IPL 2022 : వెళ్ళి మీ నాన్నతో ఆటోలు నడుపుకో…

క్రికెట్ లో నిలకడగా రాణిస్తేనే జట్టులో చోటు ఉంటుంది... అభిమానుల్లో ఫాలోయింగ్ ఉంటుంది

  • Written By:
  • Publish Date - February 8, 2022 / 02:45 PM IST

క్రికెట్ లో నిలకడగా రాణిస్తేనే జట్టులో చోటు ఉంటుంది… అభిమానుల్లో ఫాలోయింగ్ ఉంటుంది. ఒకవేళ విఫలమైతే మాత్రం విమర్శలు ఎదుర్కొవాల్సిందే. అయితే యువక్రికెటర్ల విషయంలో ఒక్కోసారి విమర్శలు మితిమీరితే వారికి ఇబ్బందే. ఇలాంటి అవమానకరమైన పరిస్థితిని ఐపీఎల్ లో ఆడుతున్నట్టు తాను ఎదుర్కొన్నానని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పేసర్ మహ్మద్ సిరాజ్ చెప్పాడు. బెంగళూరు ఫ్రాంచైజీకి ఎంపికైన కొత్తలో తనకు జరిగిన అవమానాన్ని పాడ్కాస్ట్‌ షో వేదికగా షేర్‌ చేసుకున్నాడు ఐపీఎల్‌ 15వ సీజన్ మెగా వేలానికి ముందు ఆర్సీబీ యాజమాన్యం నిర్వహించిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిరాజ్.. ఆర్సీబీతో తన గత అనుభవాలను షేర్‌ చేసుకుంటూ ఈ విషయాన్ని ప్రస్తావించాడు. ఐపీఎల్ 2019 సీజన్ తనకు చేదు జ్ఞాపకాల్ని మిగిల్చిందన్నాడు.

బెంగళూరు తరపున బరిలోకి దిగిన తాను కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లోదారుణంగా విఫలమయ్యానని, కేవలం 2.2 ఓవర్లలోనే 33 పరుగులిచ్చి ఆర్సీబీ ఓటమికి కారణమయ్యానని గుర్తు చేసుకున్నాడు. ఈ మ్యాచ్ తర్వాత ఇక ఐపీఎల్‌ లో తన కెరీర్‌ ముగిసిందనే భావించినట్టు చెప్పాడు. కేకేఆర్ తో మ్యాచ్ ముగిసిన తర్వాత పలువురు అభిమానులు క్రికెట్‌ను వదిలేసేయ్‌.. ఇక్కడినుంచి వెళ్లి నీ తండ్రితోపాటు ఆటోలు నడుపుకో అంటూ దారుణంగా కామెంట్లు చేశారని చెప్పుకొచ్చాడు. అయితే ఆ సమయంలో ఆర్‌సీబీ ఫ్రాంచైజీ తనకు అండగా నిలిచిందని గుర్తు చేసుకున్నాడు. తన బౌలింగ్ మీద నమ్మకంతో వరుసగా అవకాశాలు ఇస్తూనే ఉందన్నాడు. ఆ తరువాత ఐపీఎల్ 2020 సీజన్ లోమళ్లీ అదే కేకేఆర్‌పై అద్భుత ప్రదర్శనతో జట్టును ఒంటిచేత్తో గెలిపించాన సందర్భాన్ని సిరాజ్ గుర్తు చేసుకున్నాడు. తన కెరీర్‌కు అదే టర్నింగ్‌ పాయింట్‌ గా నిలిచిందని సిరాజ్ చెప్పుకొచ్చాడు. సిరాజ్‌ ఐపీఎల్‌ కెరీర్ లో 50 మ్యాచ్‌ల్లో 50 వికెట్లు పడగొట్టాడు. మెగా వేలానికి ముందు ఆర్సీబీ కోహ్లీ, మాక్స్ వెల్ తో పాటు సిరాజ్ ను కూడా రిటైన్ చేసుకుంది.