IPL 2024 Mini-Auction Player List : ఐపీఎల్ మినీ వేలం షార్ట్ లిస్ట్ రెడీ…బరిలో 333 మంది ప్లేయర్స్

  • Written By:
  • Publish Date - December 11, 2023 / 11:36 PM IST

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 (IPL 2024 )సీజన్ సన్నాహాలు మొదలయ్యాయి. వచ్చే సీజన్ కోసం మినీ వేలం (IPL 2024 Mini-Auction) ఈ నెల 19న జరగనుంది. దుబాయ్ (Dubai) వేదికగా జరగనున్న ఆటగాళ్ల మినీ వేలానికి సంబంధించి జాబితాను బీసీసీఐ (BCCI) విడుదల చేసింది. మొత్తం 333 మంది ఆటగాళ్లు (333 Players ) వేలం బరిలో నిలిచారు. వీరిలో 214 మంది భారత ఆటగాళ్లు ఉండగా.. 119 ఓవర్‌సీస్ ప్లేయర్లు.. ఇద్దరు అసోసియేట్ ఆటగాళ్లున్నారు. 10 ఫ్రాంచైజీల్లో మొత్తం 77 ఖాళీలు ఉన్నాయి. ఇందులో 30 మంది విదేశీ ప్లేయర్స్ కు అవకాశం ఉంది.

ఈ వేలంలో పది ఫ్రాంచైజీలు 77 మంది ఆటగాళ్ల కోసం రూ.262.95 కోట్లు ఖర్చు చేయనున్నాయి. ఈ సారీ ఫ్రాంచైజీల పర్స్ మనీని రూ. 5 కోట్లు పెంచడంతో అది మొత్తం రూ. 100 కోట్లకు చేరింది. ప్రస్తుతం గుజరాత్ టైటాన్స్ దగ్గర అత్యధికంగారూ.38.15 కోట్లు ఉన్నాయి. అత్యల్పంగా లక్నో సూపర్ జెయింట్స్ వద్ద రూ.13.5 కోట్లు ఉన్నాయి. కాగా రూ. 2 కోట్ల కనీస ధరతో 23 మంది ఆటగాళ్లు.. రూ. 1.5 కోట్ల బేస్ ప్రైజ్‌తో 13 మంది ఆటగాళ్లు వేలం కోసం రిజిస్టర్ చేసుకున్నారు.

ఈ సారి ఆక్షన్ లో ట్రావిస్ హెడ్, పాట్ కమ్మిన్స్, మిచెల్ స్టార్క్‌, రచిన్ రవీంద్ర వంటి ప్రపంచ కప్ స్టార్లు వేలంలో పాల్గొంటున్నారు. ప్రపంచ కప్ లో సంచలన ప్రదర్శనతో ఆకట్టుకున్న రవీంద్ర.. 10 మ్యాచ్‌లలో 543 పరుగులతో పాటు, 5 వికెట్లు తీయడం ద్వారా ఐపీఎల్ ఫ్రాంచైజీల దృష్టిని ఆకర్షించాడు. ఇదిలా ఉంటే మినీ వేలానికి ఒక వారం ముందు డిసెంబర్ 12న ట్రేడ్ విండో ముగియనుంది. ఐపీఎల్ 2022లో గుజరాత్ టైటాన్స్‌ పగ్గాలు అందుకున్న హార్దిక్ పాండ్యాను ట్రేడ్ ఫలితంగా.. ముంబై ఇండియన్స్ సొంతం చేసుకుంది. ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ కామెరాన్ గ్రీన్‌ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ట్రేడింగ్ చేసింది.ఇక సార్వత్రిక ఎన్నికల తేదీలు ఖరారయ్యాక ఐపీఎల్ 2024 సీజన్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను విడుదల చేయనున్నారు.

Read Also : Telangana Governor : కేసీఆర్ ఆరోగ్యం గవర్నర్ తమిళి సై ఆరా..

Follow us