Site icon HashtagU Telugu

IPL 2022: ముంబై తప్పు చేసిందా…

Kieron Pollard

Kieron Pollard

ఐపీఎల్‌ 2022 సీజన్ మెగావేలంలో మొత్తం 590 మంది ఆటగాళ్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. వేలానికి ముందు ముంబై ఇండియన్స్‌కు కొత్త టెన్షన్ మొదలైంది. రిటెన్షన్ ప్రక్రియలో కెప్టెన్ రోహిత్ శర్మ ను రూ. 16 కోట్లుకు సీనియర్ పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రాను రూ. 12 కోట్లకు , సూర్యకుమార్‌ యాదవ్‌ ను రూ. 8 కోట్లకు , కీరన్‌ పొలార్డ్‌ ను రూ. 6 కోట్లు చెల్లించి రిటైన్ చేసుకుంది. అయితే ఆల్ రౌండర్ కీరన్ పొలార్డ్ ఫామ్‌ , ఫిట్ నెస్ సమస్యలు ఆ జట్టును కలవరపెడుతున్నాయి… టీ20 ప్రపంచకప్‌-2021 నుంచి ఫిట్ నెస్ సమస్యలతో జట్టుకు దూరమైన పొలార్డ్.. ఆ తర్వాత పాకిస్తాన్‌ టూర్ నుంచి వైదొలిగాడు. ఇంగ్లండ్‌తో సిరీస్‌కు ముందు రిహాబిలిటేషన్‌ సెంటర్‌లో చికిత్స తీసుకొని రీ ఎంట్రీ ఇచ్చాడు. అనంతరం టీంఇండియా పర్యటనకి వచ్చిన పొలార్డ్.. ప్రస్తుతం మళ్ళీ ఫిట్ నెస్ లేమితో బాధపడుతున్నాడు. ఈ కారణంగానే భారత్‌తో బుధవారం నాటి మ్యాచ్‌లోనూ పొలార్డ్‌ ఆడలేదు. అతడి స్థానంలో నికోలస్‌ పూరన్‌ జట్టు పగ్గాలు చేపట్టాడు.పొలార్డ్‌ తరచూ గాయ పడడం, ఫిట్ నెస్ కోల్పోయి జట్టుకు దూరం కావడంతో ముంబై.. అతడిని రిటైన్‌ చేసుకుని పెద్ద తప్పు చేసిందా అనే చర్చ మొదలైంది. పొలార్డ్‌కు బదులు యువ ఓపెనర్ ఇషాన్ కిషన్‌ను తీసుకోవాల్సిందని ఫ్యాన్స్ క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అలాగే ఈ మెగా వేలంలో పొలార్డ్‌కు బ్యాకప్ ప్లేయర్‌గా ఆల్‌రౌండర్లు మిచెల్ మార్ష్, జిమ్మీ నీషం వంటి ఆటగాళ్లను కొనుగోలు చేయాలని సూచిస్తున్నారు.