IPL 2023: సన్‌రైజర్స్ కొత్త కోచ్‌గా విండీస్ దిగ్గజం

ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు కొత్త కోచ్‌గా వెస్టిండీస్ దిగ్గజం బ్రయాన్ లారా బాధ్యతలు చేపట్టనున్నాడు.

  • Written By:
  • Publish Date - September 3, 2022 / 03:40 PM IST

ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు కొత్త కోచ్‌గా వెస్టిండీస్ దిగ్గజం బ్రయాన్ లారా బాధ్యతలు చేపట్టనున్నాడు. గత సీజన్‌లో కోచ్‌గా వ్యవహరించిన టామ్ మూడీపై హైదరాబాద్ ఫ్రాంచైజీ వేటు వేసి.. అతని స్థానంలో లారాను ఎంపిక చేసింది. 15వ సీజన్‌లో లారా సన్‌రైజర్స్ జట్టు బ్యాటింగ్‌ కోచ్‌గానూ, స్ట్రాటజిక్ అడ్వైజర్‌గా వ్యవహరించాడు. యుఏఈ వేదికగా జరిగిన సీజన్ సమయంలో సన్‌రైజర్స్ క్రికెట్ డైరెక్టర్‌గా పనిచేసిన మూడీ వేలం సమయంలో అందుబాటులో లేడు. అయితే సీజన్ ప్రారంభానికి మూడీనే కోచ్‌గా నియమించింది. అయితే మూడీ ఆధ్వర్యంలో సన్‌రైజర్స్ ప్రదర్శన ఆశించిన విధంగా లేదు. దీంతో అతని కాంట్రాక్టును పొడిగించేందుకు ఫ్రాంచైజీ యాజమాన్యం నిరాకరించింది. నిజానికి గతంలోనూ మూడీ హైదరాబాద్ కోచ్‌గా మంచి ఫలితాలనే అందించాడు.

2016లో హైదరాబాద్ ఛాంపియన్‌గా నిలిచినప్పుడు కోచ్ మూడీనే. 2019లో టామ్ మూడీ కోచ్‌గా తప్పుకోవడంతో ట్రెవర్ బేలైసిస్‌ బాధ్యతలు తీసుకున్నాడు. అతని కోచింగ్‌లోనూ హైదరాబాద్ నిరాశపరిచింది. డేవిడ్ వార్నర్‌ను కెప్టెన్సీ నుంచి తప్పించడం, తుది జట్టులో చోటు కల్పించకపోవడం వంటి పరిణామాలతో సన్‌రైజర్స్‌ ఫ్రాంచైజీలో అంతర్గత విభేదాలు తెరపైకి వచ్చాయి. వేలంలోనూ సన్‌రైజర్స్ సరైన ఆటగాళ్ళను తీసుకోలేదన్న విమర్శలూ వచ్చాయి. దానికి తగ్గట్టే హైదరాబాద్ 15వ సీజన్‌లో పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఈ సీజన్‌లో సన్‌రైజర్స్ 6 విజయాలు, 8 ఓటములతో 8వ స్థానంలో నిలిచింది. దీంతో కోచింగ్‌ స్టాఫ్ మార్పుపైనే సన్‌రైజర్స్ యాజమాన్యం దృష్టి పెట్టింది. దీనిలో భాగంగానే మూడీని తప్పించి ఇప్పుడు లారాగా కోచింగ్ బాధ్యతలు అప్పగించింది