Site icon HashtagU Telugu

MS Dhoni ధోనీ వచ్చేశాడు..

Dhoniipl

Dhoniipl

వరల్డ్ క్రికెట్ లో కూల్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని రూటే వేరు…జట్టును నడిపించే విషయంలో మిగిలిన వారితో పోలిస్తే ధోనీ శైలి ప్రత్యేకంగా ఉంటుంది. ముఖ్యంగా ఐపీఎల్ చెన్నై సూపర్ కింగ్స్ సారథిగా ధోనీ తనదయిన ముద్ర వేశాడు. అందరికంటే ముందు ప్రాక్టీస్ మొదలు పెట్టడం…జట్టు కూర్పు , వ్యూహాల్లో మిగిలిన టీమ్స్ తో పోలిస్తే ఒక అడుగు ముందే ఉండడం…లీగ్ పూర్తయిన తర్వాత అందరినీ పంపించి తాను చివర్లో ఇంటికి వెళ్ళడం…ఇలా స్ఫూర్తి దాయకమైన నాయకుడిగా నిలిచాడు. తాజాగా మరోసారి ధోనీ తన ప్రత్యేకతను చాటుకున్నాడు. మిగిలిన ఆటగాళ్ళ కంటే వారం ముందే ప్రాక్టీస్ కాంపుకి సిద్దమయ్యాడు. దీని కోసం సూరత్ లో అడుగు పెట్టిన చెన్నై కెప్టెన్ ప్రీ సీజన్ ప్రాక్టీస్ క్యాంపు ఏర్పాట్లను దగ్గరుండి పర్యేక్షిస్తున్నాడు. నిజానికి ప్రాక్టీస్ క్యాంప్ ఏర్పాట్లు ఫ్రాంచైజీ అధికారులు చూసుకుంటారు. అయితే ధోనీ మాత్రం తానే స్వయంగా ప్రిపరేషన్ ప్లాన్స్ పై దృష్టి పెట్టాడు. మార్చి 8 నుంచి చెన్నై సూపర్ కింగ్స్ ప్రాక్టీస్ క్యాంప్ మొదలు కానుంది.

ఈ సారి కొవిడ్ కారణంగా సీజన్ మొత్తాన్నీ మహారాష్ట్రలోనే నిర్వహిస్తున్నారు. అయితే ధోనీ అండ్ కో మాత్రం సూరత్ లో ప్రాక్టీస్ చేయనుంది. ముంబైలో స్టేడియాలకు ఉపయోగించిన మట్టినే సూరత్ లో కొత్తగా నిర్మించిన లాల్బాయ్ స్టేడియంలోని పిచ్ లపై కూడా ఇదే మట్టిని వాడుతున్నారట. లాల్భాయ్ స్టేడియంలోని పిచ్ లు ముంబై పిచ్ ల మాదిరే ఉంటాయని సమాచారం. ఈ విషయం తెలుసుకున్న ధోని తమ జట్టు ప్రాక్టీస్ క్యాంప్ ను సూరత్ కు షిఫ్ట్ చేశాడు. మార్చి 8 నుంచి ఇక్కడ ప్రాక్టీస్ మొదలుపెట్టనున్న సీఎస్కే.. బయో బబుల్ లో గడపనుంది. ఐపీఎల్ 15వ సీజన్ కు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో ఆటగాళ్లు బయట ఉంటే కరోనా బారినపడటం, గాయాలు, ఇతర సమస్యలు లేకుండా బబుల్ లోనే ఉండేలా చెన్నై చర్యలు చేపట్టింది. చెన్నై జట్టులోని ఆటగాళ్ళు విడతల వారీగా ప్రిపరేషన్ క్యాంపు లో చేరనున్నారు.