IPL Auction 2025: ఇండియన్ ప్రీమియర్ లీగ్ మెగా వేలం కోసం సన్నాహాలు ప్రారంభమయ్యాయి. అన్ని జట్లూ తమ తమ రిటైన్ చేయబడిన మరియు విడుదల చేయాల్సిన ఆటగాళ్ల జాబితాను తయారు చేయడంలో బిజీగా ఉన్నాయి. అయితే వచ్చే ఐపీఎల్ లో ప్రతి జట్టు ఎంత మంది ఆటగాళ్లను రిటైన్ చేసుకుంటుందన్నది అతిపెద్ద ప్రశ్నగా మారింది. మెగా వేలానికి డేట్ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. నివేదికల ప్రకారం ఈ సంవత్సరం చివరి నెలలో అంటే డిసెంబర్‌లో లేదా వచ్చే ఏడాది ఫిబ్రవరిలో నిర్వహించొచ్చు. దీనికి సంబంధించిన వివరాలను బీసీసీఐ త్వరలోనే ప్రకటించనుంది.
గతసారి మాదిరిగానే మెగా వేలం ఈసారి కూడా రెండు రోజుల పాటు కొనసాగవచ్చు. వేలం ప్రక్రియ భారత్ లోనే నిర్వహించబడుతుంది. ఇంతకు ముందు కూడా భారత్‌లో ఐపీఎల్ వేలం చాలాసార్లు నిర్వహించారు. 2024 ఐపీఎల్ మినీ వేలం నవంబర్ 19న దుబాయ్‌లోని కోకాకోలా అరేనాలో జరిగినప్పటికీ, రాబోయే సీజన్‌కు సంబంధించిన మెగా వేలం భారత్లోనే నిర్వహించాలని భావిస్తున్నారు. ఈ వేలం ముంబై(Mumbai), కోల్‌కతా లేదా బెంగళూరులో జరుగుతుంది. మెగా వేలానికి ముందు అన్ని జట్లు తమ విడుదలైన మరియు రిటైన్ చేసిన ఆటగాళ్ల జాబితాను విడుదల చేయాల్సి ఉంటుంది. వచ్చే సీజన్లో భారీ మార్పులు కనిపించబోతున్నాయి.
ఐపీఎల్(IPL 2025) నిబంధనల దృష్ట్యా ఆటగాళ్ల విషయంలో కొత్త మార్పులు జరుగుతాయి. అటు స్టార్ ఆటగాళ్లు వేలంలోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే అన్ని ఫ్రాంచైజీలు ఇప్పుడు 4కి బదులుగా 6 మంది ఆటగాళ్లను మాత్రమే ఉంచుకునే ఛాన్స్ ఉంది. అంతేకాదు ఫ్రాంచైజీల బిహేవియర్ నచ్చక వచ్చే సీజన్లో రోహిత్, కేఎల్ రాహుల్, పంత్ లాంటి బలమైన ప్లేయర్లు జట్టును వీడే అవకాశం ఉంది. ప్రస్తుతం ఊహాగానాల మధ్య అనేక వార్తలు వినిపిస్తున్నప్పటికీ త్వరలో బీసీసీఐ అన్ని ప్రశ్నలకు ఒకే సిట్టింగ్ లో సమాధానాలు ఇవ్వనుంది. అయితే ఐపీఎల్ ఫ్యాన్స్ మాత్రం ఐపీఎల్ వేలం ఎప్పుడెప్పుడా అన్నట్టుగా ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే వచ్చే సీజన్ మెగా వేలంతో పాటు సీజన్ కూడా రసవత్తరంగా సాగే అవకాశముంది.
Also Read: Greater Noida Stadium Facilities: విమర్శలపాలైన బీసీసీఐ, ఆఫ్ఘన్ చేతిలో చివాట్లు