Harshal Patel: హర్షల్ పటేల్‌కు గాయం.. సఫారీతో సిరీస్‌కు దూరం

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 15వ సీజన్ ముగిసిన వెంటనే టీమిండియా స్వదేశంలో ద‌క్షిణాఫ్రికాతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ ఆడుంది.

  • Written By:
  • Publish Date - May 21, 2022 / 01:10 PM IST

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 15వ సీజన్ ముగిసిన వెంటనే టీమిండియా స్వదేశంలో ద‌క్షిణాఫ్రికాతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ ఆడుంది. జాన్ 9న మొదలు కానున్న ఈ సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లు ఢిల్లీ, క‌ట‌క్‌ ఆతిథ్యమివ్వనుండగా… మూడో టీ20 విశాఖపట్నంలోనూ, చివరి రెండు మ్యాచ్‌లూ రాజ్‌కోట్‌, బెంగ‌ళూరు వేదిక‌గా జ‌ర‌గ‌నున్నాయి. అయితే ఈ టీ20 సిరీస్‌కు ముందు టీమిండియాను వరుస గాయాలు వెంటాడుతున్నాయి. సీనియర్లకు విశ్రాంతినివ్వాలని బీసీసీఐ భావిస్తుండగా.. పలువురు యువక్రికెటర్లకు అవకాశం దక్కనుంది. అయితే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు స్టార్ పేసర్ టీమిండియా యువ పేసర్‌ హర్షల్ పటేల్ గాయం కారణంగా దక్షిణాఫ్రికాతో టీ20లకు దూరమయ్యే అవకాశం కనిపిస్తోంది.

గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో హర్షల్ పటేల్ చేతికి గాయమైంది. దీంతో ఈ మ్యాచ్‌లో కేవలం ఒక్క ఓవర్‌ మాత్రమే బౌలింగ్‌ చేసిన హర్షల్ పటేల్ మైదానం వీడాడు. హర్షల్ పటేల్ గాయం తీవ్రత ఎక్కువగా ఉండడంతో అతనికి 6 వారాల విశ్రాంతి అవసరమని వైద్యులు చెప్పినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే హర్షల్ పటేల్ సౌతాఫ్రికా సిరీస్‌కు దూరమవనున్నట్లు సమాచారం. గాయాలతో ఇప్పటికే కీలక ఆటగాళ్లు రవీంద్ర జడేజా, సూర్య కుమార్ యాదవ్, దీపక్‌ చాహర్‌ ఈ సిరీస్‌కు దూరమయ్యారు. మరోవైపు టీమిండియాతో టీ20 సిరీస్‌కు దక్షిణాఫ్రికా 16 మంది సభ్యలతో కూడిన తమ జట్టును ఇటీవల ప్రకటించింది. ఈ జట్టులో ఐపీఎల్ 2022లో సీజన్‌లో ఆడుతున్న ఆటగాళ్లే సగం మంది వరకు ఉన్నారు. ఐపీఎల్‌లో ఆడుతున్న కారణంగా భారత పిచ్‌లు, ఇక్కడి వాతావరణ పరిస్థితులపై పూర్తి అవగాహన ఉంటుందనే కారణంగా క్రికెట్ దక్షిణాఫ్రికా సెలెక్టర్లు ఐపీఎల్ ఆటగాళ్లనే ఎక్కువ మందిని ఎంపిక చేశారు.