Site icon HashtagU Telugu

IPL 2022 : ఐపీఎల్ 2022.. ఏ గ్రూప్‌లో ఏ జట్టు..?

Ipl Auction New

Ipl Auction New

అభిమానులు ఎప్పుడెప్పుడూ అని ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ 15వ సీజన్ ఫార్మేట్ విడుదలైంది. గత సీజన్ వరకూ 8 జట్లు పోటీపడగా.. ఈ సారి రెండు కొత్త జట్ల ఎంట్రీతో 10 జట్లతో మెగా టోర్నీ జరగనుంది. మొత్తం 10 జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూప్ ఎలో ముంబై ఇండియన్స్ , కోల్‌కతా నైట్‌రైడర్స్ , రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ ఉండగా.. గ్రూప్ బిలో చెన్నై సూపర్ కింగ్స్ , సన్‌రైజర్స్ హైదరాబాద్ , రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ చోటు దక్కించుకున్నాయి. గత సీజన్లలో ఆయా జట్లు టైటిల్ గెలుపు, ఫైనల్‌కు చేరుకున్న సంఖ్య ఆధారంగా గ్రూపులు నిర్ణయించారు. రెండు కొత్త జట్ల రాకతో ఫార్మేట్‌ చాలా వరకూ మారుతుందనుకున్నప్పటకీ.. మ్యాచ్‌ల సంఖ్యలో ఎటువంటి మార్పూ లేదు. ప్రతీ జట్టూ గ్రూప్‌లో ఉన్న ఇతర జట్లతో రెండేసి సార్లు తలపడుతుంది. అలాగే పక్క గ్రూప్‌లో ఉన్న జట్లతో ఒక్కోసారి ఆడుతుంది. మొత్తం మీద ప్రతీ జట్టుకూ ఎప్పటిలానే 14 మ్యాచ్‌లు ఉండనున్నాయి.రెండు కొత్త జట్ల ఎంట్రీతో లీగ్ మ్యాచ్‌ల సంఖ్య 70కి చేరగా.. ప్లే ఆఫ్స్ , ఫైనల్‌తో కలిపి మరో 4 మ్యాచ్‌లు ఉన్నాయి. కొవిడ్ నిబంధనల కారణంగా ఈ సారి సీజన్ మొత్తాన్నీ మహారాష్ట్రలో నిర్వహించనున్నారు. ముంబైలోని మూడు స్టేడియాలు, పుణేలోని ఒక స్టేడియం మ్యాచ్‌లకు ఆతిథ్యమివ్వనున్నాయి. వాంఖేడే స్టేడియంలో 20 మ్యాచ్‌లు, డివై పాటిల్ స్టేడియంలో 20 మ్యాచ్‌లు, బ్రబౌర్న్ స్టేడియంలో 15 మ్యాచ్‌లు జరగనుండగా.. పుణేలో 15 మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. కాగా ప్రతీ జట్టూ వాంఖేడేలో , డివై పాటిల్ స్టేడియాలలో నాలుగేసి మ్యాచ్‌లూ, బ్రబౌర్న్ స్టేడియంలో మూడేసి మ్యాచ్‌లు ఆడేలా షెడ్యూల్ రూపొందించారు. అయితే ప్లే ఆఫ్స్‌, ఫైనల్ మ్యాచ్‌లకు వేదికను తర్వాత నిర్ణయిస్తామని ఐపీఎల్ ఛైర్మన్ బ్రిజేష్ పటేల్ చెప్పారు.షెడ్యూల్ ప్రకారం ఈ సారి ఐపీఎల్ సీజన్ మార్చి 26 నుండి మే 29 వరకూ జరగనుంది. కోవిడ్ కారణంగా గత సీజన్‌ మధ్యలోనే నిలిచిపోవడం…తర్వాత యుఏఈ వేదికగా సగం మ్యాచ్‌లను పూర్తి చేయడం జరిగింది. ఇలాంటి పరిస్థితి మళ్ళీ తలెత్తకుండా ఈ సారి బీసీసీఐ పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది. లీగ్‌తో సంబంధమున్న ఏ ఒక్కరూ బబూల్ నిబంధనలు ఉల్లంఘించకుండా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వనుంది. ఇక మ్యాచ్‌లకు 40 శాతం నుండి 50 శాతం వరకూ ప్రేక్షకులను అనుమతించాలని బీసీసీఐ నిర్ణయించింది. అయితే దీనికి మహారాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వాల్సి ఉంటుందని, వారి నిబంధనల ప్రకారమే నడుచుకుంటామని బోర్డు వర్గాలు తెలిపాయి.