వచ్చే నెలలో జరగనున్న ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ (WTC Final)కు ముందు భారత క్రికెట్ జట్టు (Teamindia)కు ఒకదాని తర్వాత ఒకటి ఎదురుదెబ్బ తగులుతోంది. ఓ వైపు సోమవారం నాడు కేఎల్ రాహుల్ గాయపడగా, స్టార్ బౌలర్ జయదేవ్ ఉనద్కత్ గాయపడ్డాడనే వార్తలు కూడా తెరపైకి వచ్చాయి. ఐపీఎల్‌లో లక్నో సూపర్ జెయింట్స్ (LSG) తరఫున ఆడుతున్న ఫాస్ట్ బౌలర్ జయదేవ్ ఉనద్కత్ ఒక రోజు ముందు భుజం గాయంతో బాధపడ్డాడు.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో LSG నెట్ ప్రాక్టీస్ ఫుటేజీని చూపించడం ద్వారా IPL ప్రసారకర్తలు ఈ వార్తలను వెల్లడించారు. నెట్స్ వద్ద ప్రాక్టీస్ చేస్తుండగా ఉనద్కత్ జారిపడి భుజానికి గాయమైనట్లు వీడియోలో చూపించారు. గాయంపై LSG ఇంకా అధికారిక ప్రకటన విడుదల చేయనప్పటికీ, ఉనద్కత్‌కు టీమ్ ఫిజియో వెంటనే ఐస్ ప్యాక్‌లతో సహాయం అందించారు.
Jaydev Unadkat injury pic.twitter.com/qsOqHpnbBp
— 🅒🅡🅘︎🅒︎🄲🅁🄰🅉🅈𝗠𝗥𝗜𝗚𝗨™ 🇮🇳❤️ (@MSDianMrigu) May 1, 2023
ఒకవేళ ఉనద్కత్ డబ్ల్యూటీసీ ఫైనల్‌కు దూరమైతే.. మరో ఫాస్ట్ బౌలర్ ఉమేష్ యాదవ్ కూడా గాయంతో బాధపడుతుండడంతో భారత్‌కు అది కచ్చితంగా పెద్ద దెబ్బే. గాయం కారణంగా కోల్‌కతా నైట్ రైడర్స్ చివరి మ్యాచ్‌కు దూరమయ్యాడు. టీమ్ ఇండియాలో మిగిలిన ఫాస్ట్ బౌలర్లు శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్. ఇంతలో ఒక నివేదిక ప్రకారం.. WTC ఫైనల్ కోసం ఇండియా ఐదుగురు సభ్యుల స్టాండ్-బై జాబితాలో ఇద్దరు పేసర్లు ఉన్నారు. ఇందులో నవదీప్ సైనీ, ముఖేష్ కుమార్ ఉన్నారు. డబ్ల్యూటీసీ ట్రోఫీకి భారత్ గ్రాండ్ ఫినాలేలోకి ప్రవేశించడం ఇది రెండోసారి. టోర్నీ ప్రారంభ ఎడిషన్‌లో లార్డ్స్‌లో జరిగిన ఫైనల్లో భారత్ ఎనిమిది వికెట్ల తేడాతో న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయింది. జూన్ 7 నుంచి ఆస్ట్రేలియాతో భారత్ పోటీపడనుంది.
భారత WTC ఫైనల్ టీమ్: రోహిత్ శర్మ (C), శుభమన్ గిల్, ఛెతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, అజింక్యా రహానే, కేఎల్ రాహుల్, కేఎస్ భరత్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, మహమ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ఉమేష్ యాదవ్, జైదేవ్ ఉనద్కత్.