Sanju Samson: సంజు శాంసన్‌కు సీఎస్కే ద్రోహం చేసిందా?

రాజస్థాన్ కెప్టెన్సీ వదిలేసి వచ్చిన శాంసన్‌కు.. CSK కోరుకున్న గౌరవం లేదా నాయకత్వ పాత్రను ఇవ్వలేదనే భావన వ్యక్తమవుతోంది. ఫ్రాంచైజీ మేనేజ్‌మెంట్ కేవలం ఆటగాడిగానే అతన్ని తీసుకుందా?

Published By: HashtagU Telugu Desk
Sanju Samson

Sanju Samson

Sanju Samson: గత నాలుగు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) సీజన్‌లలో రాజస్థాన్ రాయల్స్ జట్టుకు విజయవంతంగా కెప్టెన్సీ వహించిన సంజు శాంసన్ (Sanju Samson).. ఇప్పుడు ఒక సంచలన ట్రేడ్ ద్వారా ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ (CSK) గూటికి చేరడం క్రీడా వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ మార్పు వెనుక ఉన్న ఉద్దేశం ఏమిటనే దానిపై అనేక ఊహాగానాలు నెలకొన్నాయి. ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్ దిగ్గజ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని వారసుడిగా, భవిష్యత్తు కెప్టెన్‌గా శాంసన్ జట్టులో చేరబోతున్నాడనే వార్తలు బలంగా వినిపించాయి. ఈ నేపథ్యంలో అతని కెప్టెన్సీని ఖాయం చేస్తూ అధికారిక ప్రకటన వస్తుందని అభిమానులు ఆశించారు.

అయితే నవంబర్ 15న ఫ్రాంచైజీలు విడుదల చేసిన ‘రిటైన్డ్- రిలీజ్డ్’ ఆటగాళ్ల జాబితాతో పాటు CSK తీసుకున్న నిర్ణయం అందరినీ ఆశ్చర్యపరిచింది. జట్టులో సంజు శాంసన్ పేరు నిలుపుకున్న ఆటగాళ్ల జాబితాలో కనిపించినప్పటికీ.. కెప్టెన్సీ విషయంలో ఫ్రాంచైజీ క్లారిటీ ఇచ్చింది. ఐపీఎల్ 2026 సీజన్‌కు కూడా రుతురాజ్ గైక్వాడ్నే కెప్టెన్‌గా కొనసాగిస్తున్నట్లు CSK ప్రకటించింది.

Also Read: Bangladesh Ex Pm Sheikh Hasina : షేక్ హసీనా కు ఉరిశిక్ష విధిస్తూ బంగ్లాదేశ్ కోర్టు సంచలన తీర్పు.!

ఈ అనూహ్య నిర్ణయం సంజు శాంసన్ అభిమానులను, క్రికెట్ విశ్లేషకులను తీవ్ర నిరాశకు గురిచేసింది. రాజస్థాన్ రాయల్స్‌లో సుస్థిరమైన కెప్టెన్సీ పాత్రను వదులుకుని, కేవలం ఒక సాధారణ ఆటగాడిగా చెన్నై జట్టులో చేరడాన్ని ‘ద్రోహం’గానే భావించాలా అనే ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతున్నాయి. రాజస్థాన్ జట్టును 2022లో ఫైనల్‌కు, 2024లో ప్లేఆఫ్స్‌కు నడిపించిన ఘనత శాంసన్‌ది. అటువంటి అనుభవజ్ఞుడైన నాయకుడిని.. రాబోయే ఐపీఎల్ సీజన్‌కు ధోని వారసుడిగా కాకుండా కేవలం బ్యాట్స్‌మన్‌గా మాత్రమే తీసుకోవడం వెనుక CSK వ్యూహం ఏమిటనేది అంతుపట్టడం లేదు.

రాజస్థాన్ కెప్టెన్సీ వదిలేసి వచ్చిన శాంసన్‌కు.. CSK కోరుకున్న గౌరవం లేదా నాయకత్వ పాత్రను ఇవ్వలేదనే భావన వ్యక్తమవుతోంది. ఫ్రాంచైజీ మేనేజ్‌మెంట్ కేవలం ఆటగాడిగానే అతన్ని తీసుకుందా? లేక భవిష్యత్తులో కెప్టెన్సీ బాధ్యతలను అప్పగించే ప్రణాళికతోనే ప్రస్తుతానికి రుతురాజ్‌ను కొనసాగించిందా అనేది వేచి చూడాలి. ఏదేమైనా.. ఈ నిర్ణయం శాంసన్ కెరీర్‌పై, రాజస్థాన్ వదిలి వచ్చే అతని నిర్ణయంపై తీవ్ర ప్రభావం చూపనుంది.