IPL 2023: పంత్ లేకున్నా బలంగానే ఢిల్లీ

ఐపీఎల్ ప్రారంభమై 15 ఏళ్ళు పూర్తయినా ఒక్కసారి కూడా టైటిల్ గెలవని జట్లు కొన్ని ఉన్నాయి. ఆ జాబితాలో చెప్పుకోవాల్సింది ఢిల్లీ క్యాపిటల్స్ గురించే..

  • Written By:
  • Updated On - March 29, 2023 / 05:58 PM IST

IPL 2023 : ఐపీఎల్ ప్రారంభమై 15 ఏళ్ళు పూర్తయినా ఒక్కసారి కూడా టైటిల్ గెలవని జట్లు కొన్ని ఉన్నాయి. ఆ జాబితాలో చెప్పుకోవాల్సింది ఢిల్లీ క్యాపిటల్స్ గురించే.. సీజన్లు జరుగుతున్న కొద్దీ బలంగా మారినప్పటకీ ఢిల్లీకి టైటిల్ ముచ్చట తీరలేదు. కీలక ఆటగాళ్ళు అంచనాలను అందుకోలేకపోవడంతో కొన్నిసార్లు ప్లే ఆఫ్స్‌కే పరిమితమైంది. 2021 సీజన్‌లో ఫైనల్ చేరినా తృటిలో టైటిల్ చేజార్చుకుంది. ఇక గతేడాది 14 మ్యాచ్‌ల్లో 7 మాత్రమే గెలిచి ఐదో స్థానంతో సరిపెట్టుకుంది. బ్యాటింగ్‌లో డెప్త్ లేకపోవడం ఆ జట్టు కొంపముంచింది. మినీ వేలం ద్వారా పలువురు కీలక స్థానాలను భర్తీ చేసుకున్న ఢిల్లీ ఈ సారి మరింత పటిష్టంగా కనిపిస్తోంది. అయితే కెప్టెన్ రిషభ్ పంత్ రోడ్డు ప్రమాదానికి గురై సీజన్ మొత్తానికీ దూరమవడంతో ఆసీస్ స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్‌ ఢిల్లీ కెప్టెన్సీ బాధ్యతలు అందుకున్నాడు. విధ్వంసకర బ్యాటింగ్ లైనప్ ఉండటం ఢిల్లీ క్యాపిటల్స్ అతిపెద్ద బలం..పృథ్వీ షా, మిచెల్ మార్ష్,రిలీ రోసౌ, సర్ఫరాజ్ ఖాన్, రోవ్‌మన్ పోవెల్‌తో వంటి ప్లేయర్స్‌తో చాలా బలంగా కనిపిస్తోంది. వీరిలో ఏ ముగ్గురు చెలరేగినా ప్రత్యర్థికి చుక్కలే. ఆసీస్ స్టార్ ప్లేయర్ మిచెల్ మార్ష్ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. ఇటీవల భారత్ వేదికగా జరిగిన వన్డే సిరీస్‌లోనూ దంచికొట్టాడు. అటు పృథ్వీషా, సర్ఫరాజ్ ఖాన్.. దేశవాళీ క్రికెట్‌లో దుమ్మురేపారు. ఈ సీజన్‌లో సత్తా అంతర్జాతీయ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చేందుకు ఉవ్విళ్లురుతున్నారు. ఇక కెప్టెన్‌గా డేవిడ్ వార్నర్‌కు ఐపీఎల్‌లో మంచి రికార్డు ఉంది. అతను కూడా ఫామ్ అందుకుంటే ఢిల్లీకి తిరుగుండదు.

ఇదిలా ఉంటే బౌలింగ్ పరంగానూ ఢిల్లీ మెరుగ్గానే ఉంది. పేస్ విభాగంలో నోర్జే ఢిల్లీకి మేజర్ అడ్వాంటేజ్. గత రెండు సీజన్లలోనూ నోర్జే అదరగొట్టాడు. కీలక సమయంలో వికెట్లు తీసి పలు విజయాలను అందించాడు. మరోవైపు కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్‌లతో స్పిన్ బౌలింగ్ కూడా బలంగా ఉంది. అక్షర్ పటేల్ ఆల్‌రౌండర్‌గా రాణిస్తుండడం ఢిల్లీకి కలిసొచ్చే అంశం. వీటన్నింటికి మించి రికీ పాంటింగ్ కోచ్‌గా ఉండటం ఆ జట్టు అతిపెద్ద బలం.అయితే పంత్ లేని లోటు తీర్చలేనిదే. అటు ఓవర్‌సీస్ ఆటగాళ్ల ఎంపిక కూడా ఢిల్లీ మేనేజ్‌మెంట్‌కు తలనొప్పిగా మారనుంది. జట్టులో భారత స్టార్ పేసర్లు లేకపోవడం లోటుగానే చెప్పాలి. ఓవరాల్‌గా గత సీజన్‌తో పోలిస్తే బ్యాటింగ్ డెప్త్ పెరిగిన నేపథ్యంలో ఢిల్లీ క్యాపిటల్స్‌పై అంచనాలు పెరిగాయి. తుది జట్టు ఎంపికలో ఇంపాక్ట్ ప్లేయర్ ఢిల్లీకి మరింత కీలకం కానుందని చెప్పొచ్చు.

ఢిల్లీ తుది జట్టు అంచనా డేవిడ్ వార్నర్, పృథ్వీ షా, మిచెల్ మార్ష్, ఫిల్ సాల్ట్, సర్ఫరాజ్ ఖాన్, రోవ్‌మన్ పొవెల్, అక్షర్ పటేల్, అన్రిచ్ నోర్జే, ఖలీల్ అహ్మద్, ముకేశ్ కుమార్, కుల్దీప్ యాదవ్.

Also Read:  ICC ODI Rankings: ఐసీసీ ర్యాంకింగ్స్ లో గిల్, కోహ్లీ దూకుడు.. కెప్టెన్ రోహిత్ వెనక్కి!