అంపైర్ల పొరపాటు.. జరిమానా విధించాలని డిమాండ్!

ఇందులో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్, ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా, కేకేఆర్ కెప్టెన్ అజింక్యా రహానేలకు ఒక్కోసారి జరిమానా పడింది.

Published By: HashtagU Telugu Desk
IPL 2026

IPL 2026

IPL 2026: ఐపీఎల్ 2026లో దాదాపు ప్రతి మ్యాచ్ నిర్ణీత సమయం కంటే ఆలస్యంగా ముగుస్తోంది. దీనికి ప్రధాన కారణం ‘స్లో ఓవర్ రేట్’. స్లో ఓవర్ రేట్ కారణంగా కెప్టెన్లపై జరిమానాలు విధిస్తున్నప్పటికీ వారు ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకోవడం లేదు. దీనివల్ల మ్యాచ్‌లు ఆలస్యంగా ముగియడంపై ఇప్పుడు అసహనం వ్యక్తమవుతోంది. ఐపీఎల్ 2026లో ఒక మ్యాచ్ ఏకంగా 4 గంటల 22 నిమిషాల పాటు సాగింది. దీంతో ఇప్పుడు అంపైర్లపై కూడా జరిమానా విధించాలనే డిమాండ్ వినిపిస్తోంది.

అంపైర్లపై జరిమానా విధించాలి

దాదాపు ప్రతి మ్యాచ్ ఆలస్యంగా ముగియడంపై ఎంసీసీ క్రికెట్ హెడ్ ఫ్రేజర్ స్టీవర్ట్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన దీని గురించి మాట్లాడుతూ.. ‘అంపైర్లు మ్యాచ్ నెమ్మదించేలా అనుమతిస్తున్నారు. ఆటను సజావుగా నడిపించాల్సిన బాధ్యత అంపైర్లదే అని నేను భావిస్తున్నాను. కానీ ప్రతి బ్రేక్‌లోనూ అడ్వర్టైజ్‌మెంట్లు రావడం, కోట్ల మంది వీక్షించడం వంటి కారణాల వల్ల వారు ఎందుకు అలా చేయలేకపోతున్నారో అర్థం చేసుకోవచ్చు’ అని అన్నారు.

Also Read: Flipkart & Uber : ఉబర్ రైడ్‌ తో ఫ్లిప్‌కార్ట్ డీల్

అంపైర్లు మైదానంలో నిబంధనలను సరిగ్గా అమలు చేయలేకపోతున్నారని, అందుకే వారిపై కూడా చర్యలు తీసుకోవాలని స్టీవర్ట్ అభిప్రాయపడ్డారు. ఒక మ్యాచ్ సందర్భంగా తను రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 6 నుండి 7 ఓవర్లు మాత్రమే చూసి తిరిగి వచ్చానని, హోటల్‌కు చేరుకుని టీవీ ఆన్ చేసినా అప్పటికి ఇంకా 5 ఓవర్ల ఆట మిగిలే ఉందని ఆయన ఒక ఉదాహరణను చెప్పారు.

ఇప్పటివరకు ఐదుగురు కెప్టెన్లపై జరిమానా

ఐపీఎల్ 2026లో స్లో ఓవర్ రేట్ కారణంగా ఇప్పటివరకు ఐదుగురు కెప్టెన్లపై జరిమానా విధించారు. ఇందులో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్, ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా, కేకేఆర్ కెప్టెన్ అజింక్యా రహానేలకు ఒక్కోసారి జరిమానా పడింది. కాగా పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్‌పై ఏకంగా రెండుసార్లు జరిమానా విధించారు. ఇప్పటివరకు ఐపీఎల్ కెప్టెన్లపై మొత్తం 84 లక్షల రూపాయల జరిమానా పడింది. అయినప్పటికీ ఏ కెప్టెన్ కూడా దీనిపై దృష్టి సారించడం లేదు.

  Last Updated: 15 Apr 2026, 09:45 PM IST