ఐపీఎల్ క్రేజ్‌ను అడ్డుపెట్టుకుని టికెట్ల విక్రయాల్లో జరుగుతున్న భారీ దందా తాజాగా వెలుగులోకి వచ్చింది. బెంగళూరు వేదికగా జరిగిన మ్యాచ్ టికెట్లను భారీ ధరలకు బ్లాక్ మార్కెట్‌లో విక్రయిస్తున్న ముఠాను పోలీసులు పట్టుకోవడంతో క్రికెట్ వర్గాల్లో కలకలం రేగుతోంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఆర్సీబీ (RCB) మరియు లక్నో సూపర్ జెయింట్స్ (LSG) మ్యాచ్ టికెట్ల అమ్మకాల్లో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినట్లు పోలీసులు గుర్తించారు. స్టేడియంలో క్యాంటీన్ వర్కర్‌గా పనిచేస్తున్న చంద్రశేఖర్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి సుమారు 181 ఐపీఎల్ టికెట్లను స్వాధీనం చేసుకున్నారు. సాధారణంగా తక్కువ ధరకు లభించే ఈ టికెట్లను, అభిమానుల ఆశను సొమ్ము చేసుకునేలా రూ. 15,000 నుండి రూ. 19,000 వరకు విక్రయిస్తున్నట్లు విచారణలో తేలింది.
కేఎస్‌సీఏ సభ్యుడి హస్తం?
ఈ వ్యవహారంలో కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ (KSCA) సభ్యుడు గణేశ్ పరీక్షిత్ పాత్ర ఉన్నట్లు ప్రధాన నిందితుడు వెల్లడించడం సంచలనంగా మారింది. గణేశ్ స్వయంగా తనకు ఈ టికెట్లను అందజేసి, బయట మార్కెట్‌లో అత్యధిక ధరలకు అమ్మాలని పురమాయించినట్లు చంద్రశేఖర్ పోలీసులకు వివరించాడు. ప్రస్తుతం ఈ కేసులో కీలక సూత్రధారిగా భావిస్తున్న గణేశ్ పరారీలో ఉండగా, పోలీసులు అతని కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. క్రికెట్ అసోసియేషన్ అంతర్గత సభ్యులే ఇలాంటి అక్రమాలకు పాల్పడటంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
అభిమానుల జేబులకు చిల్లు
ఐపీఎల్ మ్యాచ్‌లను స్టేడియంలో చూడాలనే అభిమానుల ఉత్సాహాన్ని కొందరు కేటుగాళ్లు వ్యాపారంగా మార్చుకుంటున్నారు. ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్ చేసుకునే సమయంలో ‘సోల్డ్ అవుట్’ అని వస్తుండటంతో, గత్యంతరం లేక అభిమానులు బ్లాక్ మార్కెట్ నిర్వాహకులను ఆశ్రయిస్తున్నారు. ఫలితంగా వేల రూపాయలు వెచ్చించి టికెట్లు కొనాల్సి వస్తోంది. ఈ దందా కేవలం బెంగళూరుకే పరిమితమా లేక ఇతర నగరాల్లోని స్టేడియాల్లోనూ ఇలాంటి అక్రమాలు జరుగుతున్నాయా అనే కోణంలో పోలీసులు లోతైన దర్యాప్తు జరుపుతున్నారు.
