Site icon HashtagU Telugu

IPL Auction 2022 : కోట్లు కొల్లగొట్టిన ఆల్‌రౌండర్లు

Ipl Auction New

Ipl Auction New

ఐపీఎల్ వేలంలో రెండోరోజు ఫ్రాంచైజీలు ఆల్‌రౌండర్లపై దృష్టిపెట్టాయి. టీ ట్వంటీ ఫార్మేట్‌లో అత్యంత కీలకంగా ఉండే ఆల్‌రౌండర్ల కోసం కోట్లు కుమ్మరించాయి. ముఖ్యంగా విదేశీ స్టార్ ప్లేయర్స్‌ కోసం బాగానే వెచ్చించాయి. ఈ క్రమంలో ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ లివింగ్‌స్టోన్‌ జాక్‌పాట్ కొట్టాడు. ఈ ఇంగ్లీష్ ఆల్‌రౌండర్ కోసం ఫ్రాంచైజీల మధ్య గట్టిపోటీ నడిచింది. టీ ట్వంటీ ఫార్మేట్‌లో మంచి రికార్డు ఉన్న లివింగ్ స్టోన్ ఈ సారి అత్యధిక చివరి వరకూ ఉత్కంఠగా సాగిన పోటీలో ఈ ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్‌ను 11.5 కోట్లకు పంజాబ్ కింగ్స్ దక్కించుకుంది. ఇదిలా ఉంటే మరో ఆల్‌రౌండర్ టిమ్ డేవిడ్‌కు భారీ ధర పలికింది. సింగపూర్‌లో పుట్టి ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఉంటున్న టిమ్ డేవిడ్ కోసం ఫ్రాంచైజీలు నువ్వా నేనా అన్నట్టు పోటీపడ్డాయి. 8.25 కోట్లకు టిమ్‌ను ముంబై దక్కించుకుంది. అంతర్జాతీయ క్రికెట్‌లో ఎవరి పెద్దగా తెలియని టిమ్ డేవిడ్ పలు విదేశీ టీ ట్వంటీ లీగ్స్‌లో మాత్రం దుమ్మురేపుతున్నాడు. ఫినిషర్‌గానూ, బౌలర్‌గానూ రాణిస్తుండడంతో అతనికి డిమాండ్ ఏర్పడింది. అలాగే విండీస్ ఆల్‌రౌండర్లు షెఫర్డ్ , ఓడియన్ స్మిత్‌కు భారీ ధర పలికింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ షెఫర్డ్‌ను 7.75 కోట్లకు దక్కించుకుంటే…ఓడియన్ స్మిత్‌ కోసం పంజాబ్ 6 కోట్ల రూపాయలు వెచ్చించింది.

అటు ఇంగ్లాండ్ స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్‌ను ముంబై ఇండియన్స్ 8 కోట్లకు దక్కించుకుంది. ఇక సఫారీ క్రికెటర్ మార్కో జెన్సన్‌ను సన్‌రైజర్స్ 4.2 కోట్లకు కొనుగోలు చేస్తే… విండీస్ ఆటగాడు పావెల్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ 2.8 కోట్లతో సొంతం చేసుకుంది. ఇక శ్రీలంక స్పిన్నర్ చమీరా కోసం లక్నో 2 కోట్లు వెచ్చించింది. అలాగే చెన్నై సూపర్‌కింగ్స్ మిఛెల్ శాంట్నర్‌ను 1.9 కోట్లకు , కాన్వేను 1 కోటికి, ఆడమ్ మిలైన్‌ను 1.9 కోట్లకు దక్కించుకుంది. టైమల్ మిల్స్ కోసం ముంబై 1.6 కోట్లు వెచ్చించింది. ఇక తొలిరోజు వేలంలో అమ్ముడవని డేవిడ్ మిల్లర్‌ కోసం చివర్లో ఫ్రాంచైజీలు ఆసక్తి కనబరిచాయి. 3 కోట్ల రుపాయలకు గుజరాత్ టైటాన్స్ సొంతం చేసుకుంది. అలాగే వికెట్ కీపర్ మాథ్యూవేడ్‌ను కూడా గుజరాత్ 2.4 కోట్లకు దక్కించుకుంది. మరోవైపు రెండోరోజు వేలంలో భారత యువ ఆటగాళ్ళు జాక్‌పాట్ కొట్టారు. శివమ్ దూబే, చేతన్ సకారియా భారీ ధర పలికారు. 4.2 కోట్లకు సకారియాను ఢిల్లీ కొనుగోలు చేయగా.. 4 కోట్లతో దూబేను చెన్నై దక్కించుకుంది. దేశవాళీ క్రికెట్‌లో రాణిస్తున్న వైభవ్ ఆరోరా కోసం ఫ్రాంచైజీల మధ్య పోటీ నడిచింది. అరోరాను 2 కోట్లకు పంజాబ్ సొంతం చేసుకుంది. వీరితో పాటు జయంత్ యాదవ్ 1.7 కోట్లకు, విజయ్ శంకర్ 1.4 కోట్లకు , కృష్ణప్ప గౌతమ్ 90 లక్షలకు అమ్ముడయ్యారు. కాగా అండర్ 19 ప్రపంచకప్‌ను గెలిచిన భారత యువ ఆటగాళ్ళలో రాజ్‌ బవా జాక్‌పాట్ కొట్టాడు. బవాను 2 కోట్లకు పంజాబ్ కింగ్స్‌ దక్కించుకుంటే… మరో క్రికెటర్ హంగర్కేకర్‌ను 1.5 కోట్లకు చెన్నై సొంతం చేసుకుంది. అటు అండర్ 19 కెప్టెన్ యశ్ ధుల్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ 50 లక్షలకే కొనుగోలు చేసింది. కాగా తొలిరోజు వేలంలో అమ్ముడు కాని ఇశాంత్ శర్మ, మహ్మద్ నబీ, వృద్ధిమాన్ సాహా వంటి ఆటగాళ్ళు చివరి గంటలో అమ్ముడయ్యారు. ఇదిలా ఉంటే పలువురు స్టార్ ప్లేయర్స్‌కు షాక్ తగిలింది. సురేష్ రైనా, ఇశాంత్ శర్మ, పియూష్ చావ్లా , స్టీవ్ స్మిత్ వంటి ఆటగాళ్ళు వేలంలో అమ్ముడుపోలేదు.