IPL 2022 : రాయుడుపై బ్రేవో సంచలన వ్యాఖ్యలు

ఐపీఎల్ 15వ సీజన్ కు సమయం దగ్గర పడుతోంది.

  • Written By:
  • Updated On - March 4, 2022 / 01:13 PM IST

ఐపీఎల్ 15వ సీజన్ కు సమయం దగ్గర పడుతోంది. ఇప్పటికే జట్ల కూర్పు పూర్తి చేసుకున్న ఫ్రాంచైజీలు సీజన్ కోసం సన్నాహాలు షురూ చేశాయి. మార్చి 8 నుండి అన్ని జట్లూ ప్రాక్టీస్ మొదలుపెట్టనున్నాయి. అందుబాటులో ఉన్న ఆటగాళ్ళతో ప్రాక్టీస్ క్యాంపులు మొదలు కానుండగా…విదేశీ ఆటగాళ్ళు విడతల వారీగా తమ తమ జట్లతో కలవనున్నారు. చెన్నై సూపర్ కింగ్స్ మిగిలిన జట్ల కంటే భిన్నంగా సూరత్ లో ప్రాక్టీస్ చేయనుంది. కాగా చెన్నై సూపర్ కింగ్స్ సీనియర్ ప్లేయర్ , ఆల్ రౌండర్ డ్వయాన్ బ్రేవో ఈ సీజన్ కోసం సన్నద్ధమవుతున్నాడు. జట్టుతో చేరేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్టు చెప్పాడు. ఈ సందర్భంగా చెన్నై జట్టుతో తన అనుబంధాన్ని బ్రేవో గుర్తు చేసుకున్నాడు. ముఖ్యంగా తెలుగుతేజం అంబటి రాయుడుపై బ్రేవో చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. రాయుడుకు తాను ఓ పీడకలగానే ఉంటానంటూ బ్రేవో వ్యాఖ్యానించాడు. వేలం జరుగుతున్నప్పుడు తామిద్దరి మధ్య ఇన్ స్టా గ్రామ్ లో మెసేజిలు జరిగిన విషయాన్ని బ్రేవో బయటపెట్టాడు. నిన్ను ఎవరూ కొనరని, అమ్ముడుపోని ఆటగాళ్ళ జాబితాలో ఉండిపోతావంటూ ఒకరినొకరు టీజ్ చేసుకున్నామని గుర్తు చేసుకున్నాడు.

రాయుడుతో ఎప్పుడూ గొడవపడుతూనే ఉంటానని బ్రేవో చెప్పాడు. నిజానికి రాయుడు ఐపీఎల్ లో మరో ఫ్రాంచైజీ తరపున అవకాశం వచ్చినా ఆడడని ఈ విండీస్ ఆల్ రౌండర్ చెప్పాడు. చెన్నై ఫ్రాంచైజీ తమను మళ్ళీ కొనుగోలు చేయడంతో రాయుడుతో కలిసి ఆడేందుకు ఎదురుచూస్తున్నాని చెప్పాడు. ప్రస్తుతానికి అతనికి దూరంగా ఉన్నా… సీజన్ ప్రారంభమైన తర్వాత పోట్లాడుతూనే ఉంటానన్నాడు బ్రేవో. అంబటి రాయుడు, బ్రేవో మధ్య మంచి రిలేషన్ షిప్ ఉంది. చెన్నై డ్రెస్సింగ్ రూమ్ లో వీరిద్దరి చేసే హంగామా అంతా ఇంతా కాదు. వేలం ముగిసిన తర్వాత రాయుడు ఈ విషయాన్ని గతంలోనే చెప్పుకొచ్చాడు. నా తలనొప్పి మళ్ళీ జట్టులోకి రావడం సంతోషంగా ఉందంటూ రాయుడు ట్వీట్ చేశాడు. హోటల్ లో ఉన్నప్పుడు రాయుడు రూమ్ కు వెళ్ళి బ్రేవో పదేపదే డిస్ట్రబ్ చేయడం, ఫన్నీగా ఆటపట్టించిన సందర్భాలను వీరిద్దరూ గుర్తు చేసుకున్న వీడియోను వేలం తర్వాత సీఎస్ కే పోస్ట్ చేసింది. చాలా కాలంగా చెన్నై సూపర్ కింగ్స్ విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్న అంబటి రాయుడు, బ్రేవోలను ఇటీవల వేలంలో ఆ ఫ్రాంచైజీ దక్కించుకుంది. రాయుడు కోసం రూ.6.75కోట్లు కేటాయించగా, బ్రావోను రూ.4.40కోట్లకు కొనుగోలు చేసింది.