IPL Play Offs: ప్లే ఆఫ్‌కు చేరేదెవరు ?

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 15వ సీజన్ ఎన్నడూ లేనంత ఆసక్తిని రేకెత్తిస్తోంది.

  • Written By:
  • Publish Date - May 13, 2022 / 08:30 PM IST

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 15వ సీజన్ ఎన్నడూ లేనంత ఆసక్తిని రేకెత్తిస్తోంది. లీగ్ స్టేజ్ సెకండాఫ్ చివరి దశకు వచ్చేసినా ఇంకా మూడు ప్లే ఆఫ్ బెర్తులపై క్లారిటీ రాలేదు. ఇప్పటి వరకూ గుజరాత్ టైటాన్స్ మాత్రమే ప్లే ఆఫ్ చేరుకోగా.. మిగిలిన మూడు బెర్తుల కోసం 7 జట్లు రేసులో నిలిచాయి. డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్‌కింగ్స్ , ముంబై ఇండియన్స్ టోర్నీ నుంచి నిష్క్రమిస్తే… మిగిలిన 7 జట్లకూ ప్లే ఆఫ్ అవకాశాలు మిగిలే ఉన్నాయి. వీటిలో ఖచ్చితంగా ప్లే ఆఫ్ బెర్త్ దక్కించుకునే అవకాశమున్న టీమ్ లక్నో సూుపర్‌జెయింట్స్‌ను చెప్పుకోవచ్చు. పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్న లక్నో 12 మ్యాచ్‌లలో 8 విజయాలతో 16 పాయింట్లు సాధించింది. మరో మ్యాచ్ గెలిస్తే ఆ జట్టు ప్లే ఆఫ్ చేరుకుంటుంది.

అటు పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉన్న రాజస్థాన్‌కు ఇంకా రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండగా.. రెండింటిలోనూ గెలిస్తే మిగిలిన జట్లతో సంబంధం లేకుండా ప్లే ఆఫ్‌ బెర్త్ దక్కించుకుంటుంది. ఒకవేళ ఒక మ్యాచ్‌లో ఓడినా నెట్‌ రన్‌రేట్ రాజస్థాన్ ప్లే ఆఫ్ బెర్తును డిసైడ్ చేస్తుంది.
ఇదిలా ఉంటే ప్రతీసారీ టైటిల్ ఫేవరెట్‌ రేసులో నిలిచే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కూడా ప్రస్తుతం పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. ఇప్పటి వరకూ 12 మ్యాచ్‌లలో ఏడు విజయాలతో 14 పాయింట్లు సాధించిన ఆర్సీబీ మిగిలిన రెండు మ్యాచ్‌లలో గెలిస్తే ప్లే ఆఫ్‌కు దూసుకెళుతుంది. ఒక మ్యాచ్‌లో ఓడితే నెట్ రన్‌రేట్‌పై ఆధారపడాల్సి వస్తుంది. రెండింటిలో ఓడితే మాత్రం ప్లే ఆఫ్ బెర్త్ చేజారినట్టే. ఇక ఈ సీజన్‌లో పడుతూ లేస్తూ సాగుతున్న ఢిల్లీ క్యాపిటల్స్ 12 మ్యాచ్‌లో 6 విజయాలతో 12 పాయింట్లు సాధించింది. మిగిలిన రెండు మ్యాచ్‌లలో ఢిల్లీ గెలిస్తే , ప్లస్ రన్‌రేట్‌తో ప్లే ఆఫ్ బెర్త్ దక్కించుకోవచ్చు. ఒకవేళ ఒకటి గెలిచి ఒకటి ఓడినా ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది.

ఇక వరుసగా ఐదు విజయాల తర్వాత వరుసగా నాలుగింటిలో ఓడిన సన్‌రైజర్స్ హైదరాబాద్ మిగిలిన అన్ని మ్యాచ్‌లలోనూ ఖచ్చితంగా గెలవాలి. అదే సమయంలో మెరుగైన రన్‌రేట్‌తో విజయం సాధిస్తేనే మిగిలిన జట్లను వెనక్కి నెట్టి ప్లే ఆఫ్‌ కు అర్హత సాధిస్తుంది. అటు కోల్‌కతా నైట్‌రైడర్స్, పంజాబ్ కింగ్స్ కూడా రేసులో ఉన్నప్పటకీ… మిగిలిన మ్యాచ్‌లలో భారీ విజయాలు సాధించాలి. కోల్‌కతాతో పోలిస్తే పంజాబ్‌కు అదనంగా ఒక మ్యాచ్ ఉండడం అడ్వాంటేజ్‌. మొత్తం మీద 7 జట్లు పోటీలో ఉండడంతో ప్లే ఆఫ్ రేస్ ఆసక్తిని రేకెత్తిస్తోంది.