ఐపీఎల్ న్15వ సీజన్ లో ప్లే ఆఫ్ రేస్ రసవత్తరంగా మారిన వేళ సన్ రైజర్స్ హైదరాబాద్ కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ గాయం కారణంగా రాబోయే మ్యాచ్‌లకు దూరం కానున్నట్లు తెలుస్తోంది. మే1న చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో వాషింగ్టన్ సుందర్ కుడి చేతికి గాయమైంది. దీంతో ఈ మ్యాచ్‌లో అతడు కనీసం ఒక్క ఓవర్ కూడా బౌలింగ్ చేయకుండానే మైదానాన్ని వీడాడు. ఈ విషయంపై సన్ రైజర్స్ హైదరాబాద్ ప్రధాన కోచ్ టామ్ మూడీ మాట్లాడుతూ… చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో వాషింగ్టన్ సుందర్ కుడి చేతికి గాయమైంది. గాయం తీవ్రత ఎక్కువగా ఉండడంతో అతడు ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడు. మేం ఈ సీజన్ లో అడబోయే కొన్ని మ్యాచ్‌లకు వాషింగ్టన్ సుందర్ దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి. సుందర్ లాంటి గొప్ప బౌలర్ దూరమవడం నిజంగా మా దురదృష్టం అని టామ్ మూడీ పేర్కొన్నాడు.
ఇదిలావుంటే.. తొలుత ఈ సీజన్ ఆరంభంలో చేతి వేలి గాయం కారణంగా వాషింగ్టన్ సుందర్ మూడు మ్యాచ్‌లకు దూరమయ్యాడు. ఇటీవల గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్ ద్వారా జట్టులోకి రీఎంట్రీ ఇచ్చాడు.. అంతలోనే మళ్ళీ ఇలా గాయపడ్డాడు. ఇక మరోవైపు ఈ సీజన్ లో తొలి రెండు మ్యాచుల్లో ఓడిపోయిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆ తరువాత వరుసగా అయిదు మ్యాచ్‌లల్లో వరుస విజయాల్ని సాధించింది. చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్, కోల్‌కత నైట్‌రైడర్స్, పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లను ఓడించింది. కానీ గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన గత రెండు మ్యాచుల్లో మాత్రం ఓటమి పాలైంది..