఆడాడు. జింబాబ్వే ఫీల్డ‌ర్ టెండాయ్ చ‌టారా ఎంతో క‌ష్ట‌ప‌డి బాల్‌ను ఛేజ్ చేసి మ‌రీ బౌండ‌రికి వెళ్ల‌కుండా లైన్ వ‌ద్ద చేతితో బాల్‌ను వెన‌క్కి నెట్టాడు. బాల్ బౌండ‌రీ లైన్‌ను తాక‌కుండా మైదానంలోనే ఉంది. అయితే.. అత‌డు మాత్రం త‌న ప‌రుగును నియంత్రించుకోలేక పోయాడు. బౌండ‌రీ లైన్ ఆవ‌ల ఉన్న హోర్డింగ్ పై నుంచి జంప్ చేశాడు. అత‌డు అక్క‌డి నుంచి తిరిగి మైదానంలోకి వ‌చ్చి బంతిని వికెట్ కీప‌ర్ కు అందించాడు. ఈ స‌మ‌యంలో ఐర్లాండ్ బ్యాట‌ర్లు ఎంచ‌క్కా ఐదు ప‌రుగులు తీశారు.

ఈ వీడియో వైర‌ల్‌గా మార‌డంతో నెటిజ‌న్లు అత‌డి క‌ష్టం వృథా అని అంటున్నారు. దాని కంటే అత‌డు బాల్‌ను బౌండ‌రీకి వెళ్ల‌నిచ్చినా నాలుగు ప‌రుగులే వ‌చ్చేవ‌ని అంటున్నారు.

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. జింబాబ్వే, ఐర్లాండ్ జ‌ట్ల మ‌ధ్య జ‌రిగిన ఏకైక టెస్టు మ్యాచ్‌లో ఐర్లాండ్ నాలుగు వికెట్ల తేడాతో విజ‌యం సాధించింది. ఈ మ్యాచ్‌లో మొద‌ట బ్యాటింగ్ చేసిన జింబాబ్వే తొలి ఇన్నింగ్స్‌లో 210 ప‌రుగుల‌కు కుప్ప‌కూలింది. ఐర్లాండ్ త‌న మొద‌టి ఇన్నింగ్స్‌లో 250 ప‌రుగులు చేసింది. దీంతో 40 ప‌రుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం ఐర్లాంఢ్‌కు ల‌భించింది. అనంత‌రం రెండో ఇన్నింగ్స్‌లో జింబాబ్వే 197 ప‌రుగుల‌కే ఆలౌట్ కావ‌డంతో ఐర్లాండ్ ముందు 158 ప‌రుగుల ల‌క్ష్యం నిలిచింది. ఈ లక్ష్యాన్ని ఐర్లాండ్ 6 వికెట్లు కోల్పోయి అందుకుంది.

Also read : UPT20 League: టీ20 లీగ్‌లో భువనేశ్వర్ రీ ఎంట్రీ