IPL 2022 : కొత్త స్పాన్సర్ గా టాటా ఎంత చెల్లిస్తుందో తెలుసా ?

ఐపీఎల్ 15వ సీజన్ కు ముందు పలు కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. సీజన్ ఆరంభానికి మూడు నెలల ముందే బీసీసీఐకి షాకిస్తూ వివో టైటిల్ స్పాన్సర్ గా వైదొలిగింది. ఈ ఏడాది కూడా ఒప్పందం ఉన్నప్పటకీ తప్పుకోవాలని వివో నిర్ణయించుకుంది.

  • Written By:
  • Publish Date - January 12, 2022 / 11:42 AM IST

ఐపీఎల్ 15వ సీజన్ కు ముందు పలు కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. సీజన్ ఆరంభానికి మూడు నెలల ముందే బీసీసీఐకి షాకిస్తూ వివో టైటిల్ స్పాన్సర్ గా వైదొలిగింది. ఈ ఏడాది కూడా ఒప్పందం ఉన్నప్పటకీ తప్పుకోవాలని వివో నిర్ణయించుకుంది. దీంతో ఐపీఎల్ కొత్త స్పాన్సర్ గా దేశంలో అతిపెద్ద వ్యాపార సంస్థ అయిన టాటా గ్రూప్‌ వ్యవహరించనుంది. ఈ మేరకు ఐపీఎల్‌ పాలకమండలి ఆమోదం తెలిపింది. వచ్చే ఏడాది కూడా టాటానే స్పాన్సర్ గా కొనసాగనుంది. ఇకపై లీగ్ టాటా ఐపీఎల్ గా పిలవనున్నట్టు ఛైర్మన్ బ్రిజేష్ పటేల్ వెల్లడించారు. భారత్‌-చైనాల మధ్య సరిహద్దు వివాదాల కారణంగా 2020 సీజన్‌లో వీవో టైటిల్‌ స్పాన్సర్ షిప్‌ నుంచి వైదొలిగింది. ఆ సీజన్ వరకూ వీవో స్థానంలో ‘డ్రీమ్ 11’ టైటిల్ స్పాన్సర్‌గా వ్యవహరించింది. అయితే మళ్ళీ గత ఏడాది వివో తిరిగి వచ్చింది. ఐదేళ్ళకు గానూ ఏడాదికి 440 కోట్లు చెల్లించేలా 2018లో వివో ఒప్పందం చేసుకుంది. కాగా ఇప్పుడు వివో స్థానంలో వచ్చిన టాటా గ్రూప్ ఏడాదికి 330 కోట్లు చెల్లించబోతోంది. వివోతో పోలిస్తే బీసీసీఐకి 110 కోట్లు తక్కువే అయినప్పటకీ టాటాకే అప్పగించడం వెనుక పలు కారణాలు ఉన్నాయి. ప్రస్తుత కోవిడ్ పరిస్థితుల్లో టెండర్లు పిలిచినా వేరే కంపెనీ ఇంత భారీ మొత్తం చెల్లించే అవకాశం లేదు. అలాగే స్వదేశీ కంపెనీలను ప్రోత్సహించాలన్న నినాదం కూడా వినిపిస్తుండడంతో బీసీసీఐ టాటాకు స్పాన్సర్ షిప్ హక్కులు ఇచ్చినట్టు తెలుస్తోంది. కాగా ఐపీఎల్ 2022 సీజన్ 10 జ‌ట్ల‌తో జ‌ర‌గ‌నుంది. ఈ ఏడాది ల‌క్నో, అహ్మ‌దాబాద్ రూపంలో కొత్త జట్లు ఎంట్రీ ఇవ్వనున్నాయి. అటు ఆటగాళ్ళ వేలం ఫిబ్రవరి 12,13 తేదీల్లో బెంగళూరు వేదికగా జరగనుంది.