Site icon HashtagU Telugu

Ben Stokes: ఆ ఆల్ రౌండర్ బ్యాటింగ్ కే పరిమితం

England Cricketer

Ipl 2023.. No Bowling For ‘injured’ Ben stokes

Ben Stokes : ఐపీఎల్ 16వ సీజన్ కోసం జట్లన్నీ సన్నద్ధమవుతున్నాయి. గత సీజన్ వైఫల్యాలను మరిచిపోయి కొత్త సీజన్ లో సత్తా చాటేందుకు ప్రాక్టీస్ లో చెమటోడ్చుతున్నాయి. ఒకవైపు ఫ్రాంచైజీలన్నీ తమ జట్ల ప్రదర్శనపై అంచనాలు పెట్టుకుని కూర్చుంటే.. షాకుల మీద షాకులు తగులుతున్నాయి. అంతర్జాతీయ షెడ్యూల్ తో కొందరు ఆరంభ మ్యాచ్ లకు దూరమవుతుంటే..మరికొందరు ఫిట్ నెస్ సమస్యలు, గాయాలతో ఇబ్బంది పడుతున్నారు.

తాజాగా చెన్నై సూపర్ కింగ్స్ కు బిగ్ షాక్ తగిలింది. ఎన్నో అంచనాలు పెట్టుకుని, కోట్లు వెచ్చించిన కొనుగోలు చేసిన ఇంగ్లాండ్ స్టార్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ (Ben Stokes) కేవలం బ్యాటర్ గా మాత్రమే ఆడనున్నాడు. ఈ విషయాన్ని సీఎస్కే బ్యాటింగ్ కోచ్ మైక్ హస్సీ వెల్లడించాడు. గతకొంతకాలంగా మోకాలి సమస్యతో బాధపడుతుండడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పాడు. లీగ్‌ సెకండాఫ్‌ సమయానికి స్టోక్స్‌ పూర్తిగా కోలుకుంటే బౌలర్‌గా సేవలందిస్తాడని తెలిపాడు. వేలంలో స్టోక్స్ ను చెన్నై సూపర్ కింగ్స్ 16.25 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది.

ఆల్ రౌండర్ గా మంచి ఫామ్ లో ఉండడంతో పాటు ధోనీ తర్వాత జట్టు పగ్గాలు స్టోక్స్ కే అప్పగిస్తారన్న ప్రచారమూ ఉంది. ఈ కారణంగానే భారీ ధరకు అతన్ని వేలంలో దక్కించుకోగా.. ఇప్పుడు కేవలం బ్యాటింగ్ కే పరిమితం కానుండడంతో చెన్నై ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు. కాగా తాజా ప్రకటనతో స్టోక్స్ ఫిట్ నెస్ పైనా పలు అనుమానాలు నెలకొన్నాయి. ఇంజెక్షన్లు ఇచ్చి ఆడిస్తున్నారన్న వార్తలు వస్తున్నాయి. ఫిట్‌నెస్‌ సరిగ్గా లేనప్పుడు, హడావుడిగా అతన్ని ఎందుకు ఆడించాలని అభిమానులు ప్రశ్నిస్తున్నారు. ఇటీవల న్యూజిలాండ్ తో జరిగిన టెస్ట్ సిరీస్ లోనూ స్టోక్స్ ఎక్కువ ఓవర్లు వేయలేకపోయాడు. మోకాలి సమస్యతో ఇబ్బంది పడడమూ కనిపించింది.

ఐపీఎల్ తర్వాత ఇంగ్లాండ్ కు ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ షెడ్యూల్ ఉంది. దీంతో యాషెస్ సిరీస్ కు ఎటువంటి ఇబ్బందీ లేకుండా ఉండేందుకే స్టోక్స్ బౌలింగ్ చేయకూడదని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. కాగా గత సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ తీవ్రంగా నిరాశపరిచింది. 14 మ్యాచ్ లలో కేవలం నాలుగు విజయాలే సాధించి ప్లే ఆఫ్స్ చేరకుండానే నిష్క్రమించింది. ఈ సారి మాత్రం సొంతగడ్డపై మ్యాచ్ లు ఆడుతుండడంతో ధోనీ మళ్ళీ టైటిల్ అందిస్తాడని అభిమానులు ధీమాగా ఉన్నారు.

Also Read:  SRH Team: పేరులోనే హైదరాబాద్.. ఒక్క హైదరాబాదీ క్రికెటరూ లేడు