NO Ball Controversy: పరిధి దాటినందుకు పనిష్మెంట్

ఐపీఎల్ 15వ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో నోబాల్ వివాదాన్ని ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్‌ సీరియస్‌గా తీసుకుంది.

  • Written By:
  • Updated On - April 23, 2022 / 06:42 PM IST

ఐపీఎల్ 15వ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో నోబాల్ వివాదాన్ని ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్‌ సీరియస్‌గా తీసుకుంది. పరిధి దాటి ప్రవర్తించిన ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ , సహాయక కోచ్ ప్రవీణ్ ఆమ్రేలపై చర్యలు తీసుకుంది. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు గాను రిషబ్ పంత్‌కు మ్యాచ్ ఫీజులో 100శాతం జరిమానాను విధించింది. పంత్ ప్రవర్తనను లెవల్ 2నేరంగా పరిగణించిన గవర్నింగ్ కౌన్సిల్‌.. కోడ్ ఆఫ్ కండక్ట్ ఆర్టికల్ 2.7ప్రకారం ఈ జరిమానా వేసింది.
అలాగే ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్లేయర్‌ శార్దూల్ ఠాకూర్‌ సైతం కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘించినందుకు అతని మ్యాచ్ ఫీజులో 50శాతం కోత విధించింది. ఇక మైదానంలోకి వెళ్ళి అంపైర్లతో వాగ్వాదానికి దిగినందుకు అసిస్టెంట్ కోచ్ ప్రవీణ్ ఆమ్రే మూల్యం చెల్లించుకున్నాడు. అతని మ్యాచ్ ఫీజులో 100శాతం జరిమానా విధించడంతో పాటు.. ఒక మ్యాచ్ నిషేధాన్ని విధించింది.

ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో చివరి ఓవర్ సందర్భంగా వివాదం చోటు చేసుకుంది. చివరి ఓవర్లో విజయం కోసం ఢిల్లీ 36 రన్స్ చేయాల్సి ఉండగా.. మెక్‌కాయ్ వేసిన తొలి రెండు బంతులను పావెల్ సిక్సర్లుగా మలిచాడు. తర్వాత మూడో బంతిని కూడా మెక్‌కాయ్ ఫుల్ టాస్ వేశాడు. ఆ బంతిని కూడా పావెల్ సిక్స్ కొట్టాడు. అయితే నడము కంటే ఎత్తులో టాస్ పడిందని, నోబాల్ ప్రకటించాలని ఢిల్లీ టీం సభ్యులు డగౌట్ నుంచి అరిచారు. కానీ అంపైర్ నితిన్ మీనన్ నోబాల్ ఇవ్వలేదు. మైదానంలో పావెల్ కూడా అంపైర్లతో మాట్లాడినా నోబాల్ ఇచ్చేందుకు నిరాకరించారు. దీంతో ఆగ్రహం చెందిన రిషబ్ పంత్ ఆట ఆపేసి వచ్చేయాలంటూ తమ బ్యాటర్లను డగౌట్ నుంచి పిలిచాడు. ఢిల్లీ అసిస్టెంట్ కోచ్ ఆమ్రే స్టేడియంలోకి పరిగెత్తి అంపైర్లతో వాగ్వాదానికి దిగాడు. శార్దూల్ ఠాకూర్ సైతం పంత్‌కు వంత పాడుతూ.. వచ్చేయండంటూ పావెల్, కుల్దీప్‌లకు సైగ చేశాడు. దీంతో కాసేపు గందరగోళ వాతావరణం నెలకొంది. చివరికి అంపైర్లు సర్థిచెప్పి మ్యాచ్ కొనసాగేలా చూశారు. అయితే ఢిల్లీ క్యాపిటల్స్‌ కెప్టెన్ పంత్ , కోచ్ ప్రవీణ్ ఆమ్రే ప్రవర్తనపై పలువురు మండిపడ్డారు. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్‌ వారికి పనిష్మెంట్ విధించింది.