Site icon HashtagU Telugu

IPL 2024: రోహిత్ తో 2 నెలలుగా మాట్లాడలేదు.. కెప్టెన్సీపై చర్చ అవసరం లేదన్న పాండ్యా

IPL 2024

IPL 2024

IPL 2024: ఐపీఎల్‌ 17వ సీజన్ ఆరంభానికి శుక్రవారం నుంచే తెరలేవనుంది. ఇప్పటికే అన్ని ఫ్రాంచైజీల ఆటగాళ్ళు ప్రాక్టీస్ లో బిజీ బిజీగా ఉన్నారు. అటు మోస్ట్ సక్సెస్ ఫుల్ టీమ్ ముంబై ఇండియన్స్ కూడా ముమ్మరంగా సాధన చేస్తోంది. అయితే ఈ సారి ముంబైని ఆల్ రౌండర్ హార్డిక్ పాండ్య నడిపించబోతున్నాడు. ట్రేడింగ్ లో భాగంగా గుజరాత్ టైటాన్స్ కు భారీ మొత్తం చెల్లించి హర్ధిక్ ను తీసుకున్న ముంబై అతన్ని రోహిత్ స్థానంలో సారథిగా నియమించింది. దీనిని హిట్ మ్యాన్ ఫాన్స్ తీవ్రంగా వ్యతిరేకించినా వెనక్కి తగ్గలేదు.

తొలిసారి దీనిపై స్పందించిన హార్దిక్‌ పాండ్యా కీలక వ్యాఖ్యలు చేశాడు. ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌ హోదాలో తొలిసారి మీడియాతో మాట్లాడుతూ రోహిత్‌ శర్మ గురించి ప్రస్తావించాడు. ఎన్నో ఏళ్లుగా తాను రోహిత్‌ కెప్టెన్సీలో ఆడానని.. ఈసారి మాత్రం ఇందుకు భిన్నంగా ఉండబోతుందని వ్యాఖ్యానించాడు.

ఏదేమైనా తనకు అవసరమైన సమయంలో రోహిత్‌ శర్మ కచ్చితంగా అండగా నిలబడతాడని హార్దిక్‌ పాండ్యా ధీమా వ్యక్తం చేశాడు. అసలు ఈ విషయం గురించి పెద్దగా చర్చ అవసరమే లేదనీ , తను జట్టుతోనే ఉంటాడన్నాడు. తనకు అవసరమైనపుడు కచ్చితంగా సాయం చేస్తాడన్నాడు. అతడు టీమిండియా కెప్టెన్‌ అన్న సంగతి గుర్తుపెట్టుకోవాలని హర్థిక్ వ్యాఖ్యానించాడు. తన కెప్టెన్సీలో ఎన్నో విజయాలు సాధించాడనీ, ఇప్పటి నుంచి తాను అతడి వారసత్వాన్ని ముందు తీసుకువెళ్లేందుకు కృషి చేస్తానని చెప్పుకొచ్చాడు. తన సారథ్యంలో అతడు ఆడుతున్నాడనే అంశం గురించి ఇబ్బంది పడాల్సింది ఏమీ లేదన్న పాండ్య ఇదొక మంచి అనుభవంగా మిగిలిపోతుందన్నాడు. ముంబై కెప్టెన్‌గా నియమితుడైన తర్వాత రోహిత్‌ శర్మతో మాట్లాడలేదని చెప్పాడు.తను టీమిండియా షెడ్యూల్‌తో బిజీగా ఉన్నాడనీ , ఒకరినొకరం కలిసి దాదాపు రెండు నెలలు అయిందన్నాడు. కాగా మార్చి 22న ఐపీఎల్‌ 17వ ఎడిషన్‌ మొదలుకానుండగా.. మార్చి 24న గుజరాత్‌ టైటాన్స్‌తో ముంబై తమ తొలి మ్యాచ్‌ ఆడనుంది.

Also Read: Telangana: గేట్లు తెరిచావు సరే.. ఆ గేటు నుండి ఎమ్మెల్యేలు పోకుండా చూసుకో

Exit mobile version