Site icon HashtagU Telugu

SRH vs CSK: హోం గ్రౌండ్ లో సన్ రైజర్స్ జోరు… చెన్నై సూపర్ కింగ్స్ పై విక్టరీ

Srh Vs Csk

Srh Vs Csk

SRH vs CSK: ఐపీఎల్ 17వ సీజన్ లో హోం టీమ్స్ హవా కొనసాగుతోంది. తాజాగా సన్ రైజర్స్ హైదరాబాద్ సొంత గడ్డపై మరో విజయాన్ని అందుకుంది. చెన్నై సూపర్ కింగ్స్ పై 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ భారీ స్కోరు చేయలేక పోయింది.

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన చెన్నై సూపర్ కింగ్స్‌కు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌లో రచిన్ రవీంద్ర క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. చెన్నై పవర్ ప్లేలో వికెట్ నష్టానికి 48 పరుగులు చేసింది. అయితే శివమ్ దూబే, అజింక్యా రహానే ధాటిగా ఆడారు శివమ్ దూబే, వెంటనే రహానే కూడా ఔట్ అవడంతో సీఎస్‌కే పరుగుల వేగం తగ్గింది. జడేజా ధాటిగా ఆడినా డారిల్ మిచెల్ విఫలమయ్యాడు. చివరలో క్రీజులోకి వచ్చిన ధోనీ 2 బంతులే ఆడి ఒక్క పరుగే చేశాడు. చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 165 పరుగులు చేసింది.జడేజా 24 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లతో 45 , రహానే 30 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 35 రన్స్ తో టాప్ స్కోరర్లుగా నిలిచారు. సన్‌రైజర్స్ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, టీ నటరాజన్, ప్యాట్ కమిన్స్, షాబాజ్ అహ్మద్, జయదేవ్ ఉనాత్కత్ తలో వికెట్ తీసారు.

166 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సన్ రైజర్స్ కు మంచి ఆరంభమే దక్కింది. ఓపెనర్ అభిషేక్‌ శర్మ మెరుపు బ్యాటింగ్ చేశాడు. ముకేష్ కుమార్ ఓవర్లో ఏకంగా 27 రన్స్ కొట్టాడు. 37 పరుగులు చేసి ఔటైన అభిషేక్‌ ఇన్నింగ్స్‌లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లు ఉన్నాయి. సన్ రైజర్స్ పవర్ ప్లేలోనే 78 రన్స్ చేసింది. ఇక్కడే మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ నుంచి చేజారింది.తర్వాత మార్క్ రమ్ హాఫ్ సెంచరీ చేయగా మ్యాచ్ దాదాపు వన్ సైడ్ గా మారింది. సాధించాల్సిన రన్ రేట్ ఎక్కువ లేకపోవడంతో వికెట్లు పడినా ఆడుతూ పాడుతూ టార్గెట్ అందుకుంది. చివర్లో తెలుగు ప్లేయర్ నితీష్ కుమార్ రెడ్డి సిక్స్ తో మ్యాచ్ ను ముగించాడు. దీంతో సన్ రైజర్స్ 18.1 ఓవర్లో మ్యాచ్ ను ముగించింది. ఈ విజయంతో సన్ రైజర్స్ పాయింట్ల పట్టికలో అయిదో ప్లేస్ కు చేరింది.

Also Read: Earthquake: భూకంపంతో వణికిన న్యూయార్క్‌