రవీంద్ర జడేజాను జట్టు నుంచి రిలీజ్ చేయడంపై చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం తొలిసారి స్పందించింది. తప్పనిసరి పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది. ఈ విషయంపై జట్టులోని ఆటగాళ్లతో చర్చించామని.. అందరి సమ్మతితోనే ఇది జరిగిందని పేర్కొంది. చెన్నై సూపర్ కింగ్స్‌కు సంజూ శాంసన్ లాంటి ప్లేయర్ అవసరం ఉందని.. అందుకే అతడి కోసం వెళ్లామని వివరించింది.
“Decision taken on mutual agreement with Jadeja and Curran.” – CSK MD Kasi Viswanathan speaks on the trade. #WhistlePodu #Yellove 🦁💛 pic.twitter.com/8HAZrdIBJP
— Chennai Super Kings (@ChennaiIPL) November 15, 2025
ఐపీఎల్ 2026కి ముందు చెన్నై సూపర్ కింగ్స్ రవీంద్ర జడేజాను రిలీజ్ చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. 12 ఏళ్లుగా జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించిన రవీంద్ర జడేజాను వదిలేసింది. జడ్డూను రాజస్థాన్ రాయల్స్ దక్కించుకుంది. ఇందుకు గానూ సంజూ శాంసన్‌ను ఇచ్చేసింది. అయితే ఈ ట్రేడ్‌పై చెన్నై సూపర్ కింగ్స్ ఫ్యాన్స్ నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. జడ్డూను వదిలేయడంపై సీఎస్కే ఫ్యాన్స్ కొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ విషయంపై మాట్లాడిన సీఎస్కే ఫ్రాంఛైజీ సీఈవో కాశీ విశ్వనాథన్ స్పందించారు.
రవీంద్ర జడేజాను వదిలేయడానికి, సంజూ శాంసన్‌ను తీసుకోవడానికి గల కారణాలను వివరించారు. జట్టుకు టాప్ ఆర్డర్ ఇండియన్ బ్యాటర్ కావాలని చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం కోరుకుంది. కానీ మినీ వేలంలో ఎక్కువమంది భారత బ్యాటర్లు లేరు. దీంతో ట్రేడ్ ద్వారా సొంతం చేసుకోవాలనుకుని అనుకున్నాం. కొన్ని సంవత్సరాలుగా చెన్నై సూపర్‌కింగ్స్ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తూ వస్తోన్న ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాను వదులుకోవడం నిజంగా కఠినమైన నిర్ణయమే అని సీఎస్కీ సీఈవో కాశీవిశ్వనాథన్ అన్నారు.
తప్పనిసరి పరిస్థితుల్లోనే మేం ఈ నిర్ణయం తీసుకున్నాం. ఈ నిర్ణయం తీసుకునే ముందు ఆటగాళ్లతో మాట్లాడాం. వారి సమ్మతితోనే ఇదంతా జరిగింది. రవీంద్ర జడేజా కూడా సానుకూలంగానే స్పందించాడు. సామ్ కరన్‌ను వదులుకోవడం కూడా కఠిన నిర్ణయమే. వీరు తమ కెరీర్ చరమాంకంలో ఉన్నారు. ఈ నేపథ్యంలో సీఎస్కే భవిష్యత్ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నాం. భారత బ్యాటర్‌ను పొందడానికి ఇంతకంటే అవకాశం దొరకలేదు. సంజూ శాంసన్‌కు ఐపీఎల్‌లో చాలా అనుభవం ఉంది. అలాగే రాజస్థాన్ రాయల్స్‌కు కెప్టెన్‌గానూ ఉన్నాడు అని వివరించారు.
ప్రస్తుతం సీఎస్కే ఫ్యాన్స్ బాధను అర్థం చేసుకుంటాం. వారు నిరాశ చెందారు. దీనిపై మాకు చాలా మెసేజ్‌లు వచ్చాయి. కానీ తప్పలేదు. భవిష్యత్‌లో సీఎస్కే.. మెరుగైన ప్రదర్శన చేస్తుంది అని సీఎస్కీ సీఈవో కాశీవిశ్వనాథన్ చెప్పారు.
