IPL Auction 2022 : వేలంలో భారీ ధర వారిద్దరికే

ఇండియన్ ప్రీమియర్ లీగ్ వేలం అంటేనే ఆటగాళ్ళపై కాసుల వర్షం కురుస్తుంది.

  • Written By:
  • Updated On - February 4, 2022 / 12:47 PM IST

ఇండియన్ ప్రీమియర్ లీగ్ వేలం అంటేనే ఆటగాళ్ళపై కాసుల వర్షం కురుస్తుంది. స్టార్ ప్లేయర్స్ కోసం ఫ్రాంచైజీలు ఎగబడతాయి… అదే సమయంలో యువక్రికెటర్లూ రాత్రికి రాత్రికే కోటీశ్వరులవుతారు. ఫిబ్రవరి 12,13 తేదీల్లో జరగనున్న ఆటగాళ్ళ వేలంపైనే ఇప్పుడు అందరి చూపూ ఉంది. వేలానికి సంబంధించి పలువురు మాజీ క్రికెటర్లు తమ తమ అంచనాలు వెల్లడిస్తున్నారు. తాజాగా ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్ బ్రాడ్ హగ్ ఈ సారి వేలంలో భారీ ధర దక్కించుకోబోయే ఇద్దరు ఆటగాళ్ళను అంచనా వేశాడు. హగ్ అంచనా ప్రకారం ఢిల్లీ క్యాపిటల్స్ మాజీ ఓపెనర్ శిఖర్ ధావన్ , చెన్నై సూపర్ కింగ్స్ సీనియర్ ప్లేయర్ డుప్లెసిస్ ఈ సారి వేలంలో భారీ ధరకు అమ్ముడవుతారని తెలుస్తోంది. సఫారీ స్టార్ క్రికెటర్ డుప్లెసిస్ కనీసం 11 కోట్ల వరకూ ధర పలుకుతాడని అంచనా వేశాడు. గత కొన్ని సీజన్లుగా అతని నిలకడైన బ్యాటింగ్ , గతంలో జాతీయ జట్టుకు సారథ్యం వహించిన నైపుణ్యం వంటివి డుప్లెసిస్ కు కలిసొస్తాయని చెప్పాడు. ఇక శిఖర్ ధావన్ కూడా నిలకడగా రాణిస్తుండడంతో ఎంత లేదన్నా 7.5 కోట్లు ధర పలుకుతాడని చెప్పుకొచ్చాడు. గత కొన్ని సీజన్లుగా పరుగుల వరద పారిస్తున్న ధావన్ ను ఈ సారి ఢిల్లీ రిటైన్ చేసుకోలేదు.

మరోవైపు వేలంలో వీరిద్దరితో పాటు ఫ్రాంచైజీలు ఆసక్తి చూపించే మరో 8 మంది ఆటగాళ్ళనూ, వారికి లభించబోయే మొత్తాలను కూడా బ్రాడ్ హగ్ అంచనా వేశాడు. కివీస్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ 5 కోట్లు, భారత సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ 5 నుండి 7 కోట్లు, ఆసీస్ పేసర్ కమ్మిన్స్ 7.5 కోట్లు, సఫారీ వికెట్ కీపర్ డికాక్ 5 కోట్ల వరకూ అమ్ముడవుతారని విశ్లేషించాడు. ఇక భారత స్టార్ ప్లేయర్ శ్రేయాస్ అయ్యర్ 4 కోట్లు, సఫారీ పేసర్ రబాడ 4 నుండి 5 కోట్లూ , మహ్మద్ షమీ 5 కోట్లూ , సన్ రైజర్స్ మాజీ ఓపెనర్ డేవిడ్ వార్నర్ 4 కోట్ల వరకూ పలుకుతారని బ్రాడ్ హగ్ అంచనా వేశాడు. వీరితో పాటు మెక్ డ్రెమాట్ , ఎవాన్స్ , టిమ్ డేవిడ్ , జాసన్ సంఘా వంటి విదేశీ ఆటగాళ్ళతో పాటు అవేశ్ ఖాన్ , రాహుల్ చాహర్ , రాహుల్ త్రిపాఠీ , షారూఖ్ ఖాన్ వంటి యువ ఆటగాళ్ళు జాక్ పాట్ కొడతారని ఈ ఆసీస్ మాజీ స్పిన్నర్ అంచనా వేశాడు.