Site icon HashtagU Telugu

IPL 2022: ఇంగ్లీష్ క్రికెటర్లకు బీసీసీఐ షాక్

Bcci

Bcci

ఐపీఎల్ 15వ సీజన్ ఆసక్తికరంగా సాగుతున్న వేళ ఇంగ్లాండ్ ఆటగాళ్ళకు బీసీసీఐ షాకిచ్చింది. ముందస్తు సమాచారం లేకుండా చివరి క్షణంలో లీగ్ నుంచి వైదొలగిన పలువురు ఇంగ్లండ్ క్రికెటర్లపై బీసీసీఐ గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. జేసన్‌ రాయ్‌, అలెక్స్‌ హేల్స్‌ , మార్క్‌ వుడ్ లపై కఠిన చర్యలు తీసుకోవాలని భావిస్తోంది. ఈమేరకు ఫ్రాంచైజీలు ప్రతిపాదన తెచ్చినట్టు సమాచారం. తాజాగా జరిగిన ఐపీఎల్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ సమావేశంలోనూ దీనిపై చర్చ జరిగింది. వేలంలో ఆటగాళ్లను కొనుగోలు చేసే ముందు తాము ఎన్నో ప్రణాళికలు వేసుకుంటామని, నచ్చిన ఆటగాళ్లను సొంతం చేసుకునేందుకు కోట్లు ఖర్చుపెడుతున్నామని ఫ్రాంచైజీలు చెబుతున్నాయి. అయితే వేలంలో పాల్గొన్న కొందరు క్రికెటర్లు టోర్నీకి ముందు అనూహ్యంగా తప్పుకోవడంతో తమ ప్రణాళికలతో పాటు జట్టు కూర్పుకు కూడా ఇబ్బందులు వస్తున్నాయన్న విషయాన్ని బీసీసీఐ దృష్టికి తీసుకొచ్చాయి. అందుకే వేలంలో పేర్లు నమోదు చేసుకుని, ఫ్రాంచైజీలు కొనుగోలు చేసిన తర్వాత లీగ్ నుంచి తప్పుకోవడం సరైంది కాదని ఫ్రాంచైజీలు వ్యాఖ్యానించాయి. దీనిపై బీసీసీఐ ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని, ఆటగాళ్ళపై చర్యలకు కూడా వెనుకాడొద్దని కోరినట్టు సమాచారం. అటు బీసీసీఐ కూడా ఈ విషయంలో ఫ్రాంఛైజీలకు మద్దతుగా నిలిచింది.ఇటీవల వేలంలో పాల్గొని టోర్నీకి ముందు తప్పుకున్న విదేశీ క్రికెటర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని భావిస్తోంది. బోర్డు ప్రతినిధి ఒకరు ఈ విషయాన్ని ధృవీకరించారు.

ఇలా వ్యవహరించే ఆటగాళ్ళను కొన్నాళ్ళు లీగ్‌లో పాల్గొనకుండా నిబంధనలు తీసుకొచ్చే ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. జరిమానా కూడా విధించే అవకాశం కూడా ఉందని తెలుస్తోంది. ఈ సీజన్‌కు సంబంధించి పలువురు ఇంగ్లాండ్ క్రికెటర్లు వేలంలో పాల్గొని తర్వాత తప్పుకున్నారు. గతేడాది ఐపీఎల్‌ సీజన్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు ప్రాతినిథ్యం వహించిన జాసన్ రాయ్‌ మెరుగ్గా రాణించాడు. దీంతో అతడిని కనీస ధర రూ. 2కోట్లకు వేలంలో గుజరాత్ టైటాన్స్ దక్కించుకుంది. రాయ్‌ను ఓపెనర్‌గా భావించాలని ప్రణాళికల కూడా సిద్ధం చేసుకుంది. అయితే టోర్నీ ఆరంభానికి కొన్ని రోజుల ముందు లీగ్ నుంచి తప్పుకుంటున్నట్టు రాయ్ ప్రకచించాడు. రెండు నెలల పాటు బయోబబుల్‌లో గడపడం చాలా కష్టంగా భావిస్తున్నాని చెప్పుకొచ్చాడు. దీంతో షాక్‌కు గురైన గుజరాత్ మరో ఆటగాడిని వెతుక్కోవాల్సి వచ్చింది. ఇక మరో ఇంగ్లాండ్ ఆటగాడు అలెక్స్ హేల్స్‌ని కనీధర రూ.1.5 కోట్లకు కోల్‌కత్తా నైట్‌రైడర్స్ కొనుగోలు చేసింది . హేల్స్ కూడా బబూల్‌లో ఉండలేనంటూ తప్పుకున్నాడు. ఇలా చివరి నిమిషాల్లో లీగ్‌ నుంచి తప్పుకున్న ఆటగాళ్ళపై చర్యలు తీసుకోవాలని ఫ్రాంచైజీలు కోరడంతో బీసీసీఐ ఆ దిశగా ఆలోచిస్తోంది. అయితే ఇంగ్లండ్‌ స్టార్‌ బౌలర్‌ మార్క్‌వుడ్ కూడా ఈ సీజన్ నుంచి తప్పుకున్నాడు. అతడిని లక్నో సూపర్‌ జెయింట్స్‌ రూ.7.25 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసింది. అయితే గాయం కారణంగా ఈ సీజన్ నుండి వైదొలిగాడు. గాయాలతో తప్పుకున్న ఆటగాళ్ళపై మాత్రం ఎలాంటి చర్యలు ఉండవు. అయితే ఆటగాళ్ళ గాయాలకు సంబంధించి ఆయా దేశాల బోర్డులు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది.