Site icon HashtagU Telugu

Mitchell Marsh : ఐపీఎల్ నుంచి మిఛెల్ మార్ష్ ఔట్ ?

Mitchell Marsh

Mitchell Marsh

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 15వ సీజన్ ను ఢిల్లీ క్యాపిటల్స్‌ విజయంతో ఆరంభించింది. ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. 178 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంత్ సేన సమష్టిగా రాణించి పాయింట్ల ఖాతా తెరిచింది. అయితే తొలి మ్యాచులో గెలిచి మంచి జోష్ లో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకి తాజాగా కోలుకోలేని షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్‌ ఆల్‌రౌండర్‌ మిచెల్‌ మార్ష్ గాయం కారణంగా లీగ్‌ నుంచి తప్పుకోనున్నట్లు సమాచారం. ప్రస్తుతం పాకిస్థాన్ పర్యటనలో ఉన్న మిచెల్ మార్ష్ తాజాగా ప్రాక్టీస్ చేస్తూ గాయపడ్డాడు. ఈ క్రమంలోనే పాకిస్థాన్ తో సిరీస్ కు కూడా దూరమైన మిచెల్ మార్ష్ గాయం తీవ్రత ఎక్కువగా ఉండడంతో స్కానింగ్ కోసం ఆసుపత్రికి పంపించినట్లు సమాచారం. ఇక మిచెల్ మార్ష్ గాయం గురించి ఆ జట్టు పరిమిత ఓవర్ల సారథి ఆరోన్ ఫించ్ మాట్లాడుతూ.. తాజాగా నెట్ ప్రాక్టీస్ సెషన్ లో మిచెల్ మార్ష్ గాయపడ్డాడు.. ప్రస్తుతం ఆటను క్రికెట్ ఆస్ట్రేలియా వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడు. అతని గాయం తీవ్ర దృష్ట్యా పాకిస్థాన్ తో జరగనున్న సిరీస్‌కి దూరంగా ఉండనున్నాడు అని పేర్కొన్నాడు. ఊహించని ఈ సంఘటనతో ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీతో పాటుగా అభిమానులు ఒక్కసారిగా షాకయ్యారు. అంతకుముందు ఐపీఎల్‌ 2022 మెగా వేలంలో భాగంగా మిచెల్ మార్ష్ కు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు రూ. 6 కోట్లు చెల్లించి కొనుగోలు చేసింది. ఆల్ రౌండర్ గా అద్భుతమైన రికార్డున్న మార్ష్ గత సీజన్ వరకూ సన్ రైజర్స్ హైదరాబాద్ కు ప్రాతినిథ్యం వహించాడు. అయితే తరచుగా గాయాలు, ఫిట్ నెస్ సమస్యల కారణంగా ఐపీఎల్ కు దూరమవుతున్నాడు. ఇప్పుడు 15వ సీజన్ లోనూ గాయపడడం ఢిల్లీ ఫ్రాంచైజీ యాజమాన్యాన్ని కలవరపెడుతోంది. ఇక ఐపీఎల్‌ 15వ సీజన్‌ ప్రారంభానికి ముందు ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టు స్టార్‌ పేసర్‌, దక్షిణాఫ్రికా బౌలర్‌ అన్రిచ్‌ నోర్జే కూడా గాయం కారణంగా కొన్ని మ్యాచులకు దూరమయ్యాడు.

Exit mobile version