Site icon HashtagU Telugu

IPL 2025: ఈ ఐపీఎల్‌లో కోహ్లీని ఊరిస్తున్న భారీ రికార్డులివే..

Virat Kohli Upcoming Records

Virat Kohli Upcoming Records

IPL 2025: విరాట్‌ కోహ్లీ అంతర్జాతీయ టీ20 కెరీర్‌కు వీడ్కోలు పలికిన తర్వాత ఆడుతున్న తొలి ఐపీఎల్‌ సీజన్‌ ఇదే కావడంతో ఈసారి ఎలాంటి ఒత్తిడి లేకుండా ఆడే అవకాశముంది. ఐపీఎల్‌లో 8004 పరుగులతో అత్యధిక పరుగుల రికార్డు తన పేరిట లికించుకున్న కోహ్లీ.. 2024లో 15 మ్యాచ్‌లలో ఏకంగా 61.75 సగటుతో 741 పరుగులతో ఆరెంజ్‌ క్యాప్‌ను దక్కించుకున్నాడు. ఇటీవలే ముగిసిన చాంపియన్స్‌ ట్రోఫీ విజయంలో కీలకపాత్ర పోషించాడు. అయితే ఈ సీజన్‌లో కోహ్లి మరో 64 ఫోర్లు కొడితే ఐపీఎల్‌ హిస్టరీలో అత్యధిక ఫోర్లు కొట్టిన ప్లేయర్ గా రికార్డు సాధిస్తాడు. ఈ జాబితాలో 768 ఫోర్లతో శిఖర్‌ ధవన్‌ అగ్ర స్థానంలో ఉండగా.. 705 ఫోర్లతో కోహ్లీ రెండో స్థానంలో ఉన్నాడు.

ఈ సీజన్‌లో విరాట్‌ కోహ్లీ మరో నాలుగు హాఫ్‌ సెంచరీలు చేస్తే.. ఐపీఎల్‌లో అత్యధిక హాఫ్‌ సెంచరీలు చేసిన బ్యాటర్‌గా నిలుస్తాడు. ప్రస్తుతం జాబితాలో 66 ఆఫ్ సెంచరీలతో డేవిడ్‌ వార్నర్‌ తొలి స్థానంలో ఉండగా.. కోహ్లీ 63 ఆఫ్ సెంచరిలతో రెండో స్థానంలో ఉన్నాడు. అలాగే ఈ ఐపీఎల్లో కోహ్లీ మరో 114 పరుగులు చేస్తే.. టీ20 క్రికెట్‌లో 13000 పరుగులు పూర్తి చేసిన తొలి ఇండియన్ క్రికెటర్ గా అవతరిస్తాడు. ప్రస్తుతం ఈ జాబితాలో వెస్టిండీస్ విధ్వంసక వీరుడు క్రిస్‌ గేల్‌ 14562 పరుగులతో అగ్ర స్థానంలో ఉండగా ఈ జాబితాలో కోహ్లీ ఆరో స్థానంలో నిలిచాడు. అలాగే ఈ ఐపీఎల్‌ లో విరాట్‌ కోహ్లీ మరో 24 పరుగులు చేస్తే ఆసియాలో 11000 టీ20 రన్స్ సాధించిన తొలి బ్యాటర్ గా వరల్డ్ రికార్డు సాధిస్తాడు. అలాగే ఈ ఐపీఎల్‌లో కింగ్ కోహ్లీ మరో 97 పరుగులు సాధిస్తే టీ20ల్లో 5000 పరుగులు పూర్తి చేసుకున్న ఓపెనర్ల లిస్టులో చోటు దక్కించుకుంటాడు.