Site icon HashtagU Telugu

IPL 2022 : ఐపీఎల్ 2022 ఖరీదైన ప్లేయర్ గా రాహుల్

Rahul Ipl

Rahul Ipl

ఐపీఎల్ 2022 సీజన్ మెగావేలం బెంగళూరు వేదికగా ఫిబ్రవరి 12, 13న జరగనుండగా.. మార్చి చివరి వారంలో ఐపీఎల్ 2022 సీజన్ మ్యాచ్‌లు ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఈసారి ఐపీఎల్‌లోకి కొత్తగా లక్నో, అహ్మదాబాద్ ఫ్రాంఛైజీలు ఎంట్రీ ఇచ్చాయి. దాంతో.. మొత్తం 10 జట్లతో టోర్నీ జరగనుంది. అయితే లీగ్‌లోకి కొత్తగా ఎంట్రీ ఇచ్చిన అహ్మదాబాద్, లక్నో టీమ్స్ తాజాగా తమ డ్రాఫ్ట్ జాబితాలను ప్రకటించాయి. బీసీసీఐ రిటెన్షన్ నిబంధనల మేరకు ఇరు జట్లు ముగ్గురేసి ఆటగాళ్లను ఎంపిక చేసుకున్నాయి. ఇందులో లక్నో ఫ్రాంచైజీ కేఎల్ రాహుల్‌ను 17 కోట్ల భారీ మొత్తానికి కొనుగోలు చేసి తమ జట్టు సారథిగా ఎంచుకుంది.

దీంతో ఐపీఎల్ 2022 సీజన్‌లో అత్యధిక వేతనం పొందిన ఆటగాడిగా రాహుల్ నిలిచాడు. గత సీజన్ వరకు ఈ రికార్డు ఆర్‌సీబీ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ పేరు మీద ఉండేది. గత సీజన్‌లో కోహ్లీ అత్యధికంగా రూ.17 కోట్లు అందుకోగా.. ఈ సీజన్‌లో మాత్రం రూ.15 కోట్లకే అతన్ని ఆర్సీబీ ఫ్రాంచైజీ రిటైన్ చేసుకుంది. ఇక ఈ సీజన్ లో రూ.16 కోట్లు చెల్లించి ముంబై ఇండియన్స్ రోహిత్ శర్మను అంటిపెట్టుకుంది.

అలాగే చెన్నై సూపర్ కింగ్స్ ఎంఎస్ ధోనీని రూ.12 కోట్లకు అంటిపెట్టుకుంది. దాంతో కేఎల్ రాహుల్ లీగ్​లో అత్యధిక ధర పలికిన ఆటగాళ్ల జాబితాలో కోహ్లీ సరసన టాప్​-1లో నిలిచాడు.. ఇదిలాఉంటే.. మరో కొత్త ఫ్రాంచైజీ అహ్మదాబాద్‌.. హార్దిక్‌ పాండ్య , రషీద్‌ ఖాన్‌ కోసం రూ.15 కోట్ల చొప్పున చెల్లించింది. శుభ్‌మన్‌గిల్‌ను ఆ ఫ్రాంచైజీ రూ.7 కోట్లకు దక్కించుకుంది.