Site icon HashtagU Telugu

IPL 2022 : ఐపీఎల్ నుంచి చెన్నై స్టార్ ప్లేయర్ ఔట్

Ravindra Jadeja (1)

Ravindra Jadeja (1)

ఐపీఎల్ 15 వ సీజన్ లో వరుస గాయాలు చెన్నై సూపర్ కింగ్స్ ను వెంటాడుతూనే ఉన్నాయి. ఇప్పటికే పలువురు ఆటగాళ్ళు గాయాలతో దూరమవగా తాజాగా మరో షాక్ తగిలింది. గాయం కారణంగా ఆ టీమ్‌ ఆల్‌రౌండర్‌, మాజీ కెప్టెన్‌ రవీంద్ర జడేజా మిగతా మ్యాచ్‌లన్నింటికీ దూరమయ్యాడు. అతడు పక్కటెముకల గాయంతో బాధపడుతున్నట్లు సీఎస్కే టీమ్‌ వెల్లడించింది. ఇదే గాయం కారణంగా ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌కు అతడు అందుబాటులో లేడని, అయితే మెడికల్‌ సిబ్బంది సూచన మేరకు ఈ సీజన్‌లో తర్వాతి మ్యాచ్‌లు కూడా జడేజా ఆడటం లేదని మేనేజ్‌మెంట్‌ ప్రకటించింది.

ఆర్సీబీతో మ్యాచ్ సందర్భంగా బౌండరీ దగ్గర ఫీల్డింగ్‌ చేస్తున్న జడేజా ఈ గాయం చేసుకున్నాడు. రెండు రోజుల తర్వాత కూడా జడేజా గాయంలో ఎలాంటి మార్పూ రాలేదు. అటు ఆ టీమ్‌ ప్లేఆఫ్స్‌ చేరే అవకాశాలు అంత మెరుగ్గా ఏమీ లేదు. ఈ సీజన్‌లో మరో మూడు మ్యాచ్‌లు ఆడాల్సి ఉన్న ఆ టీమ్‌.. అన్నింట్లోనూ గెలవడంతోపాటు అటు ఆర్సీబీ, రాజస్థాన్‌ రాయల్స్‌ తమ మిగిలిన మ్యాచ్‌లలో ఓడిపోవాలని కోరుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

అలా అయితేనే చెన్నై ప్లేఆఫ్స్‌ ఆశలు సజీవంగా ఉంటాయి. ఢిల్లీతో మ్యాచ్‌లో అతడు ఆడకపోవడంతో.. శివమ్‌ దూబె అతని స్థానాన్ని భర్తీ చేశాడు. గురువారం ముంబై ఇండియన్స్‌తో ఆ తర్వాత గుజరాత్‌ టైటన్స్‌, రాజస్థాన్‌ రాయల్స్‌తో చెన్నై కు మ్యాచ్‌లు ఉన్నాయి. ఇదిలా ఉంటే ఈ సీజన్‌లో జడేజా ఫామ్‌ కూడా అంత గొప్పగా ఏమీ లేదు. 10 మ్యాచ్‌లలో కేవలం 116 రన్స్‌ చేసిన జడ్డూ.. ఐదు వికెట్లు మాత్రమే తీశాడు. ఈ సీజన్ కి జడేజా కొన్ని మ్యాచ్‌లకు చెన్నైకి కెప్టెన్‌గా కూడా ఉన్నాడు. అయితే ఆ టీమ్‌ వరుస ఓటములతో కెప్టెన్సీ వదిలేసి మళ్లీ ధోనీకి అప్పగించాడు.

Exit mobile version