IPL Qualifier: టాప్ టీమ్స్ మధ్య బిగ్ ఫైట్

ఐపీఎల్ 2022 సీజన్‌లో తొలి ప్లే ఆఫ్ బెర్త్ ఎవరిదో ఇవాళ తేలిపోనుంది.

  • Written By:
  • Publish Date - May 10, 2022 / 12:47 PM IST

ఐపీఎల్ 2022 సీజన్‌లో తొలి ప్లే ఆఫ్ బెర్త్ ఎవరిదో ఇవాళ తేలిపోనుంది. ఎంసీఏ స్టేడియం వేదికగా సీజన్ ఆరంభం నుంచి వరుస విజయాలతో ప్రత్యర్థులకి చెమటలు పట్టిస్తున్న గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు ఢీకొనబోతున్నాయి. తాజా సీజన్‌లో ఇప్పటి వరకూ 11 మ్యాచ్‌లాడిన రెండు జట్లూ 8 మ్యాచ్‌ల్లో గెలుపొంది.. 16 పాయింట్లతో టాప్-2లో కొనసాగుతున్నాయి. లక్నో సూపర్ జెయింట్స్ నెట్ రన్‌రేట్ 0.703గా ఉండగా.. గుజరాత్ టైటాన్స్ నెట్ రన్‌రేట్ 0.120గా ఉంది. ఈ వ్యత్యాసమే ఇప్పుడు లక్నో టీమ్‌ని టాప్‌లో నిలిపింది. ఈ మ్యాచ్‌కు ముందు ఆడిన త‌మ చివ‌రి మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ కేకేఆర్ పై 75 ప‌రుగుల తేడాతో విజ‌యం సాధించగా.. గుజరాత్ టైటాన్స్ జట్టు ముంబై ఇండియన్స్ పై 5 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.

ఈ మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ విషయానికొస్తే.. ఆ జట్టు సారథి రాహుల్ 11 మ్యాచుల్లో 451 పరుగులతో జట్టులో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ఉన్నాడు అలాగే మరో ఓపెనర్ క్వింటన్ డి కాక్ కూడా 11 మ్యాచుల్లో 344 పరుగులు సాధించాడు. ఇక బౌలింగ్ లో అవేశ్ ఖాన్ 9 మ్యాచ్‌ల్లో 14 వికెట్లతో జట్టు తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా కొనసాగుతుండగా జాసన్ హోల్డర్ 9 మ్యాచ్‌ల్లో 12 వికెట్లతో తర్వాతి స్థానంలో ఉన్నాడు. ఇక గుజరాత్ టైటాన్స్ జట్టు విషయానికొస్తే.. ఆ జట్టు సారథి హార్దిక్ పాండ్యా ఈ టోర్నీలో ఆడిన 10 మ్యాచ్‌ల్లో 333 పరుగులతో జట్టు తరుపున అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా నిలిచాడు. అలాగే 11 మ్యాచ్‌ల్లో 321 పరుగులతో ఓపెనర్ శుభ్‌మన్ గిల్ తర్వాతి స్థానంలో ఉన్నాడు. ఇక బౌలింగ్‌లో మహ్మద్ షమీ 11 మ్యాచ్‌ల్లో 15 వికెట్లు పడగొట్టగా.. లాకీ ఫెర్గూసన్ 11 మ్యాచ్‌ల్లో 12 వికెట్లతో తర్వాతి స్థానంలో నిలిచాడు.

అయితే ఈ మ్యాచ్ జరగనున్న పూణేలోని ఎంసీఏ స్టేడియం పిచ్ విషయానికొస్తే.. ఇక్కడి మొదట్లో బ్యాటింగ్‌కు, మ్యాచ్‌ సాగుతున్నకొద్దీ స్పిన్నర్లకు అనుకూలిస్తుంది. ఈ వికెట్‌పై ఛేజింగ్ చేసే జట్టుకు ఎక్కువ విజయావకాశాలు ఉన్నాయి.