Rich BCCI: బీసీసీఐకి భారీ జాక్ పాట్

ప్రపంచ క్రికెట్‌లో సరికొత్త శకానికి తెరతీసిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రతీ విషయంలోనూ సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది.

  • Written By:
  • Updated On - June 13, 2022 / 09:44 AM IST

ప్రపంచ క్రికెట్‌లో సరికొత్త శకానికి తెరతీసిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రతీ విషయంలోనూ సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఆటగాళ్ళపై కోట్లాభిషేకం కురిసినా.. బ్రాండింగ్ , రేటింగ్స్‌ , వ్యూయర్‌షిప్‌ వంటి వాటిలో రికార్డులు నెలకొల్పడం ఐపీఎల్‌కే చెల్లింది.

మరే క్రికెట్ లీగ్‌కూ సాధ్యం కాని విధంగా ఎప్పటికప్పుడు రికార్డుల మోత మోగిస్తోంది. ఇప్పుడు ఐపీఎల్ ప్రసార హక్కుల వేలంలోనూ ఐపీఎల్ చరిత్ర సృష్టించబోతోంది. ప్రసార హక్కుల కోసం జరుగుతున్న వేలంలో బీసీసీఐపై కోట్ల వర్షం కురుస్తోంది. తొలిరోజు వేలంలోనే ప్రసార హక్కుల విలువ 43 వేల కోట్లు దాటిపోయింది. అది కూడా రెండు ప్యాకేజీలకే ఈ మొత్తం రావడం హైలెట్‌గా చెప్పొచ్చు.

బీసీసీఐ అంచనాలకు మించి వేలంలో సంస్థలు పోటీపడుతున్నాయి. అమెజాన్, గూగుల్ తప్పుకోవడంతో పోటీ ఎలా ఉంటుందో అన్న సస్పెన్స్‌ ఉన్నప్పటకీ.. రేసులో ఉన్న వయాకామ్ 18, సోనీ, డిస్నీ హాట్‌స్టార్ ప్రసార హక్కుల కోసం గట్టిగానే ప్రయత్నిస్తున్నాయి. తొలిరోజు వేలం ముగిసిన తర్వాత ఒక్కో ఐపీఎల్ మ్యాచ్ విలువ 100 కోట్లు దాటింది. రేసులో ఉన్న మూడు సంస్థలూ తీవ్రంగా పోటీపడుతుండడంతో ఈ ధర ఇంకా పెరగడం ఖాయంగా కనిపిస్తోంది. గత ఐదేళ్ళలో ఒక్కో మ్యాచ్‌ విలువ 54.5 కోట్లుగా ఉంటే ఇప్పుడు అది రెట్టింపైంది.

నిజానికి బీసీసీఐ తొలిసారి నిర్వహిస్తున్న ఈ-వేలంలో 45 వేల కోట్ల వరకూ ఆదాయం వస్తుందని అంచనా వేసింది. అయితే కొత్తగా రెండు జట్లు చేరడం, వచ్చే సీజన్ నుంచి మ్యాచ్‌ల సంఖ్య పెరగనుండడంతో రేటు అమాంతం పెరిగిపోయింది. టీవీ, డిజిటల్‌, స్పెషల్‌ మ్యాచ్‌లు, విదేశాల్లో బ్రాడ్‌కాస్టింగ్‌ హక్కులు ఇలా మొత్తం నాలుగు విభాగాల్లో బీసీసీఐ బిడ్లను ఆహ్వానించింది.

ఈ మొత్తం కలిపి బీసీసీఐ నిర్ణయించిన కనీస ధరనే 32 వేలు కోట్లుగా ఉంది. 2017-22 మధ్య ఐదేళ్ల పాటు మీడియా హక్కులను సొంతం చేసుకున్న స్టార్‌ చెల్లించిన మొత్తం రూ.16348 కోట్లు మాత్రమే. ఇప్పుడు బిడ్లు పూర్తయ్యే సమయానికి అన్నీ కలిపి సుమారు దీనికి మూడింతలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం పోటీలో ఈ డిస్నీ హాట్ స్టార్‌ తోపాటు రిలయెన్స్‌, సోనీ కూడా ఉన్నాయి. ప్రధానంగా పోటీ ఈ మూడు సంస్థల మధ్యనే పోటీ కొనసాగుతోంది.