Bomb Threats: పాకిస్తాన్‌తో యుద్ధం లాంటి పరిస్థితుల మధ్య మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లోని అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం హోల్కర్ స్టేడియంను బాంబుతో పేల్చివేస్తామని బెదిరింపు (Bomb Threats) వచ్చింది. తుకోగంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హోల్కర్ స్టేడియం, ఒక ఆసుపత్రిని బాంబుతో పేల్చివేస్తామని బెదిరింపు రావడంతో అధికారుల్లో ఒక్కసారిగా కలకలం రేగింది. సమాచారం ప్రకారం.. మధ్యప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ (MPCA) సీఈఓ రోహిత్ పండిత్‌కు గుర్తు తెలియని ఈ-మెయిల్ ద్వారా బెదిరింపు వచ్చింది. ఈ మెయిల్‌లో తమను పాకిస్తాన్ స్లీపర్ సెల్ సభ్యులమని చెప్పుకుంటూ “మేము నగరంలో తిరుగుతున్నాం. మీరు ‘ఆపరేషన్ సిందూర్’ చేశారు. ఇలాంటి సంఘర్షణలు చేయకండి. లేకపోతే మంచిది కాదు” అని ఆంగ్లంలో రాసిన సందేశం ఉంది.
పోలీసుల చర్యలు
ఈ-మెయిల్ రాగానే MPCA వెంటనే తుకోగంజ్ పోలీసులకు సమాచారం అందించింది. తుకోగంజ్ పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జ్ జితేంద్ర యాదవ్ తెలిపిన వివరాల ప్రకారం.. బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్‌తో స్టేడియంలో సమగ్ర తనిఖీ చేయగా ఎలాంటి అనుమానాస్పద వస్తువూ లభించలేదు. ఈ బెదిరింపు నకిలీదని తేలింది. క్రైమ్ బ్రాంచ్ టెక్నికల్ టీమ్, సైబర్ నిపుణుల సహాయంతో ఈ-మెయిల్ మూలాన్ని గుర్తించే పనిలో నిమగ్నమైంది. ప్రాథమికంగా ఈ ఈ-మెయిల్ బెదిరించడం కోసం “కాపీ-పేస్ట్” చేసినట్లు కనిపిస్తున్నప్పటికీ పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. నగరంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేసి, ప్రతి కార్యకలాపంపై నిఘా ఉంచారు.
Also Read: IPL: ఐపీఎల్ రీషెడ్యూల్.. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు నగరాల్లో మ్యాచ్‌లు?
గతంలో ఇండోర్‌లో బాంబు బెదిరింపులు
ఇండోర్‌లో గతంలో కూడా ఇలాంటి బెదిరింపులు వచ్చిన చరిత్ర ఉంది. 2024 జూన్ 12న ఇండోర్ ఎయిర్‌పోర్ట్ డైరెక్టర్‌కు ఎయిర్‌పోర్ట్‌ను బాంబుతో పేల్చివేస్తామని ఈ-మెయిల్ ద్వారా బెదిరింపు వచ్చింది. 2024 ఏప్రిల్ 29న కూడా ఇలాంటి నకిలీ ఈ-మెయిల్ ఎయిర్‌పోర్ట్‌కు వచ్చింది. 2024 ఏప్రిల్ 18న ఇండోర్, భోపాల్, జబల్‌పూర్‌తో సహా మధ్యప్రదేశ్‌లోని 50 ఎయిర్‌పోర్ట్‌లకు బాంబు బెదిరింపులు వచ్చాయి. 2025 ఫిబ్రవరిలో ఇండోర్‌లోని రెండు ప్రైవేట్ స్కూళ్లకు తమిళ భాషలో రాసిన బాంబు బెదిరింపు లేఖలు వచ్చాయి. ఇవి కూడా నకిలీవని తేలింది. ఈ కేసులపై సైబర్ టీమ్ ఇప్పటికీ దర్యాప్తు చేస్తోంది.