IPL 2022 Playoff Scenario: రసవత్తరంగా ప్లే ఆఫ్ రేస్

ఐపీఎల్ 15వ సీజన్‌ లీగ్ స్టేజ్‌ హోరాహోరీగా సాగుతోంది. ఇప్పటికే ప్రతీ జట్టూ దాదాపుగా పదేసి మ్యాచ్‌లు ఆడగా.. ప్లే ఆఫ్ బెర్తులపై పూర్తి స్పష్టత రాలేదు.

  • Written By:
  • Updated On - May 4, 2022 / 12:35 PM IST

ఐపీఎల్ 15వ సీజన్‌ లీగ్ స్టేజ్‌ హోరాహోరీగా సాగుతోంది. ఇప్పటికే ప్రతీ జట్టూ దాదాపుగా పదేసి మ్యాచ్‌లు ఆడగా.. ప్లే ఆఫ్ బెర్తులపై పూర్తి స్పష్టత రాలేదు. ఇప్పటి వరకూ కేవలం రెండు జట్లు మాత్రమే ప్లే ఆఫ్‌కు చేరువలో ఉన్నాయి. ఈ సీజన్‌తో తొలిసారి ఎంట్రీ ఇచ్చిన గుజరాత్ టైటాన్స్ వరుస విజయాలతో దుమ్మురేపుతోంది. 10 మ్యాచ్‌లలో 8 విజయాలతో ప్లే ఆఫ్ బెర్తుకు అడుగు దూరంలో ఉంది. మరో మ్యాచ్ గెలిస్తే ప్లే ఆఫ్ బెర్త్ ఖరారు చేసుకోనుండగా… తర్వాత లీగ్ స్టేజ్‌ను టాప్ ప్లేస్‌లో ముగించడమే లక్ష్యంగా సిద్ధమవుతోంది. గుజరాత్ తర్వాత ప్లే ఆఫ్ బెర్తుకు చేరువైన మరో టీమ్ లక్నో సూపర్‌జెయింట్స్… ఆ జట్టు కూడా తొలిసారి లీగ్‌లో అడుగుపెట్టి అద్భుత ప్రదర్శన కనబరుస్తోంది. 10 మ్యాచ్‌లలో ఏడు విజయాలు సాధించిన గుజరాత్ మరో మ్యాచ్ గెలిస్తే చాలు ప్లే ఆఫ్‌ బెర్త్ ఖాయం చేసుకుంటుంది. అయితే రెండు మ్యాచ్‌లు గెలిస్తే టాప్ టూలో ఫినిష్ చేసే అవకాశముంటుంది. రెండు కొత్త జట్లు ప్రస్తుతం సేఫ్ పొజిషన్‌లో ఉండగా… మిగిలిన ఏడు జట్లు రెండు బెర్తుల కోసం పోటీలో ఉన్నాయి.

పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉన్న రాజస్థాన్ రాయల్స్ 10 మ్యాచ్‌లలో ఆరు విజయాలు సాధించింది. మిగిలిన నాలుగు మ్యాచ్‌లలో కనీసం రెండు గెలిస్తే ప్లే ఆఫ్ రేసులో ఉంటుంది. గత రెండు మ్యాచ్‌లలో ఓడిపోవడం ఆ జట్టు రన్‌రేట్‌పై ప్రభావం చూపించింది. దీంతో మంచి రన్‌రేట్‌తో రెండు విజయాలు సాధిస్తే ప్లే ఆఫ్ బెర్త్ దక్కుతుంది. ఇదిలా ఉంటే లీగ్‌ను ఓటమితో ఆరంభించి..తర్వాత వరుస విజయాలతో అదరగొట్టిన సన్‌రైజర్స్ హైదరాబాద్ పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. ఇప్పటి వరకూ 9 మ్యాచ్‌లు ఆడిన సన్‌రైజర్స్ 5 విజయాలు అందుకుంది. అయితే గత రెండు మ్యాచ్‌లలో వరుస ఓటములతో డీలా పడిన హైదరాబాద్‌ మిగిలిన 5 మ్యాచ్‌లలో 4 గెలిస్తే ప్లే ఆఫ్ బెర్త్ దక్కుతుంది. మూడు గెలిస్తే రేసులో నిలిచినప్పటకీ.. మిగిలిన జట్ల ఫలితాలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఉంటుంది. దీంతో 4 విజయాలు సాధిస్తే ఇతర సమీకరణాలతో సంబంధం లేకుండా నేరుగా ప్లే ఆఫ్‌లో అడుగుపెడుతుంది.

మరోవైపు టేబుల్ టాపర్ గుజరాత్ టైటాన్స్‌పై భారీ విజయంతో అదరగొట్టిన పంజాబ్ కింగ్స్ ప్లే ఆఫ్ అవకాశాలను నిలుపుకుంది. ప్రస్తుతం 10 మ్యాచ్‌లలో 5 విజయాలతో ఐదో స్థానంలో కొనసాగుతోంది. ప్లే ఆఫ్ బెర్త్ దక్కాలంటే మిగిలిన 4 మ్యాచ్‌లలోనూ గెలవాల్సిందే. గుజరాత్‌పై విజయంతో రన్‌రేట్ మెరుగుపడినప్పటకీ ఇంకా మైనస్‌లోనే ఉంది. ఈ నేపథ్యంలో మంచి రన్‌రేట్‌తో మిగిలిన మ్యాచ్‌లు గెలిస్తే ప్లే ఆఫ్‌కు ఛాన్సుంటుంది. ఇదిలా ఉంటే ఐదు విజయాలతో ప్లే ఆఫ్ రేసులో కొనసాగుతున్న మరో టీమ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. పడుతూ లేస్తూ సాగుతున్న ఆర్సీబీ మిగిలిన 4 మ్యాచ్‌లలో కనీసం 3 గెలిస్తేనే ప్లే ఆఫ్ బెర్త్ దక్కుతుంది. అదే సమయంలో మైనస్‌లో ఉన్న నెట్ రన్‌రేట్‌ను మెరుగుపరుచుకోవడమే లక్ష్యంగా భారీ విజయాలు సాధించాలి. ఒకవేళ రెండు గెలిస్తే రేసులో ఉంటుంది తప్ప ప్లే ఆఫ్ బెర్త్ గ్యారెంటీ లేదు. ఇక టైటిల్ ఫేవరెట్‌గా భావించిన ఢిల్లీ క్యాపిటల్స్‌ 8 పాయింట్లతో ఏడో స్థానంలో కొనసాగుతోంది. ప్లే ఆఫ్ చేరాలంటే మిగిలిన 5 మ్యాచ్‌లలోనూ ఢిల్లీ గెలిచి తీరాలి. ఒకవేళ 4 విజయాలు సాధించినా.. రన్‌రేట్, ఇతర మ్యాచ్‌ల ఫలితాలపై ఆధారపడి ఉంటుంది. అటు గత సీజన్ రన్నరప్ కోల్‌కతా నైట్‌రైడర్స్‌ 8 పాయింట్లతో ఎనిమిదో స్థానంలో కొనసాగుతోంది. ప్లే ఆఫ్ రేసులో నిలవాలంటే మిగిలిన అన్ని మ్యాచ్‌లూ గెలిచినా రన్‌రేట్, ఇతర జట్ల ఫలితాలు కోల్‌కతా భవిష్యత్తును నిర్ణయించనున్నాయి. ఇక పాయింట్ల పట్టికలో కింది నుంచి రెండో స్థానంలో ఉన్న డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్‌కింగ్స్ ఖాతాలో 6 పాయింట్లే ఉన్నాయి. మిగిలిన ఐదు మ్యాచ్‌లలోనూ గెలిస్తే ప్లే ఆఫ్‌కు అర్హత సాధించే అవకాశముంటుంది. అయితే ముంబై, గుజరాత్‌తో జరిగే మ్యాచ్‌లు చెన్నై రన్‌రేట్‌, ప్లే ఆఫ్ బెర్తును డిసైడ్ చేసే అవకాశముంది.