IPL Playoff: ప్లే ఆఫ్ లెక్కలివే.. ఏ జట్టుకు ఛాన్సుందంటే..?

మూడు బెర్తులు.. ఆరు జట్లు.. ఇదీ ఐపీఎల్ ప్లే ఆఫ్‌ (IPL Playoff) రేస్ తాజా లెక్క.. లీగ్ స్టేజ్‌ మరో మూడు రోజుల్లో ముగుస్తుండగా.. ఇప్పటికీ ప్లే ఆఫ్‌ (IPL Playoff) బెర్త్ దక్కించుకునే జట్లపై క్లారిటీ లేదు.

  • Written By:
  • Publish Date - May 20, 2023 / 06:26 AM IST

మూడు బెర్తులు.. ఆరు జట్లు.. ఇదీ ఐపీఎల్ ప్లే ఆఫ్‌ (IPL Playoff) రేస్ తాజా లెక్క.. లీగ్ స్టేజ్‌ మరో మూడు రోజుల్లో ముగుస్తుండగా.. ఇప్పటికీ ప్లే ఆఫ్‌ (IPL Playoff) బెర్త్ దక్కించుకునే జట్లపై క్లారిటీ లేదు. గుజరాత్ మాత్రమే క్వాలిఫై అవగా.. మిగిలిన బెర్తుల కోసం ఆరు జట్లు రేసులో నిలిచాయి. ఏ జట్టు కూడా ఖచ్చితంగా చేరుతుందన్న ధీమా లేకపోవడంతో రేస్ రసవత్తరంగా మారింది. దాదాపు 50 రోజులుగా అభిమానులను ఉర్రూతలూగిస్తున్న ఐపీఎల్ 16వ సీజన్ చివరి అంకానికి చేరింది. లీగ్‌ స్టేజ్‌లో కొన్ని మ్యాచ్‌లే మిగిలి ఉండగా.. ప్లే ఆఫ్ రేస్ ఉత్కంఠను రేకెత్తిస్తోంది. ఇప్పటి వరకూ రెండు జట్లు టోర్నీ నుంచి నిష్క్రమించింది. గుజరాత్ టైటాన్స్ మాత్రమే ప్లే ఆఫ్ బెర్త్ ఖాయం చేసుకుంది.

మిగిలిన 3 బెర్తుల కోసం ప్రస్తుతం ఆరు జట్లు పోటీపడుతున్నాయి. సన్‌రైజర్స్‌పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘనవిజయం తర్వాత సమీకరణాలు మరింత రసవత్తరంగా మారిపోయాయి. ప్లే ఆఫ్స్‌కు చేరాలంటే కనీసం 16 పాయింట్లు సాధించాల్సి ఉంటుంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్న చెన్నై సూపర్‌కింగ్స్ తన చివరి మ్యాచ్‌లో ఢిల్లీపై గెలిస్తే ప్లే ఆఫ్‌కు చేరుతుంది. ఒకవేళ చెన్నై ఓడినా ప్లే ఆఫ్ రేసులో ఉంటుంది. అయితే ముంబై, బెంగూళురు, లక్నో జట్లలో ఒకటి తమ చివరి లీగ్ మ్యాచ్‌లో ఓడిపోవాలి. ఢిల్లీపై చెన్నై భారీ విజయం సాధిస్తే రెండో స్థానంతో క్వాలిఫైయిర్ 1కు అర్హత సాధిస్తుంది.

Also Read: RR vs PBKS: राగెలిచి నిలిచిన రాజస్థాన్… ఉత్కంఠ పోరులో పంజాబ్ పై విజయం

మరోవైపు 15 పాయింట్లతో ఉన్న లక్నో కు కూడా ఇప్పటి వరకూ ప్లే ఆఫ్ బెర్త్ ఖరారు కాలేదు. లక్నో టాప్ 4 లో చోటు దక్కించుకోవాలంటే చివరి లీగ్ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై గెలవాలి. చెన్నై చివరి మ్యాచ్‌లో ఓడితే లక్నో సెకండ్ ప్లేస్‌కు చేరుకుంటుంది. ఒకవేళ కోల్‌కతా చేతిలో ఓడితే మాత్రం ముంబై లేదా బెంగళూరు జట్లు తమ చివరి మ్యాచ్‌లలో ఓడిపోవాలి. లేకుంటే లక్నో ఇంటిదారి పట్టాల్సిందే. ఇదిలా ఉంటే సన్‌రైజర్స్‌పై గ్రాండ్ విక్టరీతో రన్‌రేట్‌ పెంచుకున్న ఆర్‌సీబీ తన చివరి మ్యాచ్‌లో గెలిస్తే ప్లే ఆఫ్‌కు క్వాలిఫై అవుతుంది. ఒకవేళ చివరి మ్యాచ్‌లో గుజరాత్‌పై బెంగళూరు ఓడితే మాత్రం మిగిలిన జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి వస్తుంది. సన్‌రైజర్స్‌ చేతిలో ముంబై ఓడితే అప్పుడు చెన్నై, లక్నో, బెంగళూరు ప్లే ఆఫ్స్ చేరుకుంటాయి. ఆర్‌సీబీ ఓడి ముంబై గెలిస్తే మాత్రం రోహిత్‌సేన ముందంజ వేస్తుంది. అదే సమయంలో ముంబై, బెంగళూరు రెండు జట్లూ చివరి లీగ్ మ్యాచ్‌లలో ఓడితే మిగిలిన జట్లకు అవకాశముంటుంది.

ప్రస్తుతం ప్లే ఆఫ్స్‌కు చేరేందుకు ఎక్కువ అవకాశాలున్న జట్లలో చెన్నై , లక్నో, బెంగళూరు, ముంబై ముందున్నాయి. వీటిలో చెన్నై, లక్నో టీమ్స్‌కు 95.3 శాతం ప్లే ఆఫ్ అవకాశాలు ఉండగా… ముంబైకి 60.9 శాతం ఛాన్సుంది. ఇక రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు 30.7 శాతం ఉండగా.. రాజస్థావ్ కు కేవలం 6.3 శాతమే అవకాశముంది. కోల్‌కతాకు అంతకంటే తక్కువ ఛాన్సుంది. ఈ మూడు జట్లూ తమ చివరి మ్యాచ్‌లలో గెలిచినా.. రన్‌రేట్‌తో పాటు మిగిలిన మ్యాచ్‌ల ఫలితాలు కలిసిరావాల్సి ఉంటుంది. ఢిల్లీ చేతిలో ఓడిపోవడం పంజాబ్ కింగ్స్ అవకాశాలను బాగా దెబ్బతీసింది. అద్భుతాలు జరిగితే తప్ప రాజస్థాన్, కోల్‌కతా ప్లే ఆఫ్స్ చేరడం కష్టమే. సాంకేతికంగా 3 బెర్తుల కోసం 6 జట్లు రేసులో ఉన్నప్పటకీ.. పాయింట్లు, నెట్‌రన్‌రేట్‌ను చూస్తే చెన్నై, లక్నో, ముంబై, బెంగళూరు జట్లే పోటీలో ముందున్నాయి. మొత్తం మీద లీగ్ స్టేజ్ చివరి మ్యాచ్‌ వరకూ ప్లే ఆఫ్ బెర్తులపై సస్పెన్స్ కొనసాగేలాగే కనిపిస్తోంది.