IPL 2022 Auction: సన్ రైజర్స్ కన్నేసిన ఆల్ రౌండర్లు వీరే

క్రికెట్ లో ఆల్ రౌండర్లకు ఉన్న ప్రాధాన్యత గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ముఖ్యంగా టీ ట్వంటీ ఫార్మేట్ లో వారే మ్యాచ్ ను మలుపుతిప్పుతుంటారు.

  • Written By:
  • Updated On - February 4, 2022 / 12:48 PM IST

క్రికెట్ లో ఆల్ రౌండర్లకు ఉన్న ప్రాధాన్యత గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ముఖ్యంగా టీ ట్వంటీ ఫార్మేట్ లో వారే మ్యాచ్ ను మలుపుతిప్పుతుంటారు. అటు బ్యాట్ తోనూ, ఇటు బంతితోనూ మ్యాజిక్ చేసే ఆటగాళ్ళ పైనే ఫ్రాంచైజీలు దృష్టి పెడతాయి. ప్రస్తుతం ఐపీఎల్ మెగా వేలానికి సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ఫ్రాంచైజీలు వ్యూహాల్లో నిమగ్నమయ్యాయి. ఈ సారి వేలంలో సన్ రైజర్స్ హైదరాబాద్ ఆల్ రౌండర్ల కోసం ప్రయత్నించబోతోంది. ఆ జట్టు టార్గెట్ గా ముగ్గురు ఆల్ రౌండర్లు ఉన్నారు…

1. జాసన్ హోల్డర్ ః
వెస్టిండీస్ కు చెందిన హోల్డర్ గత సీజన్లలోనూ సన్ రైజర్స్ హైదరాబాద్ కు ఆడాడు. ఆసీస్ ఆల్ రౌండర్ మిఛెల్ మార్ష్ గాయపడడంతో హైదరాబాద్ రీప్లేస్ మెంట్ గా హోల్డర్ ను తీసుకుంది. అంచనాలకు తగ్గట్టుగానే ఈ విండీస్ క్రికెటర్ ఆకట్టుకున్నాడు. దాదాపు అవకాశం దక్కిన ప్రతీ మ్యాచ్ లోనూ జట్టుకు ఉపయోగపడ్డాడు. హోల్డర్ తన ఐపీఎల్ కెరీర్ లో 26 మ్యాచ్ లు ఆడి 189 పరుగులు చేయగా…35 వికెట్లు పడగొట్టాడు. దీంతో పాటు జాతీయ జట్టుకు కెప్టెన్ గా అతనికి ఉన్న అనుభవం కూడా సన్ రైజర్స్ కు లాభిస్తుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ హోల్డర్ ను తీసుకుంటే ఉపయోగమే.

2. శార్థూల్ ఠాకూర్ ః

ప్రస్తుతం భారత క్రికెట్ జట్టులో నిలకడగా రాణిస్తున్న ఆటగాళ్ళలో శార్థూల్ ఒకడు. అటు ఐపీఎల్ లోనూ ప్రతీ సీజన్ లో ఆకట్టుకుంటున్నాడు. ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ కు ప్రాతినిథ్యం వహిస్తున్న శార్థూల్ ను ఆ ఫ్రాంచైజీ రిటైన్ చేసుకోలేదు. దీంతో ఈ సారి వేలంలో శార్థూల్ కొత్త జట్టుకు ఆడే అవకాశముంది. శార్థూల్ ఠాకూర్ 61 మ్యాచ్ లలో 67 వికెట్లు పడగొట్టాడు. లోయర్ ఆర్డర్ లో బ్యాట్ తో చెలరేగే సత్తా ఉండడం అతనికి అడ్వాంటేజ్ గా చెప్పొచ్చు.

3. దీపక్ చాహర్ ః
రాజస్థాన్ కు చెందిన ఈ యువ పేసర్ చెన్నై సూపర్ కింగ్స్ కు ఆడుతున్నాడు. అయితే వేలానికి ముందు అతన్ని చెన్నై రిటైన్ చేసుకోలేదు. దీంతో చాహర్ పై సన్ రైజర్స్ హైదరాబాద్ ఆసక్తి చూపిస్తున్నట్టు తెలుస్తోంది. ఆల్ రౌండర్ గా ప్రభావం చూపే అతికొద్ది మందిలో దీపక్ చాహర్ ఉంటాడు. ఇప్పటి వరకూ 63 మ్యాచ్ లలో 59 వికెట్లు పడగొట్టిన చాహర్… ఎకానమీ పరంగానూ ఆకట్టుకున్నాడు. డెత్ ఓవర్స్ లో కీలకమయ్యే ఇలాంటి బౌలర్ ఉండడం సన్ రైజర్స్ కు కలిసొస్తుంది. ఈ ముగ్గురు ఆల్ రౌండర్లలో ఇద్దరినైనా సన్ రైజర్స్ హైదరాబాద్ తీసుకుంటే జట్టుకు లాభిస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.