IPL 2022 Venue: ఐపీఎల్ ఆతిథ్యానికి మేం రెడీ

ఐపీఎల్ 2022 సీజన్ ఆతిథ్యం పై బీసీసీఐ తర్జన భర్జన పడుతోంది. స్వదేశంలోనే నిర్వహించాలని బీసీసీఐ పట్టుదలగా ఉన్నప్పటికీ దేశంలో కోవిడ్‌ కేసుల సంఖ్య పెరుగుదల కలవరపెడుతోంది.

  • Written By:
  • Publish Date - January 26, 2022 / 10:55 AM IST

ఐపీఎల్ 2022 సీజన్ ఆతిథ్యం పై బీసీసీఐ తర్జన భర్జన పడుతోంది. స్వదేశంలోనే నిర్వహించాలని బీసీసీఐ పట్టుదలగా ఉన్నప్పటికీ దేశంలో కోవిడ్‌ కేసుల సంఖ్య పెరుగుదల కలవరపెడుతోంది. ఇప్పటికే పలు దేశవాళీ టోర్నీలు కూడా వైరస్ దెబ్బకి వాయిదా పడ్డాయి. దీంతో ఐపీఎల్ నిర్వహణపై బీసీసీఐ ఆలోచిస్తుంది. ప్రత్యామ్నాయ వేదికలను పరిశీలిస్తుండగా… ఆతిథ్యం ఇచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామని సౌత్ ఆఫ్రికా క్రికెట్ బోర్డు బీసీసీఐకి తెలిపింది. భారత్ లో కరోనా వ్యాప్తి తగ్గకుంటే ఐపీఎల్‌ 2022 సీజన్ ను తమ దేశంలో నిర్వహించాలని బీసీసీఐకి క్రికెట్‌ సౌతాఫ్రికా లేఖ రాసినట్లు తెలుస్తోంది. ఇతర దేశాలతో పోల్చుకుంటే దక్షిణాఫ్రికాలో అన్ని ఖర్చులు చాలా తక్కువగా ఉంటాయని పేర్కొంది.. పటిష్టమైన బయోబబుల్‌ మధ్య నాలుగు వేదికల్లో ఈసారి ఐపీఎల్ సీజన్ ను నిర్వహిస్తామని పేర్కొంది. కరోనా ఉదృతిలోనూ ఇటీవల టీంఇండియా టూర్ విజయవంతం అయిన విషయాన్ని సఫారీ క్రికెట్ బోర్డు ప్రస్తావించింది.

దుబాయ్ తో పోలిస్తే తాము హోటల్స్ లో తక్కువ చార్జ్ చేస్తామని, అంతేగాక బస్ ప్రయాణాలు గాక మొత్తం విమానాల ద్వారానే ఆటగాళ్లను ఓ చోటు నుంచి మరో చోటుకు చేరుస్తామని పేర్కొంది.విమాన ప్రయాణాల ద్వారా కరోనా వ్యాప్తి తక్కువగా ఉండటమే గాక.. దుబాయ్ తో పోలిస్తే తాము విమాన ప్రయాణానికి తక్కువ చార్జ్ చేస్తామని బీసీసీఐకి నివేదించింది. దీని ద్వారా ఫ్రాంచైజీలకు బోలెడు నిర్వహణ ఖర్చు కలిసొస్తుందని తెలిపింది.ఐపీఎల్ నిర్వహణ కోసం నాలుగు స్టేడియాల వివరాలను కూడా సీఎస్ఏ.. బీసీసీఐ కి పంపిన నివేదికలో పేర్కొంది జోహన్నస్బర్గ్ లోని వాండరర్స్ స్టేడియం, సెంచూరియన్ లోని ప్రిటోరియా, బెన్నోయ్ లోని విలియమ్మోర్ పార్క్, పోచెఫ్స్ట్రోమ్ లోని సెన్వాస్ క్రికెట్ స్టేడియాలు ఐపీఎల్ నిర్వహణ కు అనుకూలంగా ఉంటాయని పేర్కొంది.

కరోనా వ్యాప్తి నేపథ్యంలోనూ దక్షిణాఫ్రికా ఇప్పటికే పలు సిరీస్‌లను విజయవంతంగా నిర్వహించిన విషయం తెలిసిందే. ఇటీవలి భారత్, దక్షిణాఫ్రికా సిరీస్, అలాగే ఇండియా ఏ- సౌతాఫ్రికా ఏ జట్ల మధ్య అనధికారిక సిరీస్‌ కూడా సజావుగా జరిగిపోయింది. అయితే ఆటగాళ్ళు మెగా వేలం తర్వాతే ఐపీఎల్ వేదికపై తుది నిర్ణయం తీసుకుంటామని బీసీసీఐ స్పష్టం చేసింది.