Site icon HashtagU Telugu

IPL 2023: కోహ్లిని హగ్‌ చేసుకున్న గంభీర్‌.. అప్పుడు అలా ఇప్పుడు ఇలా?

Ipl 2023

Ipl 2023

ఇటీవలే ఐపీఎల్ 2023 గ్రాండ్ గా మొదలైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మ్యాచ్ లు హోరాహోరీగా సాగుతున్నాయి. టెన్షన్స్, సంతోషం, దుఖం, హై డ్రామాలు అన్ని కలిసికట్టుగా కనిపిస్తున్నాయి. ఇకపోతే తాజాగా ఐపీఎల్‌ 2023లో భాగంగా రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు – లక్నో సూపర్‌ జెయింట్స్‌ మధ్య సోమవారం మ్యాచ్‌ జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ హోరాహోరీగా సాగింది. ఈ పోరులో చివరి బంతికి ఫలితం వచ్చింది. లక్నో సూపర్‌ జెయింట్స్‌ వికెట్‌ తేడాతో ఆర్సీబీని ఓడించింది. కాగా బెంగళూరు వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 212 పరుగులు సాధించింది.

కాగా ఆర్సీబీకి ఓపెనర్లు కోహ్లి, డుప్లెసిస్‌ ఘనమైన ఆరంభాన్ని అందించారు. ఇందులో ముందుగా కోహ్లి చెలరేగిపోయాడు. అలా కోహ్లీ 35 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తయింది. ఈ క్రమంలో మరో భారీ షాట్‌కు ప్రయత్నించి మిశ్రా బౌలింగ్‌లో కోహ్లి అవుట్‌ కావడంతో తొలి వికెట్‌ పార్ట్‌నర్‌షిప్‌ ముగిసింది. తర్వాత వచ్చిన మ్యాక్స్‌వెల్‌ తనదైన శైలిలో దూకుడు ప్రదర్శించగా, మరో ఎండ్‌లో డుప్లెసిస్‌ కూడా ధాటిని పెంచాడు. రవి బిష్ణోయ్‌ ఓవర్లో రెండు భారీ సిక్స్‌లు కొట్టిన ఆర్సీబీ కెప్టెన్‌ 35 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. అలా బెంగళూరు చివరి 5 ఓవర్ లలో 75 పరుగులు చేయగా జట్టు ఇన్నింగ్స్‌లో మొత్తం 12 ఫోర్లు, 15 సిక్సర్లు ఉన్నాయి. లక్నో ఛేదన పేలవంగా ప్రారంభించింది.

తొలి ఓవర్లోనే మేయర్స్‌ 0 ను సిరాజ్‌ బౌల్డ్‌ చేయగా, పార్నెల్‌ ఒకే ఓవర్లో దీపక్‌ హుడా 9, కృనాల్‌ పాండ్యా 0,లను వెనక్కి పంపాడు. కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ కూడా ప్రభావం చూపలేకపోయాడు. మరో ఎండ్‌లో స్టొయినిస్‌ మెరుపు బ్యాటింగ్‌ సూపర్‌ జెయింట్స్‌ శిబిరంలో కాస్త ఆశలు రేపింది. హర్షల్‌ ఓవర్లో వరుస బంతుల్లో 6, 4, 4 కొట్టిన స్టొయినిస్, కరణ్‌ శర్మ వేసిన తర్వాతి ఓవర్లో సిక్స్, రెండు ఫోర్లు బాదాడు. ఆపై షహబాజ్‌ ఓవర్లోనూ రెండు భారీ సిక్సర్లు కొట్టి 25 బంతుల్లోనే స్టొయినిస్‌ హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే స్టొయినిస్‌తో పాటు రాహుల్‌ నాలుగు బంతుల వ్యవధిలో అవుట్‌ కావడంతో లక్నో గెలుపు అవకాశాలు క్షీణించాయి. అయితే పూరన్‌ అద్భుత ప్రదర్శన జట్టును విజయానికి చేరువగా తెచ్చింది. కరణ్‌ ఓవర్లో 2 సిక్స్‌లు కొట్టిన పూరన్, హర్షల్‌ ఓవర్లో 2 సిక్స్‌లు, ఫోర్‌ కొట్టాడు. పార్నెల్‌ ఓవర్లోనూ 2 ఫోర్లు, 6 బాదిన అతను 15 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీని చేరుకున్నాడు.

 

గెలుపు కోసం లక్నో 19 బంతుల్లో 24 పరుగులు చేయాల్సిన దశలో నిష్క్రమించడం చివర్లో తీవ్ర ఉత్కంఠకు కారణమైంది. గంభీర్‌ చర్య వైరల్‌ పెద్ద ఎత్తున ట్రోలింగ్‌ లక్నోకు ఆర్సీబీపై ఇదే తొలి విజయం కావడంతో ఆ జట్టు సంతోషాల్లో మునిగిపోయింది. క్రీజులో ఉన్న ఆవేశ్‌ ఖాన్‌ హెల్మెట్‌ నేలకేసి కొట్టి మరీ సెలబ్రేట్‌ చేసుకోగా ఆర్సీబీ ఆటగాళ్లతో కరచాలనం చేసిన అనంతరం లక్నో మెంటార్‌ గౌతం గంభీర్‌ ఆర్సీబీ ఫ్యాన్స్‌ను నోరు మూయాలన్నట్లు సైగ చేశాడు. దీంతో అతడిపై విమర్శలు గుప్పిస్తూ ఆర్సీబీ ఫ్యాన్స్‌ ట్రోల్‌ చేశారు. తదుపరి మ్యాచ్‌లో మీకు కోహ్లి సరైన సమాధానం ఇస్తాడు చూడండి అంటూ కామెంట్లు చేశారు. ఇందుకు కౌంటర్‌ అన్నట్లుగా లక్నో సూపర్‌ జెయింట్స్‌ ఒక ఫొటోను షేర్‌ చేసింది. ఇది ఐపీఎల్‌ యార్‌.. ఇక్కడ కేవలం ప్రేమానురాగాలకే తావుంది అంటూ కోహ్లిని గంభీర్‌ ఆత్మీయంగా హత్తుకున్న ఫొటోను షేర్‌ చేసింది. వారిద్దరు ముచ్చటించుకుంటున్న దృశ్యం పంచుకుంది. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆ ఫోటోపై క్రికెట్ ప్రేమికులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.