IPL Closing Ceremony: ఐపీఎల్ ఫైనల్ కు బీసీసీఐ భారీ ఏర్పాట్లు

ఐపీఎల్‌-2022 సీజన్ ఆఖరి అంకానికి చేరుకుంది. ఇప్పటికే గుజరాత్ టైటాన్స్ , లక్నో సూపర్ జెయింట్స్ జట్లు తొలి రెండు ప్లే ఆఫ్‌ బెర్తులను ఖరారు చేసుకోగా.. మిగిలిన రెండు బెర్తుల కోసం హోరాహోరీ పోరు నెలకొంది.

  • Written By:
  • Updated On - May 20, 2022 / 05:47 PM IST

ఐపీఎల్‌-2022 సీజన్ ఆఖరి అంకానికి చేరుకుంది. ఇప్పటికే గుజరాత్ టైటాన్స్ , లక్నో సూపర్ జెయింట్స్ జట్లు తొలి రెండు ప్లే ఆఫ్‌ బెర్తులను ఖరారు చేసుకోగా.. మిగిలిన రెండు బెర్తుల కోసం హోరాహోరీ పోరు నెలకొంది. ఇదిలా ఉంటె.. తాజాగా ఐపీఎల్‌ 2022 సీజన్ ఫైనల్‌ మ్యాచ్‌ సమయాన్ని బీసీసీఐ మార్చినట్లు తెలుస్తోంది. రాత్రి 7. 30 గంటలకు మొదలు కావాల్సిన మ్యాచ్‌ను 8 గంటలకు ప్రారంభించనుంది. కరోనా మహమ్మారి విజృంభణ కారణంగా గత రెండు సీజన్లుగా ఐపీఎల్ ఆరంభ, ముగింపు వేడుకలను బీసీసీఐ నిర్వహించని సంగతి తెలిసిందే.. ఈ క్రమంలోనే ఈ సీజన్ ముగింపు వేడుకలను అట్టహాసంగా నిర్వహించాలని బీసీసీఐ భావిస్తున్నట్లు తెలిసింది.

ఆస్కార్ విజేత ఏఆర్ రెహ్మాన్‌తో పాటు ప్రముఖ బాలీవుడ్‌ హీరో రణ్‌వీర్‌ సింగ్‌లతో ఓ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించేందుకుబీసీసీఐ భారీ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ ముగింపు వేడుకల సందర్భంగా గతంలో టీమిండియా కెప్టెన్లుగా వ్యవహరించిన వారందరినీ ఘనంగా సత్కరించాలని బీసీసీఐ భావిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే టైమింగ్స్ మార్చినట్లు తెలుస్తోంది. ఇక ఐపీఎల్ 15వ సీజన్ ప్లే ఆఫ్స్ మ్యాచులు మే 24 నుంచి జరగనున్నాయి. కోల్‌కతా వేదికగా తొలి క్వాలిఫైయర్‌, ఎలిమినేటర్‌ మ్యాచ్‌లు జరగనుండగా.. అహ్మదాబాద్‌లో క్వాలిఫయర్-2, ఈ సీజన్ మెగా ఫైనల్‌ నిర్వహించనున్నారు.
మరోవైపు రాబోయే ఐదేళ్ల పాటు ఐపీఎల్ మీడియా రైట్స్ ధరను బీసీసీఐ రూ.32,890 కోట్లుగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. టీవీ, డిజిటల్ రైట్స్ కలుపుకొని ఇంత మొత్తాన్ని ఫిక్స్ చేసినట్లు సమాచారం. స్టార్ ఇండియా, వయాకామ్ 18, సోనీ, అమెజాన్, జీ, డ్రీమ్ 11, సూపర్స్పోర్ట్స్, స్కై సంస్థలు ఈ మీడియా హక్కుల కోసం పోటీపడుతున్నాయి.