IPL 2022 Auction: శ్రీశాంత్ కు ఛాన్సుందా ?

ఇండియన్ ప్రీమియర్ లీగ్ మెగా వేలానికి ఫ్రాంచైజీలు సన్నద్ధమవుతున్నాయి

  • Written By:
  • Publish Date - February 4, 2022 / 01:15 PM IST

ఇండియన్ ప్రీమియర్ లీగ్ మెగా వేలానికి ఫ్రాంచైజీలు సన్నద్ధమవుతున్నాయి. ఇప్పటికే ఆయా జట్ల కోచ్ లు, యాజమాన్యాలు, డైరెక్టర్లు వేలంలో ఎవరిని తీసుకోవాలనే దానిపై చర్చిస్తూ వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి. ఈ వేలం కోసం 590 మంది ఆటగాళ్ళతో బీసీసీఐ తుది జాబితాను కూడా విడుదల చేసింది. ఈ జాబితాలో కేరళ స్పీడ్ స్టర్, భారత మాజీ పేసర్ శ్రీశాంత్ కూడా చోటు దక్కించుకున్నాడు.2005లో భారత జట్టు అరంగేట్రం చేసిన శ్రీశాంత్ తన ఐపీఎల్ కెరీర్ లో పంజాబ్ , కొచ్చి టస్కర్స్ కేరళ, రాజస్థాన్ రాయల్స్ జట్లకు ఆడాడు. అయితే 2013లో స్పాట్ ఫిక్సింగ్ వివాదంలో చిక్కుకున్నాడు. దీంతో బీసీసీఐ అతనిపై జీవితకాల నిషేధం విధించింది. తర్వాత కోర్టు ద్వారా పోరాడిన శ్రీశాంత్ చివరికి తనపై నిషేధాన్ని ఎత్తివేశాలా కేసు గెలిచాడు. తర్వాత కేరళ రంజీ జట్టులో మళ్ళీ చోటు సంపాదించడంతో మైదానంలోకి అడుగుపెట్టాడు. కాగా 50 లక్షల బేస్ ప్రైస్ తో శ్రీశాంత్ వేలంలో ఉన్నాడు. అయితే ఫ్రాంచైజీలు ఈ కేరళ ఎక్స్ ప్రెస్ ను తీసుకుంటాయా అనేది ఆసక్తికరంగా మారింది.

ఏ ఫార్మేట్ లోనైనా అనుభవం ఉన్న ఆటగాళ్ళు చాలా అవసరం. ముఖ్యంగా టీ ట్వంటీ ఫార్మేట్ లో అందులోనూ బౌలర్లకు ప్రాధాన్యత ఉంటుంది. శ్రీశాంత్ కు ఉన్న అనుభవం వేలంలో అడ్వాంటేజ్ అవుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కనీస ధరకే శ్రీశాంత్ ను తీసుకునే అవకాశముందని భావిస్తున్నారు. పవర్ ప్లేలో అతనికి ఉన్న లైన్ అండ్ లెంగ్త్ కూడా కలిసొస్తుందని చెప్పొచ్చు, ఇటీవల సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలోనూ శ్రీశాంత్ ఆకట్టుకున్నాడు. జాతీయ జట్టులోకి శ్రీశాంత్ పునరాగమనం దాదాపు అసాధ్యమన్న అభిప్రాయం వినిపిస్తున్న వేళ ఐపీఎల్ లోనైనా తన సత్తా నిరూపించుకునేందుకు ఎదురుచూస్తున్నాడు. నిషేధం ఎత్తివేసిన తర్వాత ఫిట్ నెస్ సాధించి మళ్ళీ రంజీ జట్టులోకి రావడం, తన బౌలింగ్ లో పదును తగ్గలేదని రుజువు చేసుకున్నాడు.

ఇదిలా ఉంటే శ్రీశాంత్ కు సానుకూలంగా లేని అంశాలు కూడా ఉన్నాయి. వాటిలో ప్రధానమైంది వయసు. 39 ఏళ్ళ ఈ కేరళ పేసర్ ను మూడు సీజన్ల కోసం తీసుకునే సాహసం ఫ్రాంచైజీలు చేస్తాయా అనేది అనుమానమే. ఎందుకంటే భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఫ్రాంచైజీలు సాధారణంగా యువ, సీనియర్ క్రికెటర్లవైపే మొగ్గుచూపుతుంటాయి. దీంతో ఏజ్ ఫ్యాక్టర్ శ్రీశాంత్ ఐపీఎల్ కెరీర్ ను డిసైడ్ చేసే అవకాశముంది. అటు పూర్తిస్థాయి ప్రాక్టీస్ లేకపోవడం మరో మైనస్ పాయింట్. రంజీ జట్టులో చోటు దక్కినా… రీ ఎంట్రీ తర్వాత కేవలం సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీ మాత్రమే ఆడాడు. ఆ తర్వాత మేజర్ టోర్నీలు లేకపోవడంతో శ్రీశాంత్ కు సరైన ప్రాక్టీస్ లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో ఫ్రాంచైజీలు ఎంతవరకూ ఈ కేరళ స్పీడ్ స్టర్ ను పరిగణలోకి తీసుకుంటాయో లేదో వేచిచూడాలి.