BCCI: ప్లే ఆఫ్స్, ఫైనల్ వేదికలపై బీసీసీఐ సంచలన నిర్ణయం

ఐపీఎల్ 15వ సీజన్ ఇప్పటికే క్రికెట్ ఫ్యాన్స్ ను ఉర్రూతలూగిస్తోంది.

  • Written By:
  • Updated On - April 5, 2022 / 04:04 PM IST

ఐపీఎల్ 15వ సీజన్ ఇప్పటికే క్రికెట్ ఫ్యాన్స్ ను ఉర్రూతలూగిస్తోంది. ఉత్కంఠభరితంగా సాగుతున్న మ్యాచ్ లను అటు స్టేడియంలోనూ, ఇటు టీవీల్లోనూ వీక్షిస్తూ ఫ్యాన్స్ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. కోవిడ్ కారణంగా ముందు 25 శాతం మందికే స్టేడియాల్లోకి అనుమతించిన బీసీసీఐ తాజాగా 50 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు అభిమానులకు మరో గుడ్ న్యూస్ చెప్పింది. ప్లే ఆఫ్స్ ను, ఫైనల్ మ్యాచ్ ను వేర్వేరు వేదికల్లో నిర్వహించేందుకు ప్లాన్ చేస్తోంది. కోవిడ్ కేసులు పూర్తిగా అదుపులోకి రావడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. నిజానికి కోవిడ్ ఆంక్షల కారణంగానే సీజన్ మొత్తాన్నీ ఈ సారి మహారాష్ట్రకే పరిమితం చేసింది. ముంబై, పుణేలోని స్టేడియాల్లో మ్యాచ్ లు నిర్వహిస్తోంది. అయితే లీగ్ స్టేజ్ వరకే షెడ్యూల్ ప్రకటించిన బీసీసీఐ ప్లే ఆఫ్స్ , ఫైనల్ మ్యాచ్ ల వేదికలను మాత్రం ఇంకా ఖరారు చేయలేదు. తాజాగా కోవిడ్ కేసులు తగ్గిపోవడంతో ప్లే ఆఫ్స్ , ఫైనల్ మ్యాచ్ లను వేర్వేరు వేదికల్లో నిర్వహించాలని ఫ్రాంచైజీలతో పాటు బీసీసీఐ సభ్యులు కూడా ప్రతిపాదించడంతో బోర్డు ఆ దిశగా ఆలోచిస్తోంది.

ప్రస్తుతానికి ప్లే ఆఫ్స్ మ్యాచ్ లలో మొదటి క్వాలిఫైయిర్, ఎలిమినేటర్ లకు వేదికగా లక్నో, కోల్ కతాలను పరిశీలిస్తున్నట్టు సమాచారం. ఈడెన్ గార్డెన్స్ లాంటి మెగా స్టేడియంలో నిర్వహిస్తే ఎక్కువమంది అభిమానులకు మ్యాచ్ ను ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం ఉంటుంది. అయితే లక్నో కూడా రేసులో ఉండడంతో ఆసక్తి నెలకొంది. ఇక రెండో క్వాలిఫైయిర్ ను అహ్మదాబాద్ మొతేరా స్టేడియంలో నిర్వహించాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. దీనితో పాటు ఫైనల్ కూడా ఇదే స్టేడియంలో నిర్వహించేందుకు బోర్డు సిద్ధమైనట్టు సమాచారం. ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియంగా బీసీసీఐ దీనిని నిర్మించింది. ఇప్పటికే పలు అంతర్జాతీయ మ్యాచ్ లకు కూడా వేదికగా నిలిచిన ఈ మెగా స్టేడియంలో ఐపీఎల్ ఫైనల్ జరిగితే ఫ్యాన్స్ కు పండుగే.

అయితే ప్లే ఆఫ్స్, ఫైనల్ మ్యాచ్ లకు సంబంధించి ప్రత్యేకంగా బయోబబూల్ రూపొందించాల్సి ఉంటుందని బీసీసీఐ అధికారి ఒకరు వెల్లడించారు. పొరపాటుకు తావు లేకుండా బబూల్ ఏర్పాటు చేస్తే మ్యాచ్ లను విజయవంతంగా నిర్వహించే అవకాశముంది. అటు కోవిడ్ ఆంక్షలు క్రమంగా సడలించిన నేపథ్యంలో ప్లే ఆఫ్స్, ఫైనల్ మ్యాచ్ లకు 75 శాతం మందిని అనుమతించే అవకాశముంటుందని బీసీసీఐ భావిస్తోంది. వచ్చే వారం దీనిపై తుది నిర్ణయం తీసుకోనున్నట్టు బోర్డు వర్గాలు తెలిపాయి.