Site icon HashtagU Telugu

IPL 2025: ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచాడు.. కట్ చేస్తే.. ఆ జట్టు కెప్టెన్ గా ప్రమోషన్ కొట్టేసాడు!

Delhi Capitals

Delhi Capitals

ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా ఎవర్ని నియమిస్తారో అనే ఉత్కంఠకు తెరపడింది. రిషబ్ పంత్ జట్టును వీడిన తర్వాత ఆ జట్టు కెప్టెన్‌గా కేఎల్ రాహుల్‌ను నియమిస్తారని అందరూ అనుకున్నారు. కానీ రాహుల్ ఆ ఆఫర్‌ను సున్నితంగా తిరస్కరించడంతో, ఆర్సీబీ మాజీ కెప్టెన్ ఫాఫ్‌ డుప్లెసిస్‌కు ఛాన్స్ వస్తుందని ఊహించారు. అయితే అందరి ఊహాగానాలను చెక్ పెడుతూ, ఢిల్లీ క్యాపిటల్స్ మేనేజ్‌మెంట్ అక్షర్ పటేల్‌ను కెప్టెన్‌గా ప్రకటించింది.

ఐపీఎల్ 2025 మరో ఎనిమిది రోజుల్లో ప్రారంభం కానున్న నేపథ్యంలో, ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా అక్షర్ పటేల్‌ను నియమిస్తూ ఆ జట్టు మేనేజ్‌మెంట్ కీలక నిర్ణయం తీసుకుంది. సీనియర్ ప్లేయర్లు ఉన్నప్పటికీ, యువ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్‌కు ఈ అవకాశం కల్పించింది. ఈ విషయాన్ని ఢిల్లీ క్యాపిటల్స్ అధికారిక సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. ఐపీఎల్ మెగా వేలానికి ముందు కెప్టెన్‌గా ఉన్న రిషబ్ పంత్‌ను ఢిల్లీ జట్టులోంచి బయటకు వదిలేసింది.

టీమిండియాలో అక్షర్ పటేల్ ప్రస్తుతం కీలకంగా మారాడు. గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత, అక్షర్‌ను ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు పంపి సంచలన నిర్ణయం తీసుకున్నాడు. మిడిల్ ఓవర్లలో బౌలింగ్ చేస్తూ, అక్షర్ అనేక వికెట్లు కూడా తీసుకుంటున్నాడు. ప్రస్తుతం, అక్షర్ పటేల్ టీమిండియా కీలక ఆల్‌రౌండర్‌గా అవతరించాడు. టీ20 వరల్డ్‌కప్ 2024, ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో టీమిండియా ఛాంపియన్స్‌గా నిలవడంలో అక్షర్ పాత్ర చాలా పెద్దది. రవీంద్ర జడేజా టీ20లకు గుడ్ బై పలకడంతో, అక్షర్ పటేల్ ఆ స్థానాన్ని భర్తీ చేశాడు. వన్డేల్లోనూ అక్షర్ తన ప్లేస్ కన్ఫార్మ్ చేసుకున్నాడు. టీమిండియా తరఫున 71 టీ20 మ్యాచ్‌లను ఆడిన అక్షర్ పటేల్, 535 పరుగులతో పాటు 71 వికెట్లు తీసుకున్నాడు. 150 ఐపీఎల్ మ్యాచ్‌లలో 1653 పరుగులు చేయగా, 123 వికెట్లు తీసుకున్నాడు.

ఐపీఎల్ చరిత్రలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఇప్పటి వరకు టైటిల్‌ను గెలవలేదు. 18వ ఐపీఎల్‌లో యువ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్‌కు కెప్టెన్సీ పగ్గాలు అందించడంతో, ఈ సారి కప్ గెలవాలని అందరూ ఆశిస్తున్నారు. 2020లో ఢిల్లీ క్యాపిటల్స్ ఫైనల్ వరకు చేరి, రన్నరప్‌గా మిగిలింది. 2008, 2009 టోర్నీల్లో సెమీఫైనల్స్‌కు చేరుకున్నా, గత మూడేళ్లుగా లీగ్ దశలోనే ఇంటిదారి పట్టింది. ఐపీఎల్ 2025లో ఈ జట్టు ఎలాంటి ప్రభావం చూపుతుందో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఢిల్లీ క్యాపిటల్స్ 2025 స్క్వాడ్

అక్షర్ పటేల్ (కెప్టెన్), కేఎల్ రాహుల్, కరుణ్ నాయర్, అభిషేక్ పోరెల్, సమీర్ రిజ్వి, అజయ్ మండల్, మాన్వంత్ కుమార్, అశుతోష్ శర్మ, మాధవ్ తివారి, నటరాజన్, ముకేశ్ కుమార్, విప్రాజ్ నిగమ్, మోహిత్ శర్మ, విజయ్, కుల్దీప్ యాదవ్, స్టార్క్, డుప్లెసిస్, జేక్ ఫ్రేజర్, ఫెరీరా, స్టబ్స్, డొనోవాన్, చమీర.

Delhi Squad