CSK vs KKR: హెడ్ టూ హెడ్ రికార్డుల్లో చెన్నైదే పైచేయి

క్రికెట్‌ ప్రేమికులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న ఐపీఎల్‌-2022 సీజన్‌ వచ్చేసింది.

  • Written By:
  • Updated On - March 25, 2022 / 05:30 PM IST

క్రికెట్‌ ప్రేమికులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న ఐపీఎల్‌-2022 సీజన్‌ వచ్చేసింది. గతంతో పోలిస్తే ఈ సారి రెండు కొత్త జట్లు ఎంట్రీ ఇచ్చాడి. దీంతో 10 జట్లతో జరగనున్న మెగా లీగ్ అభిమానులను అసలు సిసలు క్రికెట్ కిక్ ఇవ్వబోతోంది. అటు స్టేడియాలకు ఫ్యాన్స్ ను కూడా అనుమతిస్తుండడంతో ఐపీఎల్ ఫీవర్ మరింత ఎక్కువైంది. శనివారం జరిగే తొలి మ్యాచ్‌లో కోల్ కత్త నైట్ రైడర్స్ తో డిఫెండింగ్‌ చాంపియన్‌ చెన్నై సూపర్ కింగ్స్ తలపడనుంది. గత ఏడాది ఫైనల్ లో ఈ రెండు జట్లే తలపడ్డాయి. ఆ మ్యాచ్ లో కోల్ కతాను చిత్తు చేసిన చెన్నై టైటిల్ గెలుచుకుంది. ఇప్పటి వరకూ చెన్నై సూపర్ కింగ్స్ 4 సార్లు టైటిల్ గెలుచుకోగా… కోల్ కతా రెండుసార్లు విజేతగా నిలిచింది. శనివారం జరగనున్న ఆరంభ మ్యాచ్ హోరాహోరీగా సాగుతుందని భావిస్తున్నారు. రెండు జట్లలోనూ స్టార్ ప్లేయర్స్ ఉండడం, గెలుపు కోసం చివరి వరకూ పోరాడే తత్వం ఉన్న ఆటగాళ్ళు ఉండడంతో ఉత్కంఠగా సాగే అవకాశముంది. రెండు జట్లకూ కొత్త కెప్టెన్లు సారథ్యం వహించనుండడం మరో ఆసక్తికర అంశం. కోల్ కతా శ్రేయాస్ అయ్యర్ ను సారథిగా ప్రకటిస్తే… కొన్ని గంటల ముందు ధోనీ చెన్నై కెప్టెన్సీ నుంచి తప్పుకుని జడేజాకు పగ్గాలు అప్పగించాడు.

ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ , కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు హెడ్ టు హెడ్ రికార్డుల్ని ఓసారి పరిశీలిస్తే.. ఈ రెండు జట్లూ ఇప్పటి వరకూ 26 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. ఇందులో 17 మ్యాచ్‌ల్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు విజయం సాధించగా.. 8 మ్యాచ్‌ల్లో కోల్‌కతా నైట్ రైడర్స్ గెలిచింది. ఇక మిగిలిన ఒక మ్యాచ్‌లో మాత్రం ఫలితం తేలలేదు. ఎక్కువ సార్లు సీఎస్ కే ఆధిపత్యం కనబరిచినప్పటకీ షార్ట్ ఫార్మేట్ లో ఎవరినీ తక్కువ అంచనా వేయలేం. పైగా రెండు జట్ల కూర్పులోనూ పలు మార్పులు జరిగిన నేపథ్యంలో ఫేవరెట్ ను అంచనా వేయలేని పరిస్థితి నెలకొంది. అయితే గత రికార్డుల్లో పై చేయి ఆధారంగా చెన్నైని ఫేవరెట్ గా చెబుతున్నా… మ్యాచ్ మాత్రం హోరాహోరీగా సాగుతుందని అంచనా వేస్తున్నారు. సీజన్ తొలి మ్యాచ్ కావడంతో అభిమానులు పరుగుల వర్షం ఖాయమని భావిస్తున్నారు.